Viral Video News: చావా సినిమా ప్రభావం- ఔరంగజేబు నిధి కోసం కోటను తవ్వేస్తున్న జనం- నిజంగానే బంగారం ఉందా?
Madhya Pradesh News: చావా సినిమాకు ప్రభావితమైన ప్రజలు మధ్యప్రదేశ్‌లోని ఆశిఘడ్ కోట సమీపంలో నిధి ఉందని భావిస్తున్నారు. దీని కోసం రాత్రి వేళల్లో తవ్వకాలు చేస్తున్నారు.

Madhya Pradesh News: చత్రపతి శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా రూపొందిన చావా సినిమా తెలుగులోనూ విడుదలై హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. హిందీలో అయితే చెప్పనవసరం లేదు. మూడు వారాలు దాటినా హౌస్ ఫుల్ కలెక్షన్స్‌తో సంచలనం రేపుతోంది. తమకు అంతగా తెలియని శంభాజీ మహారాజ్ జీవితాన్ని తెలియజేసినందుకు దేశ ప్రజలు సినీ బృందానికి బ్రహ్మరథం పడుతున్నారు. ఇది అంతా బానే ఉంది. కానీ ఇప్పుడో కొత్తబెడద వచ్చి పడింది. "చావా" సినిమాలో మొఘల్ చక్రవర్తుల నిధి ఉన్నట్టు చూపించిన ఒక కోట పరిసర ప్రాంతాలను అక్కడి ప్రజలు బంగారం కోసం తవ్వేస్తున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఆ వీడియోలు వైరల్ అయ్యాయి.

బుర్హంపూర్‌లోని అశిఘడ్ కోటలో ఔరంగజేబు నిధి ?
"చావా" సినిమాలో ఔరంగజేబు ఎంతో ఇష్టపడి అభివృద్ధి చేసిన నగరంగా మధ్యప్రదేశ్‌లోని బుర్హంపూర్ నగరాన్ని చూపిస్తారు. అక్కడ ఉన్న ఆశిఘడ్ కోటలో దక్కన్ నుంచి కొల్లగొట్టిన ధనాన్ని ఔరంగజేబు సైన్యాలు దాచి ఉంచినట్టు దానిపై శంబాజీ దాడి చేసినట్టు చూపించారు. చారిత్రకంగా అంతవరకు వాస్తవమే. కానీ ఆ ధనాగారం ఇప్పటికీ ఉందని ఆశీఘడ్ కోట సమీపంలోనే అది పాతి పెట్టారని ఒక పుకారు లేచింది. దానితో అక్కడి ప్రజలు కోట చుట్టుపక్కల ప్రాంతాల్లోని పొలాల్లో బంగారు నాణేల కోసం తవ్వేస్తున్నారు. సాయంత్రం చీకటి పడగానే 7గంటల నుంచి ఉదయం తెల్లవారుఝామున 3 గంటల వరకూ లైట్లు మెటల్ డిటెక్టర్లు పట్టుకుని ఆ పాడుబడిన కోట చుట్టూ వేలం వెర్రిగా తవ్వేస్తున్నారు. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. హరూన్ షేక్' అనే వ్యక్తికి సంబంధించిన పొలంలో ఔరంగజేబు కాలంనాటి బంగారు నాణాలు అన్న పుకారు బయలుదేరడంతో జనం ఇలా తవ్వకాలు చేపట్టినట్టు స్థానికులు చెప్తున్నారు. వీడియోలు వైరల్ కావడంతో పోలీసులు అక్కడికి వస్తున్నారన్న వార్త తెలిసి జనం మాయమయ్యారు. ఆ పొలాల్లో తాజాగా తవ్విన గుంతలు మాత్రం పోలీసులను పలకరించాయి. ఈ ఘటనపై విచారణ జరుగుతున్నట్టు అక్కడి పోలీస్ అధికారులు చెబుతున్నారు. కానీ ఒక సినిమాలో చూపించిన కొన్ని విషయాలను నిజమని నమ్మి ఇలా బంగారం కోసం జనం తవ్వకాలు చేపట్టారు అనే వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
#Chhava movie showed that Mughals looted Gold and treasure from Marathas and kept it in the Asirgarh Fort, Burhanpur, MP.
— Roshan Rai (@RoshanKrRaii) March 7, 2025
After watching the movie, locals flocked to the spot with digging tools, metal detectors and bags to dig up the treasure and take it home.
My heart bleeds… pic.twitter.com/zUiGyMoQKh
అమెరికా కూడా తక్కువేమీ కాదు
పై సంఘటన మధ్యప్రదేశ్‌లోని మారుమూల ప్రాంతంలో ఏదో చదువుకోని ప్రజలు చేసిన అమాయక చర్యగా భావించొచ్చు. కానీ పూర్తిగా ఎడ్యుకేటెడ్ కంట్రీగా భావించే అమెరికాలోనే ఇంతకు ముందు ఇలాంటి ఘటన జరిగింది. సైన్స్ ఫిక్షన్ రచయిత HG వెల్స్ రాసిన 'ది వార్ ఆఫ్ ది వరల్డ్స్' నవల రేడియో నాటకంగా ప్రసారమైంది. అప్పుడు నిజంగానే గ్రహాంతరవాసులు అమెరికాపై దండయాత్రకు వచ్చారు అనుకుని ప్రజలు ఇళ్లల్లో తలుపులు బిగించుకుని కూర్చున్నవారట. ఆ రోజుల్లో అమెరికాలో ఇదో పెద్ద కలకలం అని నాటి పత్రికలు పేర్కొన్నాయి. ప్రజలపై రేడియో, సినిమావంటి ప్రసారమాధ్యమాల ప్రభావం ఎంత బలంగా ఉంటుందో చెప్పడానికి ఇవి ఉదాహరణలు.
Also Read: తెలుగులోనూ 'ఛావా' హవా - ఫస్ట్ డే కలెక్షన్లు ఎంతంటే?





















