Friendship Day 2023: త్రేతాయుగంలో ఉత్తమ స్నేహితులు!
ఏటా ఆగష్టు మొదటి ఆదివారంలో స్నేహితుల దినోత్సవం (Friendship Day) జరుపుకుంటారు. ఈ సందర్భంగా యుగయుగాలుగా ఆదర్శంగా నిలిచిపోయిన స్నేహితుల గురించి ఏబీపీ దేశం ప్రత్యేక కథనం.
Happy Friendship Day 2023: మిత్రుడు అంటే సూర్యభగవానుడు. సర్వజగత్తుకూ వెలుగులు పంచేవాడు, చైతన్యప్రదాత. అందుకే స్నేహితుణ్ని మిత్రుడన్నారు. దుర్మార్గమైన పనుల నుంచి నివారించే వ్యక్తి, సత్కార్యాలు చేయడానికి ప్రోత్సాహాన్నిచ్చేవాడు, రహస్యాలను కాపాడేవాడు, సద్గుణాలను కలిగి ఉండేవాడు, ఆపత్కాలంలో నీడలా అనుసరించివచ్చేవాడే నిజమైన మిత్రుడు. స్నేహితులు చాలామంది ఉండొచ్చు కానీ అందరూ నిజమైన స్నేహితులు కాలేరు. ఒక వ్యక్తి సౌశీల్యం తను పాటించే మిత్రధర్మాన్ని బట్టి నిర్ణయించవచ్చు. ఐశ్వర్యం, విద్య, పదవిని దృష్టిలో పెట్టుకుని స్నేహం చేయకూడదు. అలాంటి వారెందరో పురాణ ఇతిహాసాల్లో ఉన్నారు. త్రేతాయుగంలో ఉత్తమ స్నేహితులెవరో చూద్దాం..
రామకథలో వాల్మీకి మహర్షి.. స్నేహితుడి గొప్పదనాన్ని, మైత్రీప్రాశస్త్యాన్ని రాముడి ద్వారా లోకానికి వివరించాడు. రామాయణంలో గుహుడు, సుగ్రీవుడు, విభీషణుడు రాముడికి ఆప్తమిత్రులుగా కనిపిస్తారు. రాముడు చక్రవర్తి అయినప్పటికీ గిరిజనుడైన గుహునితో, వానరుడైన సుగ్రీవునితో, రాక్షసుడైన విభీషణుడితో స్నేహం చేసి మైత్రీధర్మానికి స్థాయీభేదాలు లేవని ప్రపంచానికి చాటిచెప్పాడు.
Also Read: మంచి స్నేహితుడికి ఉండాల్సిన లక్షణాల గురించి చాణక్యుడు ఏం చెప్పాడంటే!
శ్రీరాముడు-గుహుడు
అరణ్య వాసానికి వెళ్లిన రాముడు గంగానది ఒడ్డున చాలాసేపు ఎదురు చూడవలసి వచ్చింది. వృత్తి రీత్యా వేటగాడైన గుహుడు సరయు నది పరిసర ప్రాంతాల అటవీ ప్రాంతానికి రాజుగా ఉండేవాడు. గుహుడికి ఇక్ష్వాకు వంశస్థులంటే ఎనలేని ప్రేమ. రాముడు ఆ వంశానికి ప్రతినిథి. గుహుడు కూడా సామాన్యుడేం కాదు నిషాధ తెగకి రాజు. అధికారం, పరపతి, ప్రతిష్ఠ కలవాడే. కానీ రాముడు తన రాజ్యంలోకి అడుగు పెట్టాడని తెలియగానే గుహుడి ఆనందానికి అవధులు లేవు. సంతోషంతో గంతులు వేస్తూ రాముని స్వాగతించడానికి వెళ్ళాడు. రామ లక్ష్మణులిద్దరూ తనకు అభివాదం చెయ్యడానికి లేవగానే గుహుడు మౌనంగా ఉండిపోయాడు. గుహుడి ఆలోచన అర్థం చేసుకున్న రామచంద్రుడు ప్రేమగా గుండెలకు హత్తుకుని... లక్ష్మణుడికి తన మిత్రుడిగా, నిషాధ రాజ్యానికి రాజుగా పరిచయం చేశాడే తప్ప ఒక వేటగాడు అని పరిచయం చేయలేదు.
