Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
Hyderabad News: హైదరాబాద్లోని అల్లు అర్జున్ ఇంటి వద్ద ఓయూ జేఏసీ ఆందోళనతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆదివారం సాయంత్రం విద్యార్థులు బన్నీ ఇంటిని ముట్టడించి రాళ్లు రువ్వారు.
OU JAC Attack On Allu Arjun House: హైదరాబాద్లోని (Hyderabad) ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ఇంటిని ఓయూ జేఏసీ నాయకులు ముట్టడించారు. ఇంటి గోడలు ఎక్కి రాళ్లు విసిరారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి కుటుంబాన్ని ఆదుకోవాలని నినాదాలు చేశారు. ఇంటి లోపలికి వెళ్లేందుకు యత్నించగా అక్కడి సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రాళ్లు తగిలి ఇంటి ఆవరణలోని పూల కుండీలు ధ్వంసమయ్యాయి. రేవతి చావుకు అల్లు అర్జునే కారణమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి రూ.కోటి పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. బన్నీ ఇంటి ముందు బైఠాయించి నిరసన తెలిపారు. ఈ క్రమంలో కొందరు ఇంట్లోకి దూసుకెళ్లేందుకు యత్నించగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ఆందోళనకారులను అరెస్ట్ చేశారు. కాగా, నిరసన సమయంలో అల్లు అర్జున్ కుటుంబ సభ్యులెవరూ బయట కనిపించలేదు. విద్యార్థి సంఘాల ఆందోళనతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బన్నీ ఇంటి వద్ద భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.