Road Accident: సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి.. బాలుడిని ఆసుపత్రికి తీసుకెళ్లి వస్తుండగా ఘటన
తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదురుగు చనిపోయారు.
సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండల కేంద్రం సమీపంలోని జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న కారును లారీ ఢీ కొట్టడంతో ఐదుగురు చనిపోయారు.
మెదక్ జిల్లా రంగంపేట గ్రామానికి చెందిన పద్మ, అంబదాస్ దంపతుల కుమారుడు వివేక్ అనారోగ్యానికి గురయ్యాడు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న బాలుడిని పెద్దాసుపత్రిలో చూపిద్దామని సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులకు బాలుడిని చూపించారు.
చికిత్స తర్వాత ఇంటికి తిరుగుపయనమయ్యారు. కారులో వస్తుండగా.. పుల్కల్ మండలం చౌటకూర్ వద్దకు రాగానే ప్రమాద బారిన పడ్డారు. వీళ్ల కారును ఎదురుగా వచ్చిన లారీ బలంగా ఢీ కొట్టింది. అంతే ఒకేసారి ఐదుగురు స్పాట్‌లోనే చనిపోయారు.
ప్రమాదం జరిగిన టైంలో కారులో ఐదుగురు కారులో ఉన్నారు. లారీ ఢీ కొట్టిన తర్వాత బాలుడు వివేక్, అతడి తల్లిదండ్రులు పద్మ, అంబదాస్‌తోపాటు మరో ఇద్దరు స్పాట్‌లోనే కన్నుమూశారు.
ప్రమాదం విషయం తెలుసుకున్న పుల్కల్ ఎస్సై నాగలక్ష్మి సిబ్బందితో కలిసి ఘటనాస్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి సొంతూళ్లకు పంపించారు.
ఈ వార్త విన్న రంగంపేట తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఆరోగ్యం బాగలేదని ఆసుపత్రికి వెళ్లిన ఫ్యామిలీ ఇలా విగత జీవులుగా ఊరికి తిరిగి రావడాన్ని ఆ పల్లెవాసులు జీర్ణించుకోలేకపోయారు. బంధువులు, గ్రామస్థులు రోధనలతో ఆ పల్లె బోరుమంది.
ALSO READ: తాడేపల్లి అత్యాచారం కేసులో కీలక అప్‌డేట్...పోలీసుల అదుపులో ప్రధాన నిందితుడు..!