Adilabad News: కేజీబీవీ పాఠశాల విద్యార్థిని మృతి, ఏఎన్ఎంల నిర్లక్ష్యం కారణమా?
Adilabad News: కేజీబీవీ పాఠశాలలో 8వ తరగతి విద్యార్థి అనారోగ్యంతో మృతి చెందింది. పాఠశాల ఎస్ఓ, ఏఎన్ఎంల నిర్లక్ష్యం వల్లే బాలిక చనిపోయిందంటూ గిరిజన సంఘాలు ఆందోళన నిర్వహించాయి.
Adilabad News: ఆదిలాబాద్ జిల్లా గాదిగూడా మండలంలోని కేజీబీవీ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న మెస్రం తేజశ్రీ అనే గిరిజన విద్యార్థిని అనారోగ్యంతో మృతి చెందింది. బాలిక మృతి పట్ల అధికారులపై ఆదివాసీ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. గాదిగూడా మండలంలోని మెస్రం గోవింద్ రావ్ సత్తుబాయి దంపతుల కూతురు మెస్రం తేజశ్రీ (13) కేజీబీవీ పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. దీపావళి సమయంలో అక్టోబర్ 19వ తేదిన ఆదిలాబాద్ లోని రిమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్లి.. చికిత్స నిమిత్తం ఇంటికి తీసుకొచ్చారు. కానీ 15 రోజులు గడిచిన తర్వాత పాఠశాల స్పెషల్ అఫిసర్ ప్రియాంక, ఏఎన్ఏం లు పట్టించుకోలేదని, విద్యార్థిని ఆరోగ్య వివరాలు కూడా ఎందుకు అడగలేదు అంటూ ఆదివాసీ విద్యార్థి సంఘం నాయకులు వారిని నిలదీశారు.
కేజీబీవీ పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యంతోనే గిరిజన పేద విద్యార్ధిని మృతి చెందిందని, విద్యార్ధిని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలంటూ ఆదివాసీ సంఘాలు, సంక్షేమ పరిషత్, తుడుందెబ్బ విద్యార్ధి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. అలాగే మృతి చెందిన విద్యార్ధి తల్లికి ఉపాధి కల్పించాలని కోరారు. పాఠశాల సిబ్బంది ఆదివాసీల పిల్లలను చిన్న చూపు చూస్తూ చదువు, ఆరోగ్యంపైన నిర్లక్ష్యం వహించిచడం సరికాదని అన్నారు. పాఠశాల ఉపాధ్యాయులు నిర్లక్ష్యం వల్లే గిరిజన విద్యార్థులకు చదువు అందడం లేదని అన్నారు. వరుసగా ఆసిఫాబాద్, బేలా, గాదిగూడా కేజీబీవీ పాఠశాలలో ఆదివాసీ విద్యార్థుల మరణాలకు పాఠశాలలోని సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని, పూర్తిగా ఆదివాసులకు అన్యాయం జరుగుతుందని అన్నారు. పాఠశాలలో సిబ్బంది సరిగా లేనందున విద్యార్థులకు చదువు దూరం అవుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో ఆదివాసీ విద్యార్థి సంఘం ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు సిడం జంగుదేవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి మంగం దీపక్, ఉట్నూర్ మండలం అధ్యక్షులు త్రిమూర్తి చరణ్, గాదిగూడా మండల ప్రధాన కార్యదర్శి పెందూర్ సంతోష్, మండల ఉపాధ్యక్షులు పెందూర్ మధుకర్, శంబు, ఆదివాసీ సంక్షత్ పరిషత్ మండల అధ్యక్షులు కనక ప్రభాకర్, నార్నూర్ మండలం నాయకులు కొట్నాక్ శ్రీరామ్, యస్ఎఫ్ఐ జిల్లా నాయకులు సాకారం తదితరులు ఉన్నారు.
నెలరోజుల క్రితం కాగజ్ నగర్ కేజీబీవీ పాఠశాలలో..
కాగజ్‌నగర్ కేజీబీవీ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుకుంటున్న ఐశ్వర్య అనే విద్యార్థిని అనారోగ్యంతో మృతిచెందడం బాధకరమని కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ రాజేశం అన్నారు. అనారోగ్యంతో ఉన్న విద్యార్థిని పట్ల నిర్లక్ష్యం వహించిన ముగ్గురు పాఠశాల సిబ్బందిని సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడించారు. కస్తూర్భా విద్యాలయం ఎస్ఓ స్వప్న, ఏఎన్ఎం భారతి, డ్యూటీలో ఉన్న టీచర్ శ్రీలతను సస్పెండ్ చేస్తూ.. అదనపు కలెక్టర్ రాజేశం ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థిని కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. నష్ట పరిహారం కోసం తక్షణ సహాయం కింద రూ.50,000 బాధిత కుటుంబానికి అందించారు. నష్టపరిహారం కింద ఆ కుటుంబానికి రూ. 15 లక్షలు వచ్చేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తామని హామీ ఇచ్చారు.
అసలేం జరిగిందంటే..?
కుమురం భీం అసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లోని కస్తూర్భా పాఠశాలలో ఓ విద్యార్థిని మృతి చెందింది. ప్రతిరోజూలాగే మంగళవారం రాత్రి పాఠశాల వసతి గృహంలో భోజనం చేసి పడుకుంది. బుధవారం ఉదయం నోటి నుంచి నురగ రావడంతో.. స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే ఆ బాలిక చికిత్స పొందతూ మృతి చెందింది. విషయం తెలుసుకున్న విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు, కుటుంబ సభ్యులు.. ఐశ్వర్య మృతదేహంతో కస్తూర్బా పాఠశాల ముందు ధర్నాకి దిగారు.
మృతదేహంతో ధర్నాకి దిగిన కుటుంబ సభ్యులు..
యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఐశ్వర్య చనిపోందని ఆరోపిస్తున్నారు. ఐశ్వర్య కుటుంబానికి న్యాయం చేయడంతోపాటు నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్, పాల్వాయి హరీష్ బాబు కుటుంబ సభ్యులకు మద్దతు తెలిపారు. విద్యార్థికి న్యాయం చేసి, నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న విద్యాశాఖ అధికారులు ఫోన్ చేసి కుటుంబ సభ్యులతో మాట్లాడరు. న్యాయం చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ.. జిల్లా కలెక్టర్ వచ్చే వరకు ధర్నా విరమించబోమని కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు.