Bandi Sanjay : త్వరలోనే ఖమ్మం బహిరంగసభ - కార్యకర్తలు నిరాశపడవద్దన్న బండిసంజయ్ !
త్వరలోనే ఖమ్మం బహిరంగసభ ఉంటుందని బండి సంజయ్ తెలిపారు. అమిత్ షా సభ రద్దయిందని కార్యకర్తలు నిరాశపడవద్దని కోరారు.
Bandi Sanjay : ఖమ్మంలో త్వరలోనే బహిరంగసభ పెడతామని కార్యకర్తలు ఎవరూ నిరాశపడవద్దని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. గురువారం ఖమ్మంలో జరగాల్సిన బహిరంగ సభను వాయిదా వేశామని మీడియాకు తెలిపారు. గుజరాత్, మహారాష్ట్రలో భారీ ఎత్తున వర్షాలు వస్తుండటంతో బహిరంగ సభను వాయిదా వేశామన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా 24 గంటలపాటు పర్యవేక్షించాల్సిన అవసరం ఉన్నందున అనివార్య కారణాల వల్ల బహిరంగ సభకు రాలేకపోతున్నారని తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్ దళాలను ఇప్పటికే తుఫాన్ బాధిత ప్రాంతాలకు పంపారని.. రైళ్లన్నీ రద్దు చేశారు. దాదాపు 50 వేల మందిని ఆ ప్రాంతాల నుండి తరలించారన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని రేపటి పరిస్థితిని అంచనా వేశామన్నారు. ఈ విపత్కర సమయంలో బహిరంగ సభ నిర్వహించడం సముచితం కాదనే నిర్ణయానికి వచ్చామని బండి సంజయ్ తెలిపారు. ఇప్పటికే బహిరంగ సభ కోసం అన్ని ఏర్పాట్లు చేశామని.. పార్టీ సీనియర్ నేతలంతా అక్కడే మకాం వేశారు. పెద్ద ఎత్తున జనం వచ్చేందుకు సిద్ధమని కూడా తెలిపారు. అయినా అనివార్య కారణాలతో సభ రద్దు అయిందన్నారు. అతి త్వరలో ఖమ్మంలో బహిరంగ సభ నిర్వహించడం ఖాయం. కార్యకర్తలెవరూ నిరాశ పడొద్దని కార్యకర్తలకు సూచించారు.
చివరి క్షణంలో రద్దయిన అమిత్ షా పర్యటన
కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ టూర్‌పై బిపోర్ జాయ్ తుపాన్ ఎఫెక్ట్ పడింది. ఆయన పర్యటన రద్దయినట్లుగా బీజేపీ వర్గాలు తెలిపాయి. బిపర్‌జాయ్ తుఫాన్ ప్రధానంగా గుజరాత్ పైనే ప్రభావం చూపనుంది. దీంతో అమిత్ షా మరింత ఎక్కువగా ఆ రాష్ట్రంలో పరిస్థితులపై దృష్టి పెట్టాల్సి ఉంది. ఇప్పటికే గుజరాత్ హై అలర్ట్ లో ఉంది. బిపర్జోయ్ తుఫాన్ సన్నద్ధతపై గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ కేంద్ర ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటున్నారు. బిఫర్‌జాయ్ తుఫాన్ గంటకు 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడంతో గురువారం సాయంత్రం జఖౌ సమీపంలో తీరం దాటనుంది. ఖచ్చితంగా గురువారం మొత్తం అమిత్ షా హైదరాబాద్‌లో ఉండేలా షెడ్యూల్ ఖరారైంది. గుజరాత్‌లో తుపాను పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేయాల్సి ఉన్నందున పర్యటనను రద్దు చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
గుజరాత్ తుపాను ఎదుర్కోవడంపై కేంద్ర హోంశాఖ దృష్టి
బిపోర్ జాయ్ తుఫాను విపత్కర ప్రభావాన్ని అంచనా వేస్తూ పలు ప్రభుత్వ సంస్థలు తీరప్రాంత జిల్లాలైన సౌరాష్ట్ర, కచ్ లలో సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. గంటకు 110 కిలోమీటర్ల వేగంతో ముందుకు సాగుతోందని రిపోర్టులు పేర్కొంటున్నాయి. గుజరాత్ లోని ఎనిమిది జిల్లాల్లో సముద్రం సమీపంలో నివసిస్తున్న దాదాపు 37,800 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ సామర్థ్యం సరిపోదని.. కేంద్ర బలగాలు అవసరం అన్న అభిప్రాయం వినిపిస్తోంది. హోంమంత్రి అమిత్ షా స్వరాష్ట్రం గుజరాత్ కావడంతో ఆ రాష్ట్రంపై మరింత ఎక్కువగా దృష్టి పెట్టాల్సి ఉంది. అందుకే పూర్తిగా రద్దు అయింది. త్వరలో మరో తేదీని ఖరారు చేసే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.