Bandi Sanjay: 'ఒకరిద్దరు చెప్తే సీఎం అయ్యే వ్యక్తి కాదు' - అధికారంలోకి వస్తే కేసీఆర్ ఆస్తులు స్వాధీనం చేసుకుంటామన్న బండి సంజయ్
Bandi Sanjay: బీజేపీ బీసీలకు అధిక ప్రాధాన్యం ఇస్తుందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే సీఎం కేసీఆర్ ఆస్తులు జప్తు చేస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు బీసీలను చిన్న చూపు చూస్తున్నాయని, జనాభాలో అధిక శాతం ఉన్న వర్గాన్ని అణచి వేయాలని చూస్తున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ విమర్శించారు. కరీంనగర్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. అణగారిన వర్గాల పట్ల ఆ పార్టీల వైఖరి మార్చుకోవాలని, వెంటనే వారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీ వర్గమంతా బీజేపీకి అనుకూలంగా వ్యవహిస్తోందని, ఎస్సీ, ఎస్టీలతో పాటు అగ్రవర్ణాల్లో పేదలు కూడా తమ పార్టీకి మద్దతిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో దాదాపు 50 శాతం బీసీలకు టికెట్లు ఇచ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు.
'ఒకరిద్దరు చెప్తే సీఎం కాను'
బీజేపీలో సీఎం అభ్యర్థిని ఎప్పుడూ ముందు ప్రకటించమని బండి సంజయ్ స్పష్టం చేశారు. ఎన్నికల తర్వాత గెలిచిన ఎమ్మెల్యేలు, అధిష్టానం కలిసి సీఎం అభ్యర్థిని నిర్ణయిస్తారు. ఎవరో ఒకరిద్దరు చెప్తే సీఎం అయ్యే వ్యక్తి కానని, అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పారు. పార్టీ సిద్ధాంతం కోసం పని చేసే చిత్తశుద్ధి గల కార్యకర్తనని అన్నారు. మేడిగడ్డ కుంగుబాటుపై స్పందించిన ఆయన, సీఎం కేసీఆర్ ఈ అంశంపై ఎందుకు ఇప్పటివరకూ స్పందించ లేదని ప్రశ్నించారు. మేడిగడ్డ బ్యారేజీ పియర్ల కుంగుబాటుపై, జాతీయ డ్యాం సేఫ్టీ బృందం నివేదికను తప్పని ఎలా అంటారని ప్రశ్నించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే కేసీఆర్ కుటుంబ ఆస్తులు స్వాధీనం చేసుకుంటామని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు.
కేటీఆర్ కు సవాల్
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ కు బండి సంజయ్ సవాల్ విసిరారు. మేడిగడ్డ కుంగుబాటుపై వాస్తవ నివేదిక ఇచ్చిన కేంద్ర బృందంపై అవాకులు చవాకులు పేలుతున్న కేటీఆర్, తన తండ్రి కేసీఆర్ ను తీసుకొస్తే వాస్తవాలు నిరూపిస్తామని అన్నారు. 'డేట్, టైం ఫిక్స్ చెయ్. ఇరిగేషన్ నిపుణులతో కలిసి మేడిగడ్డకు వస్తా. మీ అయ్యను తీసుకురా. మేం వాస్తవాన్ని నిరూపిస్తాం. ప్రజలకు వాస్తవాలు బయటపెడదాం. మీ అయ్యను తీసుకొచ్చే దమ్ముందా.?' అంటూ సవాల్ విసిరారు. బీజేపీ అధికారంలోకి రాగానే కాళేశ్వరం కోసం పెట్టిన లక్షా 30 వేల కోట్లను కేసీఆర్ కుటుంబం నుంచి వసూలు చేస్తాం. కేసీఆర్ కుటుంబ ఆస్తులన్నీ జప్తు చేస్తాం. అని స్పష్టం చేశారు.
'రేవంత్ సీఎం కాలేరు'
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని చూస్తే జాలేస్తోందని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డిని సీఎం కానీయొద్దని ముస్లిం పెద్దలంతా కలిసి రాహుల్ గాంధీని కలిశారని, అందుకు ఆయన సైతం అంగీకరించినట్లు తనకు సమాచారం ఉందన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఆ వెంటనే బీసీని సీఎంగా చేస్తామని జాతీయ నాయకత్వం ప్రకటించిందని, బీజేపీ ధైర్యానికి హ్యాట్సాఫ్ చెబుతూ ప్రజలు స్వాగతం పలుకుతున్నారన్నారు.
'ప్రధాని సభను విజయవంతం చేయాలి'
ఈ నెల 7న జరిగే బీసీ ఆత్మగౌరవ సభకు ప్రధాని మోదీ హాజరవుతారని, అందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. సోమవారం ఉదయం 11 గంటలకు కరీంనగర్ అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్నట్లు తెలిపిన ఆయన, తనను ఆశీర్వదించాలని ప్రజలను కోరారు.
Also Read: మేడిగడ్డ వద్ద భయంకరంగా పరిస్థితి, పిల్లర్లకు పగుళ్లు కూడా - కిషన్ రెడ్డి