Shravana Masam 2024: శ్రావణ శుక్రవారం అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలివే - లలితా సహస్రంలో ఉన్న వివరాలివి!
Shravana Masam 2024: లలితా సహస్ర నామంలో ఎన్నో సాధనా రహస్యాలతో పాటూ అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన నైవేద్యాల గురించి కూడా వివరించి ఉంది. అవేంటో తెలుసుకుందాం...
Shravana Masam Nivedana 2024: శ్రావణమాసం ప్రారంభమైంది..తెలుగు లోగిళ్లలో పండుగ కళ ఉట్టిపడుతోంది. సాధారణంగా శుక్రవారం అంటే అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తారు. శ్రావణశుక్రవారం అంటే అంతకుమించిన భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీదేవిని ఆరాధిస్తారు. అయితే నైవేద్యాల విషయంలో ఎప్పుడు ఏం సమర్పించాలి అనే ఆలోచన వస్తుంది. కేవలం శ్రావణమాసంలో శుక్రవారాలు మాత్రమే కాదు...ఏ శుక్రవారం అయినా, అమ్మవారి పూజ చేసే సందర్భం ఏదైనా కానీ కొన్ని పదార్థాలు నివేదిస్తే అమ్మకు సంతోషం...ఈ విషయాలు నేరుగా లలితాసహస్రంలోనే ఉన్నాయి..
గుడాన్నప్రీతి మానసా
గుడము అంటే బెల్లం.. నిత్యపూజలో భాగంగా కూడా బెల్లం నివేదిస్తే ఆ ఇంటి సభ్యులంతా ఆరోగ్యంగా ఉంటారని పండితులు చెబుతారు. అలాంటి బెల్లంతో చేసిన అన్నం అంటే అమ్మవారికి ప్రీతి. బెల్లానికి నిలువ, అంటు దోషం లేదు...అందుకే కుదిరితే బెల్లంతో చేసిన పరమాన్నం లేదంటే బెల్లంముక్క నివేదించినా చాలు
స్నిగ్ధౌదన ప్రియా
స్నిగ్ధ అంటే తెల్లని, ఓదనం అంటే అన్నం...తెల్లటి అన్నాన్ని ఇష్టపడే తల్లి అని అర్థం. అయితే ఇక్కడ తెల్లటి అంటే స్వచ్ఛమైన కొబ్బరి అన్నం అని అర్థం.
Also Read: 2024 శ్రావణమాసంలో శుభముహూర్తాలివే.. ఇప్పుడు కూడా టైమ్ తక్కువే ఉంది త్వరపడండి!
పాయసాన్నప్రియా
పాలు - బియ్యం కలపి వండిన వంట అంటే అమ్మవారికి ప్రీతికరం.దీనినే క్షీరాన్నం అంటారు..
మధుప్రీతా
మధు అంటే తేనె ...ప్రీతి అంటే ఇష్టం...తేనె లాంటి తియ్యటి పదార్థాలు ఇష్టపడడం అని ఆంతర్యం. శుక్రవారం రోజు అమ్మవారికి గారెలు చేసి తేనెలో ముంచి నివేదిస్తారు
దద్ధ్యన్నాసక్త హృదయా
దధి అంటే పెరుగు...అన్నం అంటే బియ్యంతో వండినది...ఆసక్త అంటే ఇష్టాన్ని చూపేది...హృదయా అంటే మనసు కలిగినది. పెరుగుతో తయారు చేసిన పదార్థంపై ఆసక్తిచూపే హృదయం కల అమ్మ అని అర్థం.
ముద్గౌదనాసక్త హృదయా
ముద్గ అంటే పెసలు..ఓదనం అంటే అన్నం..ఆసక్త అంటే అభిరుచి...పెసలతో వండిన అన్నమంటే ఇష్టం. పెసరపప్పు నానబెట్టి కాస్త బెల్లం వేసి నివేదించవచ్చు...లేదంటే పెసరపప్పు పాయసాన్ని అమ్మకు నైవేద్యంగా సమర్పించవచ్చు.
హరిద్రాన్నైక రసికా
పసుపు - అన్నం...మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే పులిహోర. హరిద్రం అంటే పసుపు....అమ్మవారికి పులిహోర నివేదించి దానిని ప్రసాదంగా స్వీకరించి అందరకీ పంచిపెడితే మీకు ఇంట్లో అన్నీ శుభాలే జరుగుతాయి.
సర్వౌదనప్రీతచిత్తా (కదంబం)
సర్వోదనప్రీత అంటే...అన్ని రకాల అన్నాన్ని ఇష్టపడేది అని అర్థం. భక్తి శ్రద్ధలతో వండిపెట్టిన అన్నం , కూరగాయలు ఏవైనా అమ్మవారికి ప్రీతికరమే. దానినే కదంబం అంటారు.
Also Read: శ్రావణమాసంలో అమ్మవారి పూజ చేస్తున్నారా.. ఈ తప్పులు పొరపాటున కూడా చేయకండి!
కదంబం ఇలా తయారు చేయాలి
అన్ని రకాల కూరగాయలు శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేయాలి. బియ్యం, కందిపప్పు కడిగిన తర్వాత..వాటితోపాటూ తరిగిన కూరగాయల ముక్కలు వేసి పసుపు, ఉప్పు జోడించి ఉడికించాలి. ఆ తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగ పప్పు, మినప్పప్పు, ఎండు మిర్చి, ఇంగువ పోపు వేసి... పచ్చిమిర్చి , కరివేపాకు, టమోటా వేయాలి. ఆ తర్వాత చింతపండు గుజ్జు, బెల్లంపొడి వేసి ఉడికించాలి. సాంబారు పొడివేసి కొద్దిసేపు ఉడికించిన తర్వాత.. దానిలో బియ్యం, కందిపప్పు మిశ్రమాన్ని జోడించి కాసేపు స్టౌపై ఉంచి... కొత్తిమీర, కొబ్బరి తురుము వేసి కలిపి దించేయాలి. నేతిని జోడించి అమ్మవారికి నివేదించాలి.
మీ శక్తి కొలది అమ్మవారికి ఏం నివేదించినా...భక్తిశ్రద్ధలు ప్రధానం అని గుర్తుంచుకోవాలి. వండే ఆహారంలో భక్తికలగలిపినప్పుడే అది నైవేద్యంగా మారుతుంది...
Also Read: స్వస్తిక్ గీసేటప్పుడు ఈ తప్పులు చేయకండి.. హిట్లర్ పతకానికి కారణం అదేనా!
శ్రీమాత్రేనమః