జమదగ్ని మహర్షి ఆలయం.. ఈ ఊర్లో మనుషుల్నే కాదు రాయి రప్పను కూడా ముట్టుకోవడం నిషిద్ధం!
Jamadagni Maharshi Templ: జమదగ్ని మహర్షి ఆలయం ఉన్న ఈ ఊళ్ళో మనుషుల్నే కాదు రాయి రప్పను కూడా ముట్టుకోవడం నిషిద్ధం...ఎందుకు? ఎక్కడుందా ఊరు? పూర్తి వివరాలు తెలుసుకుందాం

amadagni Rishi Temple in the Malana Village: భారతదేశం అనేక సంప్రదాయాలకు పురాతన ఆలయాలకు నిలయం. అలాంటి వాటిలో ఒకటి జమదగ్ని మహర్షి ఆలయం. హిమాచల్ ప్రదేశ్ లో ఉన్న ఈ ఆలయం ఒక చిన్న గ్రామం లో ఉంది. ఆ ఊరిలో ప్రవేశించే ఎవరూ.. ఆ గ్రామస్తులను కానీ అక్కడి వస్తువులను కానీ తాకకూడదనే విచిత్రమైన నియమాన్ని వాళ్ళు తరతరాలు గా పాటిస్తున్నారు.

పరుశురాముడి తండ్రి-జమదగ్ని మహర్షి
భారతీయ పురాణాల ప్రకారం జమదగ్ని మహర్షి ని సప్తర్షుల్లో ఒకరిగా చెబుతారు. పరుశురాముడికి కన్నతండ్రి. ఆయనను భారత దేశంలోని ఒక గ్రామం మొత్తం తమ రక్షకుడి గా భావిస్తుంది.

హిమాచల్ ప్రదేశ్ లోని "మలానా" గ్రామ రక్షకుడు జమదగ్ని
హిమాచల్ ప్రదేశ్ లోని మంచు ప్రాంతాల మధ్యలో "మలానా " అనే గ్రామం ఉంది. ఇక్కడ జమదగ్ని మహర్షికి ఒక ఆలయం ఉంది. ఇక్కడ ఆయనను " జములు రిషి "(jamlu rishi ) పేరుతో పిలుస్తారు. తమ గ్రామ రక్షకుడు, దేవుడి గా "జమదగ్ని " మహర్షి ని ఇక్కడ కొలుస్తూ ఉంటారు. అయితే ఆ గ్రామ ప్రజలు ఒక నిబంధన ను పక్కాగా పాటిస్తారు. బయటి వాళ్లు ఎవరినీ తాకరు. తమను ముట్టుకోనివ్వరు. మనుషుల్నే కాదు ఆలయ ప్రాంగణంలో ఏ వస్తువుని కూడా బయటి వాళ్ళని తాకనివ్వరు. అలా చేస్తే " జమదగ్ని మహర్షి" తమను శిక్షిస్తాడు అనేది వాళ్ళ నమ్మకం. అలాగని బయటి వాళ్ళ పట్ల వాళ్ళు ఏమీ కఠినం గా వ్యవహరించరు. ఊళ్ళో తిరగొచ్చు ఆలయ దర్శనం చేసుకోవచ్చు. కానీ ఎవరినీ తాకకూడదు. పొరబాటున తాకితే మాత్రం 3500 రూపాయల వరకూ జరిమానా కట్టాల్సిందే. లేదంటే వెంటనే తమ ఊరు వదిలి వెళ్ళిపోవాల్సిందేనని పంపేస్తారు. ఆ ఊరు వాళ్ళ వేషధారణ, పద్ధతులు బయటకు విచిత్రం గా కనిపిస్తాయి. అయినప్పటికీ తరతరాలుగా వీటినే అనుసరిస్తామని ఊరు వాళ్ళు చెబుతారు.
అత్యంత పురాతనమైనదిగా ప్రజాస్వామ్య వ్యవస్థ
మలానా గురించి అత్యంత అద్భుతమైన విషయాల్లో ఒకటి అక్కడున్న పాలనా వ్యవస్థ. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైనదిగా చెప్పే ప్రజాస్వామ్య వ్యవస్థ ఇక్కడుంటుంది. వారికి రెండు సభలతో కూడిన పార్లమెంటు వెర్షన్ ఉంది: ఎగువ సభ పేరు జైస్తాంగ్ , దిగువ సభ పేరు కనిష్టాంగ్ . వివాదాలు నిర్ణయాలు మొదట ఈ సభల ద్వారా పరిష్కరించుకునేందుకు ప్రయత్నిస్తారు. అక్కడ పరిష్కారం దొరక్కపోతే జమదగ్ని మహర్షివైపు చూస్తారు. జమదగ్ని మహర్షి ఇవ్వబోయే తీర్పును స్వయంగా ఇక్కడున్న ఆలయంలో గుర్ అని పిలిచే పూజారి ఇస్తారు. ఇప్పటికీ మలానా వాసులు ఇదే పద్ధతి అనుసరిస్తున్నారు.

ఎలా వెళ్ళాలి?
హిమాచల్ ప్రదేశ్ లోని మనాలి నుండి కాసోల్ వెళ్లే దారిలో ఈ "మలానా " గ్రామం ఉంటుంది. కాసోల్ నుంచి 9కిమీ దూరం లో ఉండే ఈ గ్రామం వెళ్ళాలి అంటే కాస్త దూరం కొండలపై ట్రెక్ చెయ్యాల్సి ఉంటుంది. అద్భుతమైన ప్రకృతి దృశ్యాల నడుమ ఉండే ఈ "మలానా " గ్రామం ఈ మధ్య టూరిజం పరంగా పాపులర్ అవుతోంది.





















