David Warner: వార్నర్ కెరీర్‌లో అదో మాయని మచ్చ
David Warner: ఓపెనర్‌గా బరిలోకి దిగి వికెట్ల ముందు గోడ కట్టి జట్టుకు ఎన్నోసార్లు అద్భుత ప్రారంభాలను అందించిన వార్నర్‌కు తన కెరీర్‌లో బాల్‌టాంపరింగ్ వివాదం మాత్రం ఓ మాయని మచ్చలా మిగిలిపోయింది.
ఆస్ట్రేలియా క్రికెట్‌లో ఓ శకం ముగిసింది. స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ (David Warner) టెస్టులకు వీడ్కోలు పలికాడు. పాకిస్తాన్‌తో మూడో టెస్టు అనంతరం సుదీర్ఘ ఫార్మట్ నుంచి డేవిడ్ భాయ్ తప్పుకున్నాడు. నాలుగో రోజు ఆట సందర్భంగా వార్నర్ బ్యాటింగ్ వచ్చినప్పుడు స్టేడియం దద్దరిల్లిపోయింది. టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన డేవిడ్ భాయ్ వన్డేలకు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించేశాడు. భారత్‌పై వన్డే ప్రపంచకప్ (ODI World Cup 2023) గెలిచిన మధుర క్షణాలే తన వన్డే కెరీర్‌కు ముగింపు పలకడానికి సరైన సమయంగా భావిస్తున్నట్లు వార్నర్ తెలిపాడు. ఆస్ట్రేలియా జట్టుకు ఎన్నో చిరస్మరణీయమైన విజయాలు అందించిన వార్నర్ టెస్ట్, వన్డే ఫార్మట్లకు వీడ్కోలు పలికాడు. కంగారు జట్టుకు ఒంటి చేత్తో మరపురాని విజయాలు అందించిన డేవిడ్ భాయ్.... కెరీర్‌ను ముగించాడు.ఓపెనర్‌గా బరిలోకి దిగి వికెట్ల ముందు గోడ కట్టి... ప్రతికూల పరిస్థితుల్లో కంగారు జట్టుకు ఎన్నోసార్లు అద్భుత ప్రారంభాలను వార్నర్ అందించాడు. అయితే వార్నర్‌కు తన అద్భుత కెరీర్‌లో బాల్‌టాంపరింగ్ వివాదం మాత్రం ఓ మాయని మచ్చలా మిగిలిపోయింది.
అసలు ఏం జరిగిందంటే...
ఆస్ట్రేలియా జట్టు మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడేందుకు 2018 మార్చిలో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లింది. కేప్‌టౌన్‌లో టెస్టు మ్యాచ్ సమయంలో ఆసీస్ ఆటగాడు కామెరూన్ బ్యాన్‌క్రాఫ్ట్ సాండ్‌పేపర్‌తో బంతిని రుద్దుతూ కెమెరా కంట పడ్డాడు. బాల్ ట్యాంపరింగ్ చేసి బంతి ఆకారాన్ని మార్చేందుకు ప్రయత్నించిన అతడిపై విచారణ జరపగా.. అందులో వార్నర్ హస్తం ఉందని తేలింది. దాంతో వార్నర్‌పై క్రికెట్ ఆస్ట్రేలియా రెండేళ్ల పాటు నిషేదం విధించింది. తర్వాత అతడిపై బ్యాన్ ఎత్తివేసినప్పటికీ.. ఆ వివాదం ఓ పీడకలలా మిగిలిపోయింది. వార్నర్ టెస్టులతో పాటు వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇకపై టీ20ల్లో మాత్రమే వార్నర్ ఆడనున్నాడు.
అలా ముగిసింది..
కివీస్‌పై అరంగేట్రం.. పాక్‌పై వీడ్కోలు
2011లో న్యూజిలాండ్‌పై టెస్టుల్లో అరంగేట్రం చేసిన వార్నర్.. 13 ఏళ్ల పాటు ఆస్ట్రేలియా జట్టుకు సేవలందించాడు. తన సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన విజయాల్లో డేవిడ్ భాయ్ భాగమయ్యాడు. ఓపెనర్‌గా ఎన్నో చిర్మసరణీయ విజయాలను కంగరూలకు అందించాడు. ప్రెజెంటేషన్ సమయంలో ఏకంగా సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో ఉన్న అభిమానులని గ్రౌండ్ లోకి అనుమతించడంతో వార్నర్ వీడ్కోలు మరింత ఘనంగా ముగిసాయి. మొత్తం టెస్ట్ కెరీర్‌లో 111 మ్యాచ్‌లు ఆడిన వార్నర్ 44.5 సగటుతో 8695 పరుగులు చేశాడు. అందులో 3 డబుల్ సెంచరీలు, 26 శతకాలు, 56 అర్ధ శతకాలు ఉన్నాయి. పాకిస్తాన్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసిన వార్నర్ ఎల్బీగా అవుటై పెవిలియన్ చేరుతున్న సమయంలో స్టేడియంలోని అభిమానులు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. వీరందరూ వార్నర్.. వార్నర్.. అంటూ గ్రౌండ్ అంతటా హోరెత్తించారు. ఇన్నేళ్ల క్రికెట్ చరిత్రలో వార్నర్ కు దక్కిన అరుదైన గౌరవంగా దీనిని భావించవచ్చు. పాక్ క్రికెటర్లు సైతం వార్నర్ ఔటైన తర్వాత వరుసగా నిలబడి చప్పట్లతో అభినందించారు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌కు సారథ్యం వహించిన ఈ ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్.. తెలుగువాళ్లకు చేరువయ్యాడు. ఆటతోనే కాకుండా.. తెలుగు సినిమా పాటలకు స్టెప్పులేస్తూ.. సోషల్ మీడియా ద్వారా తెలుగువాళ్లకు మరింత చేరువయ్యాడు. ఐపీఎల్‌లో అత్యంత ప్రభావవంతమైన విదేశీ క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు. కాగా, పాకిస్తాన్‌తో జరిగిన మూడు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ను ఆస్ట్రేలియా క్లీన్‌స్వీప్ చేసింది.