Mahabubabad Accident: పండుగ పూట విషాదం - కుటుంబాన్ని బలి తీసుకున్న రోడ్డు ప్రమాదం, నలుగురు మృతి
Telangana News: పండుగ పూట రోడ్డు ప్రమాదం ఓ కుటుంబాన్ని బలి తీసుకుంది. మహబూబాబాద్ జిల్లాలో ఆటోను, కారు ఢీకొన్ని ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
Four People Died in Mahabubabad Accident: పండుగ పూట మహబూబాబాద్ (Mahabubabad) జిల్లాలో ఘోర విషాదం జరిగింది. కంబాలపల్లి (Kambalapalli) శివారు అటవీ శాఖ అర్బన్ పార్కు సమీపంలో గూడురు వైపు వెళ్తున్న ఆటోను.. మహబూబాబాద్ కు వస్తున్న కారు ఆదివారం రాత్రి ఢీకొట్టడంతో తల్లీ కుమారుడు, ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఆటోలో ప్రయాణిస్తున్న ఇస్లావత్ శ్రీను (35)తో పాటు ఆయన తల్లి పాప (60), కుమారుడు రిత్విక్ (4), కుమార్తె రిత్విక (2) అక్కడికక్కడే మృతి చెందారు. శ్రీను అత్త మాలోతు శాంతి, అతని బావ మరిది తీవ్రంగా గాయపడ్డారు. వీరితో పాటు కారులో ప్రయాణిస్తున్న ఐదుగురికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్షతగాత్రులను పోలీసులు, స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మూడేళ్ల క్రితమే భార్య మృతి
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం చిన్నఎల్లాపురం గ్రామానికి చెందిన శ్రీను - శిరీషకు వివాహం కాగా, వీరికి రిత్విక్, రిత్విక అనే ఇద్దరు పిల్లలున్నారు. మూడేళ్ల క్రితం శిరీష చనిపోయింది. దీంతో మానసికంగా కుంగిపోయిన శీను ఇటీవల పుణ్యక్షేత్రాలకు తిరుగుతున్నాడు. ఈ క్రమంలోనే తల్లి 'పాప', ఇద్దరు పిల్లలు, బావ మరిది సర్దార్, అత్త శాంతితో కలిసి ఆదివారం ఆటోలో నాగార్జున సాగర్ సమీపంలోని గుండ్లసింగారంలోని బుడియాబాపు ఆలయానికి వెళ్లాడు. వారు పూజలు ముగించుకుని సాయంత్రం తిరిగి బయలుదేరగా వచ్చే సరికి రాత్రయింది. ఈ క్రమంలోనే ఆటోలో కంబాలపల్లి, జిమ్మాండ్లపల్లి గ్రామాల మధ్య ఉన్న అర్బన్ పార్క్ వద్దకు రాగానే ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టింది.
గ్రామంలో విషాదం
కారు వేగంగా ఢీకొనగా ఆటో నుజ్జు నుజ్జై అందులోనే ఇరుక్కుపోయారు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. అప్పటికే శ్రీను, ఆయన తల్లి పాప, కుమార్తె రిత్విక ప్రాణాలు కోల్పోయారు. కొన ఊపిరితో ఉన్న రిత్విక్ ను ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడగా.. వారిని జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది. దేవుని మొక్కు తీర్చుకునేందుకు వెళ్లి విగత జీవులుగా మారిన వారిని చూసి బంధువులు, గ్రామస్థులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
మద్యం మత్తే కారణమా.?
ఆటోను ఢీకొన్న కారులో తిరుపతి అనే వైద్యుడితో పాటు కురవికి చెందిన యువకుడు, వారి స్నేహితులు ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా మహబూబాబాద్ జిల్లా గుంజేడులోని ముసలమ్మ దేవాలయానికి కారులో వెళ్లినట్లు సమాచారం. వీరంతా మద్యం మత్తులో ఉన్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. అతి వేగంగా నడిపి ఆటోను ఢీకొట్టారని చెబుతున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.