IPL టికెట్ స్కామ్: HCA అధ్యక్షుడు అరెస్ట్! SRHని బెదిరించారా? అసలు నిజం ఏమిటి?
IPL ticket scam: ఐపీఎల్ టిక్కెట్ల వ్యవహారంలో హెచ్‌సీఏ పాలకవర్గాన్ని సీఐడీ అదుపులోకి తీసుకుంది. టిక్కెట్ల కోసం హైదరాబాద్ ఫ్రాంచైజీని బెదిరించారని గతంలో ఆరోపణలు వచ్చాయి.

CID arrests HCA management in IPL ticket scam: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) అధ్యక్షుడు జగన్మోహన్ రావును సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. ఐపీఎల్‌లో ఉచిత టిక్కెట్ల కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)ను బెదిరించినట్లుగా విజిలెన్స్ దర్యాప్తులో తేలింది. వీరి నివేదిక ఆధారంగా సీఐడీ కేసులు పెట్టి అరెస్టు చేసింది.
ఫ్రీ టిక్కెట్ల కోసం బెదిరించిన జగన్మోహన్ రావు
ఐపీఎల్ జరుగుతున్న సమయంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జనరల్ మేనేజర్ (స్పోర్ట్స్) శ్రీనాథ్ , HCA అధ్యక్షుడు జగన్మోహన్ రావుపై ఉచిత ఐపీఎల్ టిక్కెట్ల కోసం “బెదిరింపు, బలవంతం, బ్లాక్‌మెయిల్” చేస్తున్నారని ఆరోపించారు. మార్చి 27, 2025న లక్నో సూపర్ జెయింట్స్ (LSG)తో జరిగిన మ్యాచ్ రోజున HCA అధికారులు F3 కార్పొరేట్ బాక్స్‌ను లాక్ చేశారని, అదనపు 20 ఉచిత టిక్కెట్లు ఇవ్వకపోతే దాన్ని తెరవబోమని బెదిరించారని SRH ఆరోపించింది.
హోంగ్రౌండ్ ను తరలిస్తామని హెచ్చరించిన ఎస్ఆర్‌హెచ్
HCAకు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం (RGICS) సామర్థ్యం 39,000 కాగా, ఒప్పందం ప్రకారం 10% (3,900) టిక్కెట్లు ఉచితంగా అందించాలి. అయితే, జగన్మోహన్ రావు ఈ 3,900 టిక్కెట్లతో పాటు అదనంగా 2,500–3,900 టిక్కెట్లను తనకు వ్యక్తిగతంగా ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారని SRH ఆరోపించింది. ఈ డిమాండ్‌ను SRH తిరస్కరించడంతో వివాదం తీవ్రమైంది. ఈ విషయంలో HCA వైఖరి మారకపోతే, హైదరాబాద్ నుంచి తమ హోమ్ మ్యాచ్‌లను వేరే వేదికకు మార్చాలని BCCI, తెలంగాణ ప్రభుత్వానికి తెలియజేస్తామని శ్రీనాథ్ హెచ్చరించారు.
విచారణకు ఆదేశించిన సీఎం రేవంత్
జగన్మోహన్ రావు వ్యక్తిగతంగా 3,900 టిక్కెట్లను కొనుగోలు కోసం బ్లాక్ చేయమని అడగలేదని HCA స్పష్టం చేసింది. ఫిబ్రవరి 19, 2025న జరిగిన చర్చలలో, HCA అపెక్స్ కౌన్సిల్ తరపున క్లబ్ సెక్రటరీలకు టిక్కెట్లు అందించాలని ప్రతిపాదించారని . F3 బాక్స్ లాక్ చేయడం SRH అధికారుల నిర్లక్ష్యం వల్ల జరిగిందని, చర్చల తర్వాత ఈ సమస్య కొన్ని గంటల ముందు పరిష్కారమైందని HCA వాదించింది. వివాదం తీవ్రమవడంతో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి HCAపై SRH చేసిన ఆరోపణలపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ జనరల్ కొత్తకోట శ్రీనివాస రెడ్డికి విచారణ జరపాలని ఆదేశించారు. విచారణలో జగన్మోహన్ రావు బెదిరించినట్లుగా తేలింది.
నిజమని తేలడంతో జగన్మోహన్ రావు అరెస్ట్
SRH, RGICSను ఐపీఎల్ సీజన్‌లో నిర్వహించడానికి HCAకు ఒక్కో మ్యాచ్‌కు రూ. 1 కోటి చెల్లిస్తుంది. స్టేడియం పెయింటింగ్, టాయిలెట్‌ల సర్వీసింగ్, ఏసీల స్థాపన వంటి మరమ్మతులను SRH నిర్వహించినప్పటికీ తామే చేయించిటన్లగా జగన్మోహన్ రావు ప్రచారం చేసుకున్నారని సన్ రైజర్స్ ఆరోపించింది. 2023లో జగన్మోహన్ రావు HCA అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి పలు వివాదాల్లో ఇరుక్కున్నారు. HCAలో గుర్తింపు లేని క్లబ్ తరపున పోటీ చేసి గెలిచారని కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.




















