Tadepalli Rape Case: తాడేపల్లి అత్యాచారం కేసులో కీలక అప్‌డేట్...పోలీసుల అదుపులో ప్రధాన నిందితుడు..!
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సీతానగరం అత్యాచార కేసులో కీలక నిందితుడ్ని పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
సంచలనం రేపిన సీతానగరం అత్యాచార కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తోన్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. గుంటూరు జిల్లా తాడేపల్లి సీతానగరం అత్యాచార కేసులో పోలీసులు ఎట్టకేలకు పురోగతి సాధించారు. ప్రధాన నిందితుడిగా భావిస్తోన్న కృష్ణను అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రకాశం జిల్లాలో నిందితులు ఉన్నారన్న సమాచారంతో గాలింపు చేపట్టిన పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. తాడేపల్లి సీతానగరం అత్యాచారం కేసులో నిందితుల కోసం దాదాపుగా 3 నెలలుగా రాష్ట్రవ్యాప్తంగా.. పోలీసులు గాలిస్తున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తు్న్న కృష్ణ కోసం పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఈ కేసులో నిందితులుగా అనుమానిస్తున్న కృష్ణ, వెంకటరెడ్డిలకు చెందిన సంబంధీకులను పోలీసులు రెండు నెలలుగా విచారిస్తున్నారు.
విచారణలో పోలీసులు రాబట్టిన సమాచారం మేరకు నెల్లూరు, గుంటూరు, ప్రకాశం జిల్లాలో 10 బృందాలు గాలింపు చేపట్టాయి. విశ్వసనీయ సమాచారంతో ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్న కృష్ణ ఒంగోలులో ఉన్నట్లు తెలిసింది. ఈ సమాచారంతో గాలింపు చేపట్టిన పోలీసులు మఫ్తీలో గాలించారు. చివరికి ఒంగోలులోని ఓ ప్లైఓవర్ బ్రిడ్జి వద్ద బిచ్చగాళ్లతో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంంచి అతడ్ని గుంటూరు తీసుకొచ్చి ఓ పోలీసు స్టేషన్లో విచారిస్తున్నట్లు సమాచారం. నిందితుడి నుంచి పూర్తి సమాచారం రాబట్టిన తర్వాత అరెస్టు అధికారికంగా అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని సీతానగరంలో పుష్కరఘాట్ వద్ద జూన్ 19వ తేదీ రాత్రి వేళ యువతిపై దుండుగులు అత్యాచారానికి పాల్పడ్డారు. నదీ తీరాన ఉన్న ఓ ప్రేమ జంటపై దుండగులు దాడి చేశారు. ప్రియుడిని తాళ్లతో కట్టేసి, యువతిపై అత్యాచారం చేశారు. ఆ దాడిలో యువతి అపస్మారకస్థితిలోకి వెళ్లడంతో వాళ్లంతా అక్కడి నుంచి పారిపోయారు. అయితే ఆ తర్వాత రోజు బాధిత యువతి తనపై జరిగిన అఘాయిత్యంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు యువతిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. సీఎం నివాసానికి అతి సమీపంలో ఈ దారుణ ఘటన జరగడంతో ఈ కేసును ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. హోంమంత్రి సుచరిత ఆ యువతిని కలిసి పరిహారం అందించారు.
Also Read: Death: కేసులు పెట్టారు.. చితక్కొట్టారు.. దాచేపల్లి ఎక్సైజ్ పోలీసుల దాడి ఘటన.. యువకుల మృతిపై విమర్శలు