Twitter Logo Change: ఆ పిట్టకు ఇక విముక్తి, ట్విట్టర్ లోగోను మార్చనున్న ఎలన్ మస్క్ - కొత్త డిజైన్ చూశారా?
ట్విట్టర్‌లో కనిపించే ఆ క్యూట్ పిట్ట భవిష్యత్తులో కనిపించబోదు. దాన్ని కొత్త లోగోతో రిప్లేస్ చేసేందుకు ఎలన్ మస్క్ నిర్ణయించారు. మరి, ఆ లోగో ఏమిటో తెలుసా?
ట్విట్టర్ అనగానే మనకు గుర్తుకొచ్చేది నీలి రంగులో కనిపించే ఆ పిట్టే కదా. ఇప్పుడు ఆ పిట్ట పీకేసి.. కొత్త లోగోను పెట్టాలనే ఆలోచనలో ఉన్నారు.. దాని కొత్త యజమాని ఎలన్ మస్క్. ఈ నేపథ్యంలో ఆయన పరోక్షంగా ఓ హింట్ ఇచ్చారు. తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేసిన ఓ వీడియోలో.. ట్విట్టర్ పిట్ట స్థానంలో ఒక కొత్త డిజైన్‌ను రివీల్ చేశారు. ఆ వీడియోను పరిశీలనగా చూస్తే.. ట్విట్టర్ పిట్ట మాయమై కొత్త లోగో ప్రత్యక్షమైనట్లుగా ఉంది. ఇంతకీ ఆ కొత్త లోగో ఏమిటో తెలుసా? అది ‘X’.
ఔనండి, ప్రస్తుతం ఉన్న ట్విట్టర్ లోగో ‘పిట్ట’ను తొలగించి.. ఆయన ఎక్స్‌ను పెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ట్విట్టర్‌కు తన బ్రాండింగ్‌ను ఇచ్చేందుకే ఈ మార్పు అని తెలుస్తోంది. ఎలన్ మస్క్ గతేడాది ‘ట్విట్టర్’ను తన సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ట్విట్టర్ ప్రస్తుతం కొత్తగా ఏర్పాటు చేసిన ‘X Corp’లో విలీనమైంది. అందుకే.. పిట్ట స్థానంలో ‘X’ లోగోను పెట్టాలని నిర్ణయించారు. ఎలన్ మస్క్ బ్రాండ్స్‌లో ‘X’ సర్వసాధారణమే. ఇప్పటికే ‘Space X’ పేరుతో ఆయన అంతరిక్ష పరిశోధనలు చేస్తున్నారు. ఈ కొత్త లోగోను ఈ రోజు అర్థరాత్రి నుంచి అందుబాటులోకి తీసుకొస్తారు.
— Elon Musk (@elonmusk) July 23, 2023
‘X’ అక్షరంపై తనకు ఉన్న ఆసక్తిని ఎలన్ ఇంతకు ముందే వెల్లడించారు. ఏప్రిల్‌లో కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా లిండా యాకారినోను నియమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఈ ప్లాట్‌ఫారమ్‌ను Xగా మార్చేందుకు లిండాతో కలిసి పనిచేస్తాను’’ అని వెల్లడించారు. ట్విట్టర్‌ను సొంతం చేసుకున్న రోజు నుంచి ఎలన్ మస్క్ చాలా మార్పులు చేశారు. పాత సిబ్బందిని కూడా భారీ స్థాయిలో తొలగించారు.
If a good enough X logo is posted tonight, we’ll make go live worldwide tomorrow
— Elon Musk (@elonmusk) July 23, 2023
ఎలన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఫెయిడ్ వెరిఫికేషన్ అకౌంట్స్‌ను కూడా ప్రవేశపెట్టారు. దీంతో బ్లూటిక్ పొందడానికి సెలబ్రిటీలు చెల్లింపులు చేయకతప్పలేదు. అలాగే, వెరిఫికేషన్‌లేని వినియోగదారులు పంపే డైరెక్ట్ మెసేజ్‌లపై కూడా ఆంక్షలు విధించారు. వెరిఫికేషన్ పొందని ఖాతాదారులు పరిమితికి మించిన సందేశాలు పంపాలంటే.. తప్పకుండా సబ్‌స్క్రైబ్ చేసుకోవాలని వెల్లడించారు. అయితే, అల్రెడీ వెరిఫికేషన్ పొందిన ఖాతాదారులకు ఈ రూల్ వర్తించదు.
ట్విట్టర్‌కు సవాలుగా మారిన మెటా థ్రెడ్స్
ట్విట్టర్ నుంచి యాడ్స్ ద్వారా చెల్లింపు రాబట్టడం కంపెనీకి సవాలుగా మారింది. ఎందుకంటే మెటా ఇటీవల ట్విట్టర్‌కి పోటీదారుగా కొత్త థ్రెడ్స్ యాప్‌ని లాంచ్ చేసింది. చాలా మంది థ్రెడ్స్ యాప్‌ను ట్విట్టర్ కిల్లర్‌గా అభివర్ణించారు. ఈ వారం ప్రారంభంలో థ్రెడ్స్ తన మొదటి 100 మిలియన్ల వినియోగదారులను పొందింది. ఇది ప్రపంచ చరిత్రలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న యాప్‌గా మారింది. అయితే ట్విట్టర్ మెటా రూపొందించిన ఈ యాప్‌ను కాపీ అని పేర్కొంది. మెటాపై దావా వేస్తానని కూడా ట్విట్టర్ ఇప్పటికే నోటీసు ద్వారా హెచ్చరించింది.
Read Also: వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ సేవలకు అంతరాయం, ఇంతకీ ఏం జరిగింది?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial