Ind Target is 193 vs Eng In 3rd Test: సత్తా చాటిన టీమిండియా బౌలర్లు.. ఇంగ్లాండ్ 192 ఆలౌట్.. వాషింగ్టన్ కు 4 వికెట్లు.. రాణించిన బుమ్రా, సిరాజ్
మూడో టెస్టును కైవసం చేసుకునేందుకు భారత్ రంగం సిద్ధం చేసింది. రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ ను తక్కువ స్కోరుకే పరిమితం చేసిన ఇండియా.. సిరీస్ లో ఆధిక్యం సాధించాలని తహతహలాడుతోంది.

Washington Sundar 4 Wickets: ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియ పట్టు బిగించింది. ఆదివారం నాలుగో రోజు ఓవర్ నైట్ స్కోరు 2/0 తో రెండో ఇన్నింగ్స్ ను కొనసాగించిన ఇంగ్లాండ్ 62.1 ఓవర్లలో 192 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఓవరాల్ గా 192 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. దీంతో 193 పరుగుల టార్గెట్ ను భారత్ కు నిర్దేశించింది. వెటరన్ బ్యాటర్ జో రూట్ (96 బంతుల్లో 40, 1 ఫోర్) మరోసారి టాప్ స్కోరర్ గా నిలిచాడు. వాషింగ్టన్ సుందర్ కీలకమైన మూడు వికెట్లు తీయడంతో గేమ్ భారత్ చేతుల్లోకి వచ్చింది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్, ఇండియా కరెక్టుగా 387 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.
🚨 Anderson Tendulkar Trophy 2025, 3rd Test 🚨
— Sporcaster (@Sporcaster) July 13, 2025
England have been bowled out for 192 runs and set the target of 193 runs for India
Top Performances
Joe Root - 40 (96)
Ben Stokes - 33 (96)
Harry Brook - 23 (19)
Washington Sundar - 4/22
Mohammed Siraj - 2/31
Jasprit… pic.twitter.com/Mm4Jm6pOy2
సిరాజ్ దూకుడు..
అంతకుముందు ఓవర్ నైట్ స్కోరు తో నాలుగో రోజు ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. దూకుడుగా ఆడాలని చూసిన ఓపెనర్ బెన్ డకెట్ (12)ను మహ్మద్ సిరాజ్ పెవిలియన్ కు పంపాడు. ఆ తర్వాత కాసేపటికే ఒల్లీ పోప్ (4)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్న సిరాజ్.. రెండో వికెట్ ను కూడా సాధించాడు. ఈ దశలో ఓపెనర్ జాక్ క్రాలీ (22), రూట్ కాసేపు వికెట్లు పడకుండా ఆడారు. అయితే క్రీజులో అసౌకర్యంగా కదిలి, నెమ్మదిగా ఆడిన క్రాలీని తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డి మరోసారి ఔట్ చేశాడు. గల్లీలో యశస్వి జైస్వాల్ పట్టిన అద్భుత క్యాచ్ కు తను ఔటయ్యాడు. ఈ దశలో నాలుగు బౌండరీలు, ఒక సిక్సర్ తో హేరీ బ్రూక్ (23) కాస్త వేగంగా ఆడాలని చూశాడు. అతడిని ఆకాశ్ దీప్ పెవిలియన్ కు పంపాడు. ఆ తర్వాత రూట్, బెన్ స్టోక్స్ (33) జోడీ కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరూ ఆచితూచి ఆడటంతోపాటు, కీలక దశలో పరుగులు సాధించి ఐదో వికెట్ కు 67 పరుగులు నెలకొల్పారు.
వాషింగ్టన్ జోరు..
టీ విరామం తర్వాత ఇంగ్లాండ్ వికెట్లను వెంటవెంటనే తీశారు. అంతకుముందు జో రూట్ ను వాషింగ్టన్ చక్కని బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు. కాసేపటికే ఫామ్ లో ఉన్న జేమీ స్మిత్ (8)ను కూడా వాషీ ఔట్ చేశాడు. దీంతో ఇంగ్లాండ్ చిక్కుల్లో పడింది. ఇక క్రీజులో పాతుకు పోయిన స్టోక్స్ ను కూడా వాషీ క్లీన్ బౌల్డ్ చేయడంతో మ్యాచ్ భారత్ చేతుల్లోకి వచ్చింది. ఈ దశలో బౌలింగ్ కు దిగిన జస్ ప్రీత్ బుమ్రా.. త్వరత్వరగా టెయిలెండర్లను పెవిలియన్ కు పంపాడు. ముందుగా బ్రైడెన్ కార్స్ (1), క్రిస్ వోక్స్ (10)లను ఔట్ చేశాడు. ఇక ఆఖరి వికెట్ అయిన షోయబ్ బషీర్ (2)ను వాషింగ్టన్ ఔట్ చేసి, ఈ ఇన్నింగ్స్ లో నాలుగు వికెట్లు సాధించాడు. దీంతో భారత్ ముందు 193 పరుగుల టార్గెట్ ను ఇంగ్లాండ్ ముందు ఉంచినట్లయ్యింది. మిగతా బౌలర్లలో సిరాజ్ కు రెండు వికెట్లు దక్కాయి. ఐదు టెస్టుల సిరీస్ లో ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలవడంతో 1-1తో సిరీస్ సమం గా ఉంది.




