శ్రీరాముడు-సుగ్రీవుడు
శ్రీరాముడికి ఉత్తమ స్నేహితుడు సుగ్రీవుడు. కష్టాల్లో సహకారం అందించేవాడు నిజమైన మిత్రుడని వీరిద్దరూ చాటారు. ఇద్దరూ భార్యావియోగాన్ని అనుభవించినవారే. సుగ్రీవుని భార్య రుమను వాలి తన అధీనంలోకి తీసుకుంటే..సీతాదేవిని రావణుడు అపహరించాడు. రామ, సుగ్రీవుల మైత్రీబంధమే రుమ, సీతల విముక్తికి కారణమైంది.
రాముడు-విభీషణుడు
శత్రువు సోదరుడైనా సరే అధర్మాన్ని ఎదిరించి వచ్చినందుకు విభీషణుడితో రాముడు స్నేహం చేశాడు. ‘మిత్రభావేన సంప్రాప్తం న త్యజేయం కథంచన’
మిత్రభావంతో వచ్చినవానిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలనన్నాడు శ్రీరాముడు.
ధనత్యాగ సుఖత్యాగో దేహత్యాగో పి వా పునః
వయస్యార్థే ప్రవర్తన్తే స్నేహం దృష్ట్వా తథావిధమ్
నిజమైన స్నేహానికి ధనాన్నైనా, శరీర సుఖాన్నైనా, చివరకు దేహాన్నైనా త్యాగం చేయాల్సిందే తప్ప స్నేహాన్ని వదలరాదని దీని భావం
Also Read: చాణక్య నీతి - ఇలాంటి లక్షణాలు ఉన్న ముగ్గురితో స్నేహం ప్రమాదకరం - మీ దోస్తులు ఇలాగే ఉన్నారా?
దశరథుడు-జటాయువు
రామాయణంలో ఉత్తమ స్నేహితులలో దశరథుడు-జటాయువుది అత్యుత్తమ స్థానం. స్నేహానికి కాలపరిమితి ఉండదని చాటిన స్నేహం వీరిది. స్నేహం కేవలం ఆ స్నేహితుడి వరకే పరిమితం అయిపోకూడదు. స్నేహితుడి కుటుంబంలో ఎవరికి కష్టం వచ్చినా అండగా ఉండాలి. మిత్రుడిని ఎంతగా ప్రేమిస్తామో తన కుటుంబ సభ్యులకూ అంతే ప్రేమనందిచాలి. శ్రీరాముడి తండ్రి దశరథ మహారాజు, జటాయువు ప్రాణ స్నేహితులు. యుద్ధాల్లో ఒకరికొకరు తోడుగా నిలిచారు. దశరథుడు మరణించిన తర్వాత అతడి కుమారుడైన రాముడినీ జటాయువు స్నేహితుడిగానే చూశాడు. వనవాసానికి వచ్చిన రాముడికి తనను తాను పరిచయం చేసుకున్నాడు. నా మిత్రుడిలాగే నిన్నూ కాపాడతానని మాట ఇచ్చాడు. ఇచ్చిన మాట ప్రకారం రావణుడు సీతను అపహరిస్తున్నప్పుడు ప్రాణాలకు తెగించి పోరాటం చేశాడు. రెక్కలు తెగిపడిపోయినా రాముడు వచ్చేవరకు ప్రాణాలు బిగపట్టి నిలుపుకున్నాడు. సీతమ్మ వివరాలు చెప్పిన తర్వాతే ప్రాణం విడిచాడు.
స్నేహమంటే త్యాగం. స్నేహమంటే మిత్రుడిని కాపాడేందుకు ప్రాణాన్ని సైతం ఫణంగా పెట్టడం. ఏబీపీ దేశం తరపున హ్యాపీ ఫ్రెండ్షిప్ డే...