Sachin Meets Bill Gates: ఇద్దరు దిగ్గజాల కలయిక- బిల్ గేట్స్ తో భేటీ అయిన సచిన్ టెండూల్కర్
Sachin Meets Bill Gates: భారత క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ను కలిశారు. తన సతీమణి అంజలితో కలిసి గేట్స్ తో సమావేశమయ్యారు.
Sachin Meets Bill Gates: భారత క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ను కలిశారు. తన సతీమణి అంజలితో కలిసి గేట్స్ తో సమావేశమయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోలను సచిన్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు.
ముంబయిలో సచిన్, బిల్ గేట్స్ ల భేటీ జరిగింది. గేట్స్ తో తాము కలిసి ఉన్న ఫొటోను పోస్ట్ చేసిన సచిన్ దానికింద ఇలా రాసుకొచ్చారు. 'మనమందరం జీవితమంతా విద్యార్థిగానే ఉంటాం. పిల్లల విద్య, ఆరోగ్య సంరక్షణతో సహా దాతృత్వంపై దృక్కోణాలను నేర్చుకోవడానికి ఈ రోజు ఒక గొప్ప అవకాశం వచ్చింది. వీటిపైనే సచిన్ ఫౌండేషన్ పనిచేస్తోంది. ప్రపంచ సవాళ్లను పరిష్కరించడానికి ఒకరి ఆలోచనలు మరొకరు పంచుకోవడం ఒక శక్తివంతమైన మార్గం' అని సచిన్ రాసుకొచ్చారు.
సచిన్ టెండూల్కర్ ఫౌండేషన్
క్రికెట్ లో కొనసాగుతున్నప్పుడే సచిన్ తన పేరు మీద ఒక ఫౌండేషన్ ను ఏర్పాటు చేశారు. ప్రజలు, సంస్థలు, వనరులను ఒక చోట చేర్చడానికి ఇది వేదికగా ఉంటోంది. ఈ ఫౌండేషన్ పిల్లలకు సమాన అవకాశాలు కల్పించడంలో, వారికి మెరుగైన ప్రపంచాన్ని రూపొందించడంలో సహాయపడుతుంది. పిల్లల ఆరోగ్యంపై ఈ సంస్థ దృష్టిపెడుతుంది. తేలికపాటి ఖర్చుతో పేద పిల్లలకు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ అందే విధంగా.. ఆసుపత్రులతో కలిసి సచిన్ సంస్థ పనిచేస్తోంది. అలాగే పిల్లలకు నాణ్యమైన విద్య అందేలా... వారి కలలను నెరవేర్చుకునే దిశగా ప్రోత్సహించేలా ఈ ఫౌండేషన్ సహాయం చేస్తుంది.
రిటైర్మెంట్ తర్వాత టెండూల్కరు ఈ ఫౌండేషన్ మీద ఎక్కువ దృష్టిపెట్టారు. ప్రస్తుతం ఈ సంస్థ పని మీదే సచిన్, బిల్ గేట్స్ ను కలిసినట్లు తెలుస్తోంది.
View this post on Instagram
వాంఖడేలో సచిన్ నిలువెత్తు విగ్రహం
భారత లెజెండ్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కు మరో గౌరవం దక్కనుంది. ముంబయిలోని ప్రఖ్యాత వాంఖడే స్టేడియంలో సచిన్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. టెండూల్కర్ ఈ మైదానంలో తన కెరీర్ లో చివరి మ్యాచ్ ఆడాడు. ఈ విగ్రహాన్ని సచిన్ 50వ జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేయనున్నారు. ఏప్రిల్ 23న కానీ.. ఈ ఏడాది చివర్లో జరిగే వన్డే ప్రపంచకప్ సమయంలో కానీ విగ్రహావిష్కరణ ఉంటుందని స్టేడియం అధికారులు తెలిపారు. |
'సచిన్ టెండూల్కర్ భారత క్రికెట్ కోసం ఏం చేశాడో అందరికీ తెలుసు. అతను భారతరత్న. ఈ ఏప్రిల్ తో సచిన్ 50వ పడిలోకి అడుగుపెట్టనున్నాడు. కాబట్టి ఎంసీఏ (ముంబయి క్రికెట్ అసోసియేషన్) నుంచి ఒక చిన్న బహుమతి అతనికి ఇవ్వబోతున్నాం. దీని గురించి సచిన్ తో చర్చించాం. అతని అనుమతి లభించింది. అని ఇది వాంఖడే స్టేడియంలో పెట్టే మొదటి విగ్రహం అవుతుంది, దానిని ఎక్కడ ఉంచాలో మేము నిర్ణయిస్తాం' అని ఎంసీఏ అధ్యక్షుడు అమోల్ కాలే తెలిపాడు.