IND vs AUS: WTC తో లింక్ - ఆసీస్ హ్యాపీ.. ఇండియాకు బీపీ..!
Border Gavaskar Trophy: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ చేరాలంటే టీమిండియాకు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ చాలా ముఖ్యం. మన ముందు ఉన్న అవకాశాలు, ప్రమాదాలేంటో చూద్దాం.
IND vs AUS: మరో నాలుగు రోజుల్లో ఇండియా ఆస్ట్రేలియా మధ్య ప్రతిష్ఠాత్మక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మొదలు కాబోతోంది. నాలుగు టెస్టుల ఈ సిరీస్ కోసం ఇప్పటికే అంచనాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. గత రెండుసార్లూ ఓడిపోయిన ఆసీస్... ఈసారి ఎలాగైనా ఇండియాను దెబ్బతీయాలని చూస్తోంది. అయితే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ను దృష్టిలో పెట్టుకుంటే... ఈ సిరీస్ ఆస్ట్రేలియా కన్నా మనకే చాలా ముఖ్యం. ఫైనల్ చేరాలంటే ఈ సిరీస్ లో మనం అదరగొట్టాల్సిందే. ప్రస్తుతం ఆసీస్, ఇండియా, శ్రీలంకలో 2 జట్లు ఫైనల్ కు వెళ్లేందుకు అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కానీ అది జరగాలంటే అసలు ఈ మూడు జట్లు చేయాల్సిందేంటో ఇప్పుడు చూద్దాం.
1. ఆస్ట్రేలియా
రీసెంట్ గా సౌతాఫ్రికాపై 2-0 టెస్టు సిరీస్ విజయంతో ఆస్ట్రేలియా పాయింట్ల శాతం 75.56 కి చేరింది. సింపుల్ గా చెప్పాలంటే దాదాపుగా ఫైనల్ చేరుకున్నట్టే. ఆస్ట్రేలియా ఫైనల్ అవకాశాలు ఎప్పుడు పోతాయో తెలుసా...? ఇండియాతో నాలుగు టెస్టులూ ఓడిపోయి... శ్రీలంక న్యూజిలాండ్ మీద రెండు టెస్టులూ గెలిచేస్తే... అప్పుడు ఆస్ట్రేలియా మూడో స్థానానికి పడిపోతుంది. ఈ మ్యాచెస్ లో ఏ ఒక్కటి కనీసం డ్రా అయినా చాలు... ఆస్ట్రేలియా ఫైనల్ కు వెళ్లడం పక్కా. ఇప్పుడున్న ఫాం ప్రకారం చూస్తే అది జరగడం ఖాయమే. సో WTC ఫైనల్ ప్రెషర్ ఆసీస్ మీద లేనట్టే. కానీ వరుసగా మూడోసారి బీజీటీ ఓడిపోకూడదన్న ప్రెషర్ మాత్రం ఉంటుంది. ఆస్ట్రేలియాకు కనీసం ఒక్క డ్రా అయినా సరిపోతుంది కానీ అదే సమయంలో స్లో ఓవర్ రేట్ వల్ల పాయింట్ల పెనాల్టీ పడకుండా జాగ్రత్త పడాలి. లేకపోతే ప్రమాదమే.
2. ఇండియా
రీసెంట్ గా బంగ్లాదేశ్ పై సిరీస్ విజయం తర్వాత 58.93 పాయింట్ల శాతంతో ప్రస్తుతం టీమిండియా రెండో స్థానంలో ఉంది. వేరే ఫలితాలతో సంబంధం లేకుండా ఫైనల్ కు చేరాలంటే ఆస్ట్రేలియాపై 4-0 లేదా 3-1 తేడాతో ఇండియా గెలవాలి. అలా చేస్తే అయితే 68.06 పాయింట్ల శాతానికి లేదా 62.5 పాయింట్ల శాతానికి ఇండియా చేరుకుంటుంది. ఒకవేళ టీమిండియా సిరీస్ ను 2-2 తో సమం చేసుకుని, శ్రీలంక న్యూజిలాండ్ పై 2-0తో గెలిస్తే మాత్రం ఇండియా ఫైనల్ కు వెళ్లదు.ఒకవేళ 4-0, 3-1తో కాకుండా వేరే మార్జిన్ తో కనుక ఇండియా సిరీస్ గెలిస్తే మాత్రం... శ్రీలంక-న్యూజిలాండ్ సిరీస్ లో కనీసం ఒక్క మ్యాచ్ అయినా డ్రా అయితేనే మనం ఫైనల్స్ కు వెళ్లగలం. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో తెలుసుగా.... విజయానికి 12 పాయింట్లు, టై కు 6 పాయింట్లు, డ్రాకు 4 పాయింట్లు వస్తాయి. సో ఆస్ట్రేలియాతో సిరీస్ లో ఏదైనా మ్యాచ్ డ్రా అయినా సరే టీమిండియాకు పాయింట్లు వస్తాయి. పాయింట్ల శాతం మెరుగయ్యే ఛాన్స్ ఉంది. జస్ట్ ఓడకూడదు అంతే.
3. శ్రీలంక
ప్రస్తుతం 53.33 పాయింట్ల శాతంతో మూడో స్థానంలో ఉన్న శ్రీలంకకు కూడా ఫైనల్ కు చేరేందుకు మెరుగైన అవకాశాలు ఉన్నాయి. వచ్చే నెలలో కివీస్ తో జరగబోయే 2 మ్యాచ్ ల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేస్తే.... 61.11 పాయింట్ల శాతానికి శ్రీలంక చేరుకుంటుంది. అప్పుడు కూడా ఇండియా-ఆస్ట్రేలియా సిరీస్ ఫలితం మీదే శ్రీలంక ఫ్యూచర్ ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఇండియా 4-0తో ఆసీస్ పై, శ్రీలంక 2-0తో కివీస్ పై గెలిస్తే ఇండియా, శ్రీలంక ఫైనల్స్ కు వెళ్తాయి. శ్రీలంక 2-0తో కివీస్ పై గెలిచి, ఆస్ట్రేలియా ఏ మార్జిన్ తో అయినా సరే ఇండియాపై గెలిస్తే.... ఆస్ట్రేలియా, శ్రీలంక ఫైనల్ కు చేరతాయి.
ఇవి ఈ మూడు టీమ్స్ ముందు ఉన్న అవకాశాలు. 48.72 పాయింట్ల శాతంతో ఉన్న సౌతాఫ్రికాకు కూడా చాలా తక్కువ అవకాశం ఉంది. వెస్టిండీస్ తో రెండు మ్యాచులూ గెలవాలి. శ్రీలంక ఒక్క మ్యాచ్ కన్నా ఎక్కువ గెలవకూడదు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ నుంచి భారత్ కు 21 కన్నా తక్కువ పాయింట్లు మాత్రమే రావాలి. కానీ ఈ సమీకరణాలన్నీ చాలా కష్టం. సో లెక్కల ప్రకారం సౌతాఫ్రికాకు ఛాన్స్ ఉన్నా.... నిజానికి అది చాలా కష్టమే. సో ఫైనల్ బెర్తుల కోసం ప్రధాన పోటీ ఇండియా, ఆస్ట్రేలియా, శ్రీలంక మధ్యే.