Global Outage: వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ సేవలకు అంతరాయం, ఇంతకీ ఏం జరిగింది?
మెటా యాజమాన్యంలోని వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ కొన్ని గంటలపాటు డౌన్ అయ్యాయి. వినియోగదారులు తమ ఖాతాల్లోకి వెళ్లలేకపోయారు. వెంటనే స్పందించిన మెటా సంస్థ, సమస్యను పరిష్కారం చేసినట్లు తెలిపింది.
ఈ రోజుల్లో సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ రావడంతో అందరూ సోషల్ మీడియాను బాగా వాడుతున్నారు. తమకు నచ్చిన అంశాలను ఇతరులతో పంచుకుంటున్నారు. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాలో నుంచి తల తిప్పని వాళ్లు ఎంతో మంది ఉన్నారు. అలాంటి సోషల్ మీడియా ఒక్కసారిగా పని చేయకపోతే? అస్సలు ఏమీ తోచదు. సరిగ్గా నిన్న మెటా యాజమన్యంలోని వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టా వాడుతున్న వినియోగదారులకు ఇలాంటి అనుభవమే ఎదురయ్యింది. ఈ మూడు సేవలు కొద్ది గంటల పాటు నిలిచిపోయాయి.
2 గంటల పాటు పని చేయని వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్
నిన్న(సోమవారం) రాత్రి సమయంలో వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్, ఫేస్‌బుక్ యాప్స్ చాలా సేపు పని చేయలేదు. వీటిని వాడుతున్న వినియోగదారులు సేవలను పొందలేకపోయారు. ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. వాస్తవానికి మెటా యాజమాన్యంలోని 3 యాప్స్ సుమారు 2 గంటల పాటు పని చేయలేదని యూజర్లు పోస్టులు పెట్టారు.
అంతరాయంపై స్పందించిన మెటా యాజమాన్యం
ఈ అంతరాయం పట్ల మెటా యాజమాన్యం స్పందించింది. వినియోగదారులకు కలిగిన అంతరాయానికి చింతిస్తున్నట్లు వెల్లడించింది. ఎక్కడో జరిగిన పొరపాటు కారణంగా యూజర్లకు ఇబ్బంది కలిగిందని చెప్పింది. వెంటనే సేవలను పునరుద్దరించే ప్రయత్నం చేస్తున్నామని ప్రకటించింది. సాధ్యమైనంత త్వరగా సమస్యలను సరి చేస్తామని వెల్లడించింది.
We’re aware that some people are having trouble accessing our apps and products. We’re working to get things back to normal as quickly as possible, and we apologize for any inconvenience.
— Meta (@Meta) October 4, 2021
సోమవారం రాత్రి సమయంలో సమస్యలు
సోమవారం రాత్రి 9 గంటల సమయంలో వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్, ఫేస్‌బుక్ సేవలకు అంతరాయం కలిగింది. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా పలువురు నెటిజన్లు వెల్లడించారు. ఈ సమస్యను ఎదుర్కొన్నట్లు సుమారు 20 వేలకు పైగా వినియోగదారులు ఫిర్యాదు చేసినట్లు నివేదికలు వెల్లడించాయి. దాదాపు 13,000 మంది వినియోగదారులు ఇన్‌స్టాగ్రామ్‌ను యాక్సెస్ చేయడంలో సమస్యలను ఎదుర్కొన్నట్లు వివరించారు. 5,400 మంది ఫేస్ బుక్, 1,870 మంది వినియోగదారులు వాట్సాప్‌లలో అంతరాయాన్ని ఎదుర్కొన్నారు. రెండు గంటల కంటే ఎక్కువ సమయం ఈ యాప్స్ సేవలు నిలిచిపోయినట్లు యూజర్లు నివేదించారు.
భారత్ లో అంతరాయం అంతంత మాత్రమే!
అయితే, ఈ సమస్యలు ప్రపంచ వ్యాప్తంగా లేవని కంపెనీ తెలిపింది. భారతదేశంలో, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారులు ఎలాంటి ఇబ్బంది లేకుండా సేవలను పొందినట్లు వెల్లడించింది. దేశంలో ఫేస్‌బుక్ సంస్థకు 410 మిలియన్లకు పైగా వినియోగదారులు ఉన్నారు. అటు వాట్సప్ కు 530 మిలియన్ల యూజర్లు, ఇన్ స్టాగ్రామ్ కు 210 మిలియన్లకు పైగా వినియోగదారులు ఉన్నారు.
టెక్నాలజీకి సంబంధించిన సమస్యల కారణంగా గతంలోనూ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ డౌన్ అయ్యాయి. వేలమంది ప్రజలకు ఈ సోషల్ మీడియా సైట్లతో సమస్య తలెత్తింది. ప్రపంచ నంబర్ వన్ యాప్ వాట్సాప్‌పై కూడా దీని ప్రభావం పడింది.
Read Also: న్యూస్ యాంకర్లకు ఇక ముప్పే - వార్తలు చదివి వినిపిస్తున్న AI న్యూస్ ప్రెజెంటర్, మన పక్క రాష్ట్రంలోనే!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial