Ganesh Chaturthi 2022 :విఘ్నాధిపతిగా గణపతినే ఎందుకు పూజించాలి, వినాయక చవితి ప్రత్యేకత ఏంటి!
Vinayaka Chavithi 2022: ఆగస్టు 31 బుధవారం వినాయకచవితి. ఈ సందర్భంగా విభిన్న కథనాలు అందిస్తోంది మీ ఏబీపీ దేశం. ఇందులో భాగంగా విఘ్నాధిపతిగా వినాయకుడినే ఎందుకు పూజించాలో తెలుసుకుందాం...
![Ganesh Chaturthi 2022 :విఘ్నాధిపతిగా గణపతినే ఎందుకు పూజించాలి, వినాయక చవితి ప్రత్యేకత ఏంటి! Ganesh Chaturthi 2022 Know Date History Significance, Interesting Facts About Lord Ganesha Ganesh Chaturthi 2022 :విఘ్నాధిపతిగా గణపతినే ఎందుకు పూజించాలి, వినాయక చవితి ప్రత్యేకత ఏంటి!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/26/fbc5f224b5dc34c97781f0105ae4d1ff1661453327688217_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Vinayaka Chavithi 2022
"శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే"
భారతదేశంలోని అతి ముఖ్యమైన హిందువుల పర్వదినం "వినాయక చవితి". శివపార్వతుల కుమారుడైన గణనాథుడి జన్మదినాన్ని పురస్కరించుకుని "వినాయక చవితి" జరుపుకుంటారు. ఈ పండుగ భాద్రపద మాసంలో నాలుగో రోజు..అంటే చవితి రోజు ప్రారంభమై..నవరాత్రులు వైభవంగా జరుగుతుంది. వినాయకచవితి రోజు ప్రతిఇంట్లో బొజ్జగణపయ్య సందడి ఉంటే.. మండపాల్లో మాత్రం దాదాపు 11 రోజుల పాటూ లంబోదరుడు పూజలందుకుని.. ఆ తర్వాత ఊరేగింపుగా గంగమ్మ ఒడికి చేరుకుంటాడు. భారత దేశం లో ని వివిధ ప్రాంతాల్లో ఈ పండుగని "గణేష్ చతుర్ధి" లేదా "వినాయక చతుర్ధి" అని కూడా పిలుస్తారు.
విఘ్నాధిపతి
ఏ పని మొదలుపెట్టాలన్నా, అనుకున్న పని ఫలప్రదం కావాలన్నా ముందుగా విఘ్నాధిపతి అయిన వినాయకుడిని వేడుకుంటారు. విఘ్నాలు అంటే ఆటంకాలు...ఆటంకాలు లేకుండా తలపెట్టిన పని పూర్తయ్యేలా చేయమని గణపతిని వేడుకుంటారు. అందుకే విఘ్నవినాశకుడు అయిన వినాయక చవితికి ఎంతో విశిష్టత ఉంది. ఈ పండుగ వెనుక ఆసక్తికరమైన గాధలున్నాయి.
గణేష జననం
ఓసారి కైలాస నాధుడు లేని సమయంలో పార్వతీ దేవి స్నానమాచరించదలచి తన ఇంటికి రక్షకునిగా ఎవరైనా ఉంటే బాగుండునని భావించింది. నలుగుతో గణేశుడిని మలచి ప్రాణం ద్వారపాలకునిగా ఉండమని ఆజ్ఞాపించి స్నానమాచరించేందుకు వెళ్లింది. అదే సమయంలో వచ్చిన శివుడిని లోనికి వెళ్లకుండా అడ్డుకుంటాడు వినాయకుడు. కోపోద్రిక్తుడైన పరమ శివుడు గణేశుని శిరస్సు ఖండిస్తాడు. ఇంతలో బయటకు వచ్చిన పార్వతీదేవి..పుత్రశోకంలో కాళిగా మారుతుంది. పార్వతీ దేవి ఆగ్రహానికి భయపడిన దేవతలంతా పరమశివుడిని వేడుకొనగా ఉత్తరం వైపు తల పెట్టి నిద్రించే ప్రాణి తలను ఖండించి తీసుకురమ్మని అనుచరులకు ఆజ్ఞాపిస్తాడు.శివుని ఆజ్ఞననుసరించి వెళ్ళిన అనుచరులకు ఉత్తరం వైపు తల పెట్టి నిద్రిస్తున్న ఒక ఏనుగు కనిపిస్తుంది. వారు ఆ ఏనుగు శిరస్సు ఖండించి తీసుకువస్తే శివుడు ఆ శిరస్సును వినాయకుడి శరీరంపై అమరుస్తాడు. తన కొడుకు తిరిగి ప్రాణం పోసుకున్నందుకు పార్వతీ దేవి సంతోషిస్తుంది. ఏనుగు శిరస్సు ని ధరించినందువల్ల గజాననుడయ్యాడు.
Also Read: రంగులుమార్చే వినాయకుడిని దర్శించుకున్నారా! గుప్పెడు బియ్యం - కొబ్బరికాయ ముడుపుకడితే చాలు
మరొక గాధ ప్రకారం
గజాసురుడనే రాక్షసుని తపస్సుకి మెచ్చి ..తన కోరిక మేరకు ఉదరం( పొట్ట) లోనే ఉండిపోతాడు శివుడు. పతిని తీసుకురమ్మని శ్రీ మహావిష్ణువుని పంపిస్తుంది పార్వతీదేవి. అలా శ్రీ మహావిష్ణువు గంగిరెద్దుని ఆడించేవాని రూపంలో వెళ్లి గజాసురుని మెప్పించి..పరమేశ్వరుడిని తీసుకుని కైలాశానికి బయలుదేరుతాడు. ఆ గజాసురుడి తలే..వినాయకుడికి అమర్చారని మరో పురాణగాధ.
విఘ్నాధిపతిగా వినాయకుడే ఎందుకు!
విఘ్నాధిపతిగా వినాయకుడికిని పూజించడం వెనుక ఓ పురాణ గాధ ఉంది. ఒకసారి దేవతలు, ఋషులు శివుడిని కలిసి విఘ్నాలకు అధిపతిగా ఎవరినైనా నియమించమని అడుగుతారు. అప్పుడు శివపార్వతుల రెండవ కుమారుడు అయిన కుమార స్వామి... వినాయకుడు పొట్టిగా, లావుగా ఉన్నందువల్ల తనని విఘ్నాధిపతిగా నియమించమని అడుగుతాడు. శివుడు వినాయకుడికి, కుమారస్వామికి ప్రపంచం లో ఉన్న పవిత్ర నదులలో స్నానమాచరించి ఎవరైతే ముందుగా తన దగ్గరికి వస్తారో వాళ్ళే విఘ్నాధిపతి అవుతారు అని చెప్తాడు. నెమలి వాహనంపై కుమారస్వామి పవిత్ర నదులలో స్నానమాచరించడానికి బయలుదేరతాడు. తన అవతారం చూసి కొంచెం కలత చెందిన వినాయకుడు తల్లిదండ్రుల వద్దకు వెళ్లి "తన సోదరుని వలే వేగంగా తాను కదలలేను కాబట్టి మీరే నాకు ఈ పరీక్ష నెగ్గేందుకు మార్గం తెలియచేయ"మని ప్రార్ధిస్తాడు.
Also Read: వినాయక చవితి పూజ ముహూర్తం వివరాలు, ఎలాంటి విగ్రహం కొనుగోలు చేయాలో తెలుసా!
నారాయణ మంత్రం జపిస్తూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణం చేస్తే అన్ని పవిత్ర నదులలో స్నానమాచరించిన ఫలితం దక్కుతుందని శివుడు ఉపదేశిస్తాడు. శివుడి ఉపదేశాన్ని గణపతి పాటించడం వల్ల కుమారస్వామి స్నానమాచరించడానికి వెళ్ళిన ప్రతి నది వద్ద గణపతి అప్పటికే స్నానం ముగించి తిరిగి వస్తున్నట్టు కనిపిస్తాడు. కైలసానికి తిరిగి వచ్చిన కుమారస్వామి తన అజ్ఞానాన్ని మన్నించి గణపతినే విఘ్నాధిపతిగా చెయ్యమని తల్లితండ్రులను ప్రార్ధిస్తాడు. ఆ విధంగా వినాయకుడు విఘ్న నాయకుడు అయ్యాడు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)