Jasprit Bumrah: మూడో టెస్ట్‌కు బుమ్రా డౌటే ?, షాక్‌లో అభిమానులు
IND vs ENG: నిప్పులు చెరిగే బంతులతో బుమ్రా వైజాగ్ టెస్ట్ ఇంగ్లాండ్ పతనాన్ని శాసించాడు. కీలకమైన మూడో టెస్ట్‌కు బుమ్రా జట్టుకు దూరం కానున్నాడన్న వార్తలు అభిమానులను షాక్‌కు గురిచేశాయి.
మూడో టెస్ట్‌కు దూరమేనా..?
రాజ్ కోట్ వేదికగా జరిగే మూడో టెస్ట్‌కు బుమ్రాను దూరం పెట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కొన్ని రోజులుగా వరుసగా మ్యాచ్ లు ఆడుతున్న పేసు గుర్రం బుమ్రాకు విశ్రాంతి ఇవ్వాలనే ఉద్దేశంతోనే టీమిండియా మేనేజ్ మెంట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఐదు మ్యాచ్‌ల సుదీర్ఘ టెస్టు సిరీస్‌లో ప్రతి మ్యాచ్ ఆడినా బుమ్రా ఫిట్‌నెస్‌పై ప్రభావం పడుతుందని టీమిండియా మేనేజ్‌మెంట్ భయపడుతుందన్న వార్తలు వస్తున్నాయి. చివరి 2 టెస్టులకు బుమ్రాను మరింత ఫిట్ గా ఉంచేందుకు తదుపరి టెస్టు నుంచి విశ్రాంతి కల్పించిందని తెలుస్తోంది. రెండో టెస్టులో బుమ్రా రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి దాదాపు 33 ఓవర్లు బౌలింగ్ చేశాడు. జట్టులోని మిగతా బౌలర్లతో పోలిస్తే బుమ్రా వేసిన ఓవర్ల సంఖ్య పెరిగింది. స్పిన్నర్‌కు అనుకూలమైన పిచ్‌పై జట్టులోని ముగ్గురు స్పిన్నర్లు బుమ్రా కంటే తక్కువ బౌలింగ్ చేశారు. తొలి టెస్టులోనూ బుమ్రా దాదాపు 25 ఓవర్లు బౌలింగ్ చేశాడు. బుమ్రా గైర్హాజరీలో మహ్మద్ సిరాజ్ జట్టులోకి రానున్నాడు. ఈ సిరీస్ నుంచి మహ్మద్ షమీ పూర్తిగా దూరమయ్యే అవకాశం ఉంది.
బుమ్రా అరుదైన ఘనత
వైజాగ్ టెస్టులో నిప్పులు చెరిగే బంతులతో బుమ్రా ఇంగ్లాండ్ పతనాన్ని శాసించాడు. ఈ మ్యాచ్‌లో పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా తొమ్మిది వికెట్లు తీసి ఇంగ్లండ్ పతనాన్ని శాశించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆరు, సెకెండ్ ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు తీసిన బుమ్రా ఓ అరుదైన ఘనత సాధించాడు. చేతన్ శర్మ తర్వాత ఇంగ్లండ్‌పై అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన భారత సీమర్‌గా బుమ్రా రికార్డుల్లోకెక్కాడు. 1986లో ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్‌లో చేతన్ శర్మ 188 పరుగులిచ్చి 10 వికెట్లు పడగొట్టగా.. ఈ మ్యాచ్‌లో బుమ్రా 91 పరుగులు సమర్పించుకుని 9 వికెట్లు పడగొట్టాడు. ఈ గణాంకాలు బుమ్రా కెరీర్‌లో రెండో బెస్ట్ కావడం గమనార్హం. బుమ్రా ఇప్పటివరకూ తొమ్మిది సార్లు ఐదు వికెట్ల ఘనతలు నమోదు చేశాడు. బుమ్రా 33 టెస్ట్‌ల్లో 20.82 సగటున 146 వికెట్లు పడొట్టాడు.
ఆ యార్కర్ను మర్చిపోతామా
ఓలి పోప్ గత మ్యాచ్‌లో కొంచెంలో డబుల్ సెంచరీ అవకాశాన్ని చేజార్చుకున్నాడు. రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లోనూ మంచి టచ్‌లో కనిపించి మరోసారి మంచి ఇన్నింగ్స్ ఆడేలా కనిపించాడు. 23 పరుగులు చేసి ఇంగ్లాండ్‌ను కాపాడేలా కనిపించిన పోప్‌ను.. బుమ్రా సూపర్ యార్కర్‌తో బౌల్డ్ చేశాడు. బుమ్రా సంధించిన యార్కర్‌కు పోప్ దగ్గర సమాధానమే లేకుండా పోయింది. క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ యార్కర్లలో ఒకటిగా ఇది నిలిచిపోతుందనడంలో సందేహం లేదు. అనంతరం 47 పరుగుల వద్ద ఇంగ్లాండ్ సారధి స్టోక్స్‌ను బుమ్రా క్లీన్ బౌల్డ్ చేశాడు. అద్భుతమైన బంతితో స్టోక్స్‌ను బౌల్డ్ చేశాడు. ఈ బంతిని అసలు ఎలా ఆడాలి అన్నట్లు బ్యాట్ కిందపడేసి స్టోక్స్ నిరాశ వ్యక్తం చేశాడు. చివరిగా అండర్సన్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకుని ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌కు బుమ్రా ముగింపు పలికాడు.