RCB News: డుప్లెసిస్ స్థానంలో ఆ విధ్వంసక ప్లేయర్ ను ఎందుకు తీసుకున్నామంటే? RCB మేనేజ్‌మెంట్
Faf du Plessis : స్థిరంగా రాణిస్తున్న డుప్లెసిస్ ను వేలానికి రిలీజ్ చేసి, అతని స్థానంలో విధ్వంసక ప్లేయర్ ని జట్టులోకి తీసుకుంది. అందుకు గల కారణాలను టీమ్ మేనేజ్మెంట్ వెల్లడించింది.
IPL 2025 News: ఐపీఎల్ మెగా వేలానికి ముందు తమ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ ను రిలీజ్ చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు. ఓపెనర్ గా సేవలందించే అతడిని సాగనంపి, ఆ స్థానంలో ఇంగ్లాండ్ బ్యాటర్ ఫిల్ సాల్ట్ ను వేలంలో కొనుగోలు చేసింది. అయితే వేలానికి ముందు కోహ్లీతో ఓపెనర్ గా ఎవరుండాలి..? అనే దానిపై ఐదుగురు ప్లేయర్లతో ఓటింగ్ నిర్వహించింది. డు ప్లెసిస్, ఫిల్ సాల్ట్, విల్ జాక్స్, జోస్ బట్లర్, రచిన్ రవీంద్ర లతో కూడిన పోల్ లో చాలామంది ఫ్యాన్స్ డుప్లెసిస్ కే ఓటేశారు. అయితే డుప్లెసిస్ ను రిలీజ్ చేసిన ఆర్సీబీ.. తనను వేలంలో తీసుకోలేదు. ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం రూ.2 కోట్లకు తనను కైవసం చేసుకుంది. మరోవైపు రూ.11.5 భారీ ధరతో సాల్ట్ ను ఆర్సీబీ దక్కించుకుంది. అయితే తాజాగా దీని వెనకాల ఉన్న కారణాన్ని టీమ్ మేనేజ్మెంట్ వెల్లడించింది.
ఫారిన్ ఓపెనర్ కోసం వేట..
నిజానికి గత మూడేళ్లుగా డుప్లెసిస్ ఆర్సీబీకి ఆడుతూ.. బాగానే రాణిస్తున్నాడు. అయితే ఇప్పటికే 40వ పడిలో డుప్లెసిస్ వారసుడిని వెతకాలనే ఉద్దేశంతోనే అతడికి ఉధ్వాసన పలికినట్లు ఆర్సీబీ మేనేజ్మెంట్ తెలిపింది. ఇక భారత ఓపెనర్లలో విధ్వంసక ప్లేయర్లు తక్కువగా ఉన్నారని టీమ్ మేనేజ్మెంట్ లో సభ్యుడు దినేశ్ కార్తీక్ గుర్తు చేశాడు. తనకు తెలిసి ఇషాన్ కిషాన్ మాత్రమే కాస్త విధ్వంసంగా ఆడగలడని, అందుకే తాము ఫారిన్ ప్లేయర్ల కోసం వేలంలో ప్రయత్నించినట్లు వెల్లడించాడు. ఇక ఓవర్లో 15, 16 పరుగులు తరచూ కొట్టగల సామర్థ్యం సాల్ట్ కి ఉన్నందునే అతడిని ఓపెనర్ గా తీసుకున్నట్లు టీమ్ సీఈఓ మో బొబాట్ వెల్లడించాడు. అలాగే వికెట్ కీపర్ గానూ తను సేవలందించగలడని గుర్తు చేశాడు.
స్పిన్ బాగా ఆడతాడని..
తమకు పవర్ ప్లేలో స్పిన్ బాగా ఆడగల ఓపెనర్ కోసం వెతికామని, సాల్ట్ రూపంలో సమాధానం దొరికిందని కార్తీక్ తెలిపాడు. బట్లర్, సాల్ట్, జాక్స్ లాంటి విధ్వంసక క్రికెటర్లు తమదైన రోజున 40, 50 బంతుల్లోనే సెంచరీలు బాదుతారని, ఓవర్లలో ఎక్కువ పరుగులు సాధించే ఎబిలీటీ ఉందని పేర్కొన్నాడు. అలాంటి వారిని వేలంలో దక్కించుకోడానికి వేలంలో ప్రణాళికలు రూపొందించామని తెలిపాడు. ఈక్రమంలో సాల్ట్ ను దక్కించుకున్నామని పేర్కొన్నాడు. ఇక వెటరన్ ప్లేయర్ గా డుప్లెసిస్ కి అపార అనుభవం ఉంది. తను చెన్నై సూపర్ కింగ్స్, రైసింగ్ పుణే సూపర్ జెయింట్స్, ఆర్సీబీ తరపుణ 145 మ్యాచ్ లు ఆడాడు. 35కిపైగా సగటుతో 136 స్ట్రైక్ రేటుతో 4,571 పరుగులు సాధించాడు. ఇక గత మూడు సీజన్లుగా ఆర్సీబీకి ఆడుతున్న డుప్లెసిస్.. 45 మ్యాచ్ ల్లో 38 సగటుతో 1636 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 147 కావడం విశేషం. ఇక గతేడాది జట్టు ప్లే ఆఫ్ చేరడంలో తను కీలకపాత్ర పోషించాడు. అయినా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని యువకుడైన సాల్ట్ వైపే మొగ్గు చూపింది. ఏదేమైనా ఈసారైనా కప్పు సాధించాలని బెంగళూరు ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.