(Source: ECI/ABP News/ABP Majha)
Rahul Dravid: ఆ కవర్ డ్రైవ్ అచ్చం నాన్నలానే .... దుమ్ములేపుతున్న రాహుల్ ద్రావిడ్ కొడుకు
Rahul Dravid: రాహుల్ ద్రావిడ్ పెద్ద కుమారుడు సమిత్ ద్రావిడ్ కూడా దేశవాళీ క్రికెట్‌లో అదరగొడుతున్నాడు. తండ్రికి తగ్గ తనయుడిగా 18 ఏళ్ల సమిత్ ద్రావిడ్ కూచ్ బెహార్ ట్రోఫీలో చెలరేగుతున్నాడు.
ది వాల్ రాహుల్ ద్రావిడ్(Rahul Dravid). అంతర్జాతీయ క్రికెట్‌లో పరిచయం అక్కర్లేని. దుర్బేధ్యమైన డిఫెన్స్‌తో భారత జట్టు ఎన్నో విజయాలు సాధించడంలో కీలక పాత్ర పోషించిన దిగ్గజ ఆటగాడు. ముఖ్యంగా టెస్ట్ క్రికెట్‌లో తనదైన ముద్ర వేశాడు. ది వాల్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత కోచ్‌గా మారి భారత జట్టును విజయవంతంగా నడిపిస్తున్నాడు. ఆటగాడిగా జట్టు కోసం టన్నుల కొద్దీ పరుగులు చేసిన రాహుల్ ద్రావిడ్ రిటైరయ్యాక కోచ్‌గా సేవలందిస్తున్నాడు. టీమిండియా(Team India ) హెడ్ కోచ్(Head Coach)గా పనిచేస్తున్నాడు. ద్రావిడ్ కోచింగ్‌లో భారత జట్టు ప్రపంచకప్ ట్రోఫీ(World Cup 2023)ని గెలవలేదనే పేరే కానీ మిగతా అన్నింటా మంచి విజయాలు సాధించింది. ఇప్పుడు రాహుల్ ద్రావిడ్ పెద్ద కుమారుడు సమిత్ ద్రావిడ్( Samith Dravid) కూడా దేశవాళీ క్రికెట్‌లో అదరగొడుతున్నాడు. తండ్రికి తగ్గ తనయుడిగా రాణిస్తున్నాడు. 18 ఏళ్ల సమిత్ ద్రావిడ్ కూచ్ బెహార్ ట్రోఫీ(Behar Trophy)లో చెలరేగుతున్నాడు. ఈ టోర్నోలో కవర్ డ్రైవల్‌లతో అదరగొడుతున్నాడు. తన షాట్లతో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఈ టోర్నీలో కర్ణాటక తరఫున ఆడుతున్న సమిత్... జమ్ముకశ్మీర్‌తో జరిగిన మ్యాచ్‌లో తన బ్యాటింగ్‌తో అలరించాడు.
చెలరేగిన ద్రావిడ్
జమ్మూకశ్మీర్‌తో జరిగిన మ్యాచ్‌లో చెలరేగిన సమిత్ ద్రావిడ్... 13 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 159 బంతుల్లో 98 పరుగులు చేసి కర్ణాటక విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో సమిత్ ఆడిన షాట్లు అతని తండ్రి రాహుల్ ద్రావిడ్‌ను గుర్తు చేశాయి. అద్భుతమైన కవర్ డ్రైవ్‌లతో ఆకట్టుకున్నాడు. కొన్ని కవర్ డ్రైవ్ షాట్‌లైతే తండ్రి రాహుల్ ద్రావిడ్‌నే తలపించాయి. తండ్రి లాగే ఆడిన ఫ్రంట్ ఫుట్ షాట్లు, కవర్ డ్రైవ్‌లు ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం సమిత్ బ్యాటింగ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు తండ్రికి తగ్గ తనయుడు అని కొనియాడుతున్నారు. ఈ మ్యాచ్‌లో బాల్‌తోనూ సత్తా చాటిన సమిత్ 3 వికెట్లు తీశాడు. మొత్తంగా ఆల్ రౌండ్ షోతో కర్ణాటకను ఒంటి చేతితో గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో జమ్మూకశ్మీర్‌పై కర్ణాటక ఇన్నింగ్స్ 130 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.
కర్ణాటక కెప్టెన్‌గా అన్వయ్
కొన్నిరోజుల క్రితంకూచ్ బెహార్ ట్రోఫీలో భాగంగానే కర్ణాటక అండర్-19 జట్టు ఉత్తరాఖండ్‌తో తలపడింది. ఈ మ్యాచ్‌కు రాహుల్ ద్రావిడ్ సతీమణి విజేతతో కలిసి హాజరయ్యాడు. అక్కడ కొడుకు సమిత్ ఆటను చూసి మురిసిపోయాడు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో ప్రముఖుల కోసం ఏర్పాటు చేసిన గ్యాలరీలో కాకుండా సాధారణ వ్యక్తిలాగా తన భార్యతో కలిసి స్టేడియంలో మెట్లపై కూర్చొని కుమారుడి ఆటను చూశాడు. ఇక రాహుల్ ద్రవిడ్ చిన్న కుమారుడు అన్వయ్ ద్రవిడ్ కర్ణాటకకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ (Rahul Dravid) పదవీకాలం ముగిసిందని, ఆయన స్థానంలో కొత్త కోచ్ వస్తారని ప్రచారం జరగగా వాటికి ఫుల్ స్టాప్ పెట్టి భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కోచ్, సపోర్ట్ స్టాఫ్ పై అధికారిక ప్రకటన చేసింది. రాహుల్ ద్రావిడ్ హెడ్ కోచ్ గా కొనసాగుతారని, అదే విధంగా సపోర్టింగ్ స్టాఫ్ కాంట్రాక్ట్ ను బీసీసీఐ పొడిగించింది. టీమిండియా (Team India) హెడ్ కోచ్ గా రాహుల్ ద్రావిడ్, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాఠోడ్, బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే, ఫీల్డింగ్ కోచ్ దిలీప్ కొనసాగనున్నారు. అయితే ఎంతవరకూ వీరు పదవిలో కొనసాగుతారనేది బీసీసీఐ వెల్లడించలేదు. పరిస్థితి గమనిస్తే వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచ కప్ నకు వీరే సేవలు అందించేలా కనిపిస్తోంది.