
Tigers Roaming : ఆదిలాబాద్ వాసులను హడలెత్తిస్తున్న పులులు, భీంపూర్ లో ఆవుపై దాడి!
Tigers Roaming : ఆదిలాబాద్ జిల్లా వాసులను పులులు హడలెత్తిస్తున్నాయి. భీంపూర్ మండలంలో సంచరిస్తున్న పులులు ఓ ఆవుపై దాడి చేశాయి.

Tigers Roaming :ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం గూడ శివారులో ఇటీవల రెండు పులులు జనాల కంట పడిన ఘటన మరవక ముందే భీంపూర్ మండలం తాంసి -కె శివారులో ఆదివారం అర్ధరాత్రి 4 పులుల సంచారం స్థానికులను బెంబేలెత్తిస్తోంది. పిప్పల్కోటి రిజర్వాయర్ పనుల ప్రదేశంలో పులులు టిప్పర్ వాహన డ్రైవర్ కంట పడ్డాయి. డ్రైవర్ తీసిన వీడియోలు సామాజిక మాధ్యమంలో వైరల్ గా మారాయి. పంట చేతికి వచ్చిన సమయంలో పులుల సంచారం తమకు నష్టం చేస్తోందని స్థానికులు వాపోతున్నారు.
భీంపూర్ లో ఆవుపై దాడి
ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలో పులి దాడి కలకలం రేపుతుంది. భీంపూర్ మండలంలోని గుంజాల గ్రామ శివారులో ఆవుపై పులులు దాడి చేసి హతమార్చాయి. ఆవు వెనుక భాగం పూర్తిగా తినేశాయి. కొద్ది రోజులుగా భీంపూర్ మండలంలోని పిప్పలకోటి, తాంసి కె, గొల్లఘాట్ తాంసి శివారులో పులులు సంచరిస్తున్నాయి. ఆదివారం రాత్రి తాంసి కె సమీపంలో టిప్పర్ డ్రైవర్ కి నాలుగు పులులు రోడ్లపై కనిపించాయి. అతడు సెల్ ఫోన్ లో పులుల వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. దీంతో గ్రామస్థులు భయాందోళన చెందుతున్నారు. గ్రామస్థులు అటవీ ప్రాంతాల్లోకి, పొలాల్లోకి వెళ్లకూడదని అటవీ అధికారులు సూచిస్తున్నారు. తాజాగా భీంపూర్ మండలంలోని గుంజాల గ్రామ శివారులో ఓ ఆవును పులులు హతమార్చి సగభాగం పూర్తిగా తినేయడంతో పత్తి చేలలలో పంట కోసేందుకు వెలుతున్న కూలీలు భయాందోళనకు గురవుతున్నారు.
పెద్ద పులి సంచారం
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెద్దపులి సంచారం గత కొద్దిరోజుల నుంచి అలజడి సృష్టిస్తోంది. ఆదిలాబాద్ మంచిర్యాల కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఇప్పటికి పదుల సంఖ్యలో పశువులపై పెద్దపులి దాడి చేసింది. పెద్దపులి సంచారంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పులి సంచారంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తమై పులి సంచరించిన ప్రాంతాలను పరిశీలిస్తు పాదముద్రలను సేకరిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో పులి గురించి వారికున్న సమాచారం మెరకు గ్రామాల్లో డప్పు చాటింపుతో ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.
పశువులపై దాడి
ఆసిఫాబాద్ జిల్లాలోని చింతలమానేపల్లి, పెంచికల్ పేట్, కాగజ్‌నగర్ పరిసర అటవి ప్రాంతాల్లో పెద్దపులి సంచారం కలకలం రేపింది. కాగజ్‌నగర్ మండలం కొసిని, రేగలగూడ, అనుకోడ సమీప అటవీ ప్రాంతాల్లో పశువులపై పెద్దపులి దాడి చేసింది. ఇటీవల చింతలమానేపల్లి, పెంచికల్‌పేట్ మండలాల్లోను పులి రెండు పశువులను హతమార్చింది. కాగజ్‌నగర్ అటవీ ప్రాంతాల్లో పెద్దపులి సంచరిస్తు అలజడి సృష్టించింది. కొసిని రేగలగూడ అటవి ప్రాంతంలో భీమేష్ అనే పశువుల కాపరి పశువులను కాస్తుండగా ఒక్కసారిగా పెద్దపులి ఓ ఆవుపై దాడి చేసింది. ఆవుపై పులి దాడి చేయడాన్ని పశువుల కాపరి భీమేష్ కళ్లారా చూశానని చెప్పాడు. పక్కనున్న వారిని పిలిచి కేకలు వేయడంతో పులి కాసేపటికి ఆవును వదిలి అక్కడ నుంచి సమీప అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయిందని చెప్పాడు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
