Etela Rajender: అప్పుడు మొఘల్ పాలకులు, ఇప్పుడు కాంగ్రెస్ పాలకులు గుడులు కూల్చుతున్నారు: ఈటెల రాజేందర్
HYDRA News | గతంలో మెఘల్ పాలకులు సనాతన ధర్మంపై దాడికి దిగి ఆలయాలను ధ్వంసం చేశారని, ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పాలకులు ఆలయాలు కూల్చుతున్నారని ఈటెల రాజేందర్ ఆరోపించారు.

Etela Rajender visits temples in Jagadgirigutta మేడ్చల్: జగద్గిరిగుట్ట డివిజన్‌లో గుట్టపై ఉన్న 17 ఆలయాలను కూల్చివేయానికి హైడ్రా కమిషనర్ నోటీసులు జారీ చేయడం దుమారం రేపుతోంది. పలు సామాజిక వర్గాల వారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ను ఆశ్రయించి, తమ సమస్యను పరిష్కరించాలని కోరడంతో ఆయన శనివారం నాడు జగద్గిరిగుట్ట ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం బీజేపీ నేత ఈటెల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ.. 60, 70 ఏళ్ల కిందట పలు ప్రాంతాల నుంచి పొట్ట చేతపట్టుకుని ఇక్కడికి వస్తే ఆశ్రయం ఇచ్చిన గడ్డ జగద్గిరిగుట్ట. కులాల, మతాలు అనే వ్యత్యాసం లేకుండా 30 నుంచి 80 గజాలలో ఇండ్లు కట్టుకుని నివాసం ఉంటున్నారు. ఇక్కడ వారు ఆయా కులాలు, మతాలకు అనుగుణంగా గుడులు నిర్మించుకుని పూజించుకుంటున్నారు. వారి ఆలయాలను కూల్చివేస్తామని నోటీసులు ఇవ్వడం అత్యంత దారుణం, దుర్మార్గం అని ఈటల వ్యాఖ్యానించారు.
కూల్చేది ఇటుకలు, సిమెంట్‌ను కాదు..
‘హైడ్రా అధికారులు జగద్గిరిగుట్లలోని ఈ ఆలయాలను కూల్చివేస్తామని నోటీసులు ఇచ్చారు. అయితే అధికారులు నోటీసులు ఇచ్చింది, కూల్చివేయబోతున్నది కేవలం సిమెంట్, ఇటుకలను, గోడల్ని కాదు. ఇవి ప్రజల నమ్మకాలు, ప్రజల విశ్వాసం. ఈ కాంపాండ్ గోడల్ని కూల్చివేయడం అంటే సనాతన ధర్మంపై జరుగుతున్న దాడులు. మా గుండెలపై జరుగుతున్న దాడి. ఆనాడు ఎక్కడనుంచో విదేశాల నుంచి వచ్చిన మొఘలాలలు మా ఆలయాలపై దాడులు చేసి విధ్వంసం సృష్టించారు. ఇప్పుడు కాంగ్రెస్ పాలకులు అదే తీరుగా వ్యవహరిస్తున్నారు.
నోటీసులు వెనక్కి తీసుకోకపోతే అంతే..
పరాయి ప్రాంతాల నుంచి వచ్చిన విదేశీ పాలకులు ఆనాడు సనాతన ధర్మంపై ఎన్నో దండయాత్రలు, మన ఆలయాలు దురాక్రమణ చేసి విధ్వంసానికి పాల్పడ్డారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మా గుడులకు నోటీసులు ఇచ్చింది. ఈ 17 ఆలయాలకు ఇచ్చిన నోటీసులను ప్రభుత్వం బేషరతుగా వెనక్కి తీసుకోవాలి. ఇక్కడి ప్రజల సంస్కృతి, సాంప్రదాయాలపై దాడి చేస్తే చూస్తూ ఊరుకునేది లేదు. స్థానిక ఎంపీగా నియోజకవర్గ ప్రజల కోసం పోరాటం చేస్తా. వారి కాళ్లల్లో ముల్లు గుచ్చుకంటే పంటితో పీకేస్తా. వారి కోసం ఎంతదాకైనా వస్తానని’ తెలంగాణ ప్రభుత్వాన్ని ఎంపీ ఈటల రాజేందర్ హెచ్చరించారు.
చిన్నారులు ఆలయంలో ఎందుకున్నారని ఆరా..
ఆలయం వద్ద కొందరు బాలురు మంత్రోచ్ఛరణ చేస్తుంటే ఇంత చిన్న వయసులో ఎందుకు ఇక్కడ ఉన్నారని, తల్లిదండ్రులకు ఈ విషయం తెలుసా అని ఎంపీ ఈటల రాజేందర్ ఆలయ అర్చకులను అడిగారు. ఏడో తరగతికి కొందరు బాలురు వచ్చి మంత్రాలు, పూజా విధానం నేర్చుకుంటారని చెప్పారు. వారు వేద పాఠశాలల విద్యార్థులు అని, చాలా ఆలయాలకు ఇదే విధంగా స్కూల్ దశలోనే వారు వచ్చి మంత్రోచ్ఛరణ, పూజల ప్రక్రియ తెలుసుకుంటారని వివరించారు. అనంతరం మళ్లీ వేద పాఠశాలకు వెళ్తే ప్రాక్టికల్స్ నిర్వహిస్తారని.. అలాగ వారి కెరీర్ మొదలవుతుందని ఈటలకు తెలిపారు. సమస్య ఏదైనా ఉంటే తనకు సమాచారం ఇవ్వాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ కూల్చివేతలను ఉపేక్షించేది లేదని.. ఇది సనాతన ధర్మంపై జరుగుతున్న దాడిగా ఈటల రాజేందర్ అభివర్ణించారు.






















