Hyderabad News: ఘోర విషాదం - స్కూల్ బస్సు కింద పడి చిన్నారి మృతి
Telangana News: స్కూల్ బస్సు కింద పడి రెండేళ్ల చిన్నారి మృతి చెందిన విషాద ఘటన హైదరాబాద్ లో గురువారం జరిగింది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Child Died in Fall Under School Bus in Habsiguda: అప్పటివరకూ ఆ చిన్నారి నవ్వుతూ ఆడుకుంది. తన అన్న స్కూలుకు వెళ్తుంటే బస్సు ఎక్కించేందుకు తండ్రి, అమ్మమ్మతో కలిసి రహదారిపైకి వచ్చింది. ఇంతలో మృత్యువు బస్సు రూపంలో ముంచుకొచ్చి చిన్నారిని చిదిమేసింది. ఈ విషాద ఘటన హైదరాబాద్ (Hyderabad) హబ్సిగూడలో (Habsiguda) గురువారం ఉదయం జరిగింది. రవీంద్రనగర్ (Ravindra Nagar) లో ఉండే మిథున్ కు ఇద్దరు పిల్లలు. కుమారుడు స్థానికంగా ఓ స్కూల్లో చదువుతుండగా.. రెండేళ్ల చిన్నారి జావ్లానా ఇంటి వద్దే ఉంటోంది. గురువారం తన తండ్రి, అమ్మమ్మతో కలిసి సోదరున్ని బస్సు ఎక్కించేందుకు రోడ్డుపైకి వచ్చింది. తండ్రి మిథున్ (Mithun) డ్రైవర్ తో మాట్లాడుతుండగా.. అమ్మమ్మ వద్ద ఉన్న చిన్నారి నాన్న వద్దకు వెళ్తానంటూ పరుగులు తీసింది. ఇది గమనించని బస్సు డ్రైవర్ వాహనం తీయగా, ప్రమాదవశాత్తు టైర్ కింద పడి ప్రాణాలు కోల్పోయింది. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే తమ పాప మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. సమాచారం అందుకున్న ఓయూ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అప్పటివరకూ ఆడుకున్న చిన్నారి విగతజీవిగా మారడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.
Also Read: Crime News: ఒంటరిగా కనిపించిన అమ్మాయిలు లిఫ్ట్ అడిగితే హెల్ప్ చేస్తున్నారు!