Bandi Sanjay sensational comments:ట్యాపింగ్ కేసు నిందితులకు ఉరి శిక్ష విధించినా తప్పు లేదు - బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
Phone tapping case: ట్యాపింగ్ కేసు నిందితులకు ఉరిశిక్ష విధించినా తప్పులేదని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ట్యాపింగ్ కేసులో సాక్షిగా సిట్ ఎదుట హాజరైన తర్వాత మీడియాతో మాట్లాడారు.

Phone tapping case Bandi Sanjay sensational comments: వావి వరసుల్లేకుండా, ఎవరు ఏమిటో చూసుకోకుండా ఫోన్లను ట్యాప్ చేశారని.. ట్యాపింగ్ కేసు నిందితులకు ఉరిశిక్ష వేసినా తప్పు లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షిగా ఆయన సిట్ ఎదుట హాజరయ్యారు. దాదాపుగా గంట సేపు విచారణ తర్వాత బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. తన ఫోన్లను ట్యాప్ చేసిన విధానం చూసి తాను షాక్‌కు గురయ్యానన్నారు. మావోయిస్టుల ఫోన్ లు ట్యాప్ చేయాల్సింది పోయి మా ఫోన్లు ట్యాప్ చేశారన్నారు. సిట్ అధికారులకు ఆధారాలు సమర్పించే సమయంలో నేనే షాక్ కి గురయ్యానని తెలిపారు. కేవలం నా ఒక్కడి ఫోనే అనేక సార్లు ట్యాప్ చేశారన్నారు. ఫోన్ ట్యాపింగ్ బాధితుల్లో హరీష్ రావు, కవిత కూడా ఉన్నారని.. వావీవరసలు లేకుండా ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడ్డారని విమర్శించారు.
బండి సంజయ్ తన ఫోన్‌తో పాటు తన కుటుంబ సభ్యులు, సిబ్బంది, అనుచరుల ఫోన్‌లను కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ట్యాప్ చేశారని తాను తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్‌కు అత్యధికంగా గురైన వ్యక్తిని అని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, బంధువుల ఫోన్‌లను కూడా ట్యాప్ చేశారని వెల్లడించారు. తన ఫోన్‌ను మావోయిస్టుల జాబితాలో చేర్చి ట్యాపింగ్ చేసినట్లు తెలిపారు. ఆశ్చర్యకరంగా, కేసీఆర్ అల్లుడి పేరు కూడా ఈ జాబితాలో ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. సిట్‌కు తన వద్ద ఉన్న ఆధారాలు, సమాచారాన్ని అందజేసినట్లు బండి సంజయ్ తెలిపారు. సిట్ అధికారులు ఫోన్ ట్యాపింగ్ వివరాలను వెల్లడించినప్పుడు తాను షాక్‌కు గురైనట్లు, భార్యాభర్తల ఫోన్‌లను కూడా ట్యాప్ చేసినందుకు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని "మూర్ఖంగా" వ్యవహరించిందని విమర్శించారు.
బండి సంజయ్ సిట్ విచారణపై పూర్తి నమ్మకం లేదని, కాంగ్రెస్ , బీఆర్ఎస్ ప్రభుత్వాలు ఈ కేసులో "డ్రామా" ఆడుతున్నాయని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబంలో ఒక్కరినీ ఇప్పటివరకు అరెస్ట్ చేయకపోవడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని విమర్శించారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ బంధువులను కూడా సిట్ విచారణకు పిలవాలని సూచించినట్లుగా బండి సంజయ్ తెలిపారు. ఈ కేసులో సమగ్ర విచారణ జరగాలని, నిజాలు బయటకు రావాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం సిట్‌కు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం లేదని ఆరోపించారు.
టీబీజేపీ చీఫ్‌గా ఎంపికయినప్పటి నుంచి తన చుట్టూ నిఘా పెట్టారన్నారు. తమ ఇంట్లో పని చేసే సిబ్బంది ఫోన్లూ సైతం ట్యాప్ చేశారన్నారు. ఈ ఫోన్ల ట్యాపింగ్ వెనుక బీఆర్ఎస చీఫ్ కేసీఆర్ పాత్ర ఉందని స్పష్టం చేశారు. కేసీఆర్ పాలనలో సామాన్యులు సైతం ఫోన్లు మాట్లాడ లేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలో భార్యాభర్తల ఫోన్ సంభాషణలూ కూడా విన్నారంటూ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ పాత్ర నేరుగా ఉంటే... ఆయనను అరెస్టు చేసేది లేదని రేవంత్ అంటున్నారని.. అలా చెప్పడానికి ఆయనెవరని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ నిందితులను రేవంత్ ప్రభుత్వం కాపాడుతోందని విమర్శించారు.
న్యాయమూర్తుల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్లుగా బండి సంజయ్ ఆరోపించారు. టీఎస్‌పీఎస్‌సీ పేపర్ల లీక్ కేసు విచారణ చేస్తున్న జడ్జి ఫ్యోన్ కూడా ట్యాప్ చేశారన్నారు. వ్యాపారస్తుల ఫోన్లు ట్యాప్ చేసి బ్లాక్‌మెయిల్ చేశారన్నారు. ఎన్నికల సమయంలో దొరికిన నగదంతా కేసీఆర్ ఖాతాల్లోకి వెళ్లాయని ఈ కేసును ఇంకా ఎంత కాలం సాగదీస్తారు? అంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు.





















