Vinayaka Chavithi 2022: రంగులుమార్చే వినాయకుడిని దర్శించుకున్నారా! గుప్పెడు బియ్యం - కొబ్బరికాయ ముడుపుకడితే చాలు
ఆగస్టు 31 బుధవారం వినాయకచవితి. ఈ సందర్భంగా విభిన్న కథనాలు అందిస్తోంది మీ ఏబీపీ దేశం. ఇందులో భాగంగా రంగులు మార్చే గణపయ్య గురించి మీకోసం...
వినాయకుడి శ్లోకం
వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ
నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా
విఘ్నాలను తొలగించి శుభాలను కలిగించే దైవ స్వరూపంగా గణేషుడిని కొలుస్తారు. ఏ పూజ చేసినా ముందుగా పసుపుతో తయారు చేసిన గణపయ్యని ఆరాధిస్తాం. ఆలయాల విషయానికొస్తే కాణిపాకం మొదలు ఎన్నో వినాయక ఆలయాలున్నాయ్. అయితే తమిళనాడు నాగర్ కోయిల్ జిల్లా కేరళపురంలో ఉన్న పార్వతీతనయుడి ఆలయం మాత్రం ప్రత్యేకం. శ్రీ మహాదేవర్ అతిశయ వినాయగర్ ఆలయం
రంగులు మార్చే గణపయ్య
ఈ ఆలయం చూడడానికి చిన్నదే అయినా...చాలా విశిష్టతలున్న ఆలయం. అందుకు కారణం ఈ ఆలయంలోని మూలవిరాట్టు అయిన గణపయ్య ఆరు నెలలకోసారి తన రంగు తానే మార్చుకోవడం. ఉత్తరాయణ కాలం అంటే మార్చి నుంచి జూన్ వరకూ నల్ల రంగులో…. దక్షిణాయన కాలం…అంటే జూలై నుంచి ఫిబ్రవరి వరకూ తెల్లని రంగులో ఉంటాడు. ఈ విధంగా రంగులు మార్చుకోవడం ఈ వినాయకుని మాహాత్మ్యం అని భక్తుల విశ్వాసం.
Also Read: వినాయక చవితి పూజ ముహూర్తం వివరాలు, ఎలాంటి విగ్రహం కొనుగోలు చేయాలో తెలుసా!
రంగులు మారే నీళ్లు
అతిశయ వినాయగర్ ఆలయంలో మరో విచిత్రం కూడా వుంది. ఈ ఆలయం ఆవరణలో ఓ మంచినీటి బావి వుంది. నీటికి రంగు లేదు అన్న విషయం మనందరికీ తెలుసు. కానీ మిగిలిన చోట్ల మాటేమో కానీ ఇక్కడ నీటికి కూడా రంగులు మారుతాయ్. స్వామివారు రంగులు మార్చుకున్నట్టే బావిలో నీళ్లు కూడా రంగులు మారుతాయి. అయితే స్వామివారి రంగులకు..బావిలో నీళ్ల రంగులు వ్యతిరేకంగా ఉంటాయి. అంటే వినాయకుడు నల్లగా ఉంటే బావిలో నీళ్లు తెల్లగా ఉంటాయి. వినాయకుడు తెల్లగా ఉన్న సమయంలో.. ఈ బావిలో నీళ్లు నల్లగా ఉంటాయి.
ఎన్నో అద్భుతాలు
ఇక్కడున్న మరో విచిత్రం ఏంటంటే…సాధారణంగా శిశిర ఋతువులో చెట్ల ఆకులు రాలడం ప్రకృతి సహజం. కానీ, దట్టమైన అడవుల కారణంగా తమిళ, కేరళారణ్య ప్రాంతాలకు ఈ ఋతు భేదం వర్తించదు. అవి ఎప్పుడూ సతతహరితాలే. కానీ, ఈ ఆలయంలో ఉన్న మర్రిచెట్టు మాత్రం దక్షిణాయనంలో ఆకులు రాల్చి, ఉత్తరాయణంలో చిగురించడం ప్రారంభిస్తుంది. అందుకే ఈ ఆలయాన్ని మిరాకిల్ వినాయకర్ ఆలయం అని కూడా పిలుస్తారు.
Also Read: ఏ దేవుడికి ఏం నివేదించాలి… అసలు నైవేద్యం ఎందుకు సమర్పించాలంటే.!
చారిత్రక ప్రాశస్త్యం
ఈ ఆలయానికున్న చారిత్రక ప్రాశస్త్యం గురించి భక్తులు ఏం చెబుతారంటే..ఇది 12వ శతాబ్ద కాలం నాటిదని, 1317 సంవత్సరంలో నిర్మించారని.. 2300 సంవత్సరాల చరిత్ర ఉందంటారు.ఆ రోజుల్లో కేరళ పురం రాజు తీర్థయాత్రలకోసం రామేశ్వరం వెళ్లాడు. అక్కడ తన పరివారంతో కలసి దక్షిణ సముద్రంలో స్నానం చేస్తున్న సమయంలో, ఆయనకు ఒక వినాయక విగ్రహం కనిపించింది. ఆ విగ్రహాన్ని రామేశ్వరం రాజుగారికి అప్పగించబోతే.. దొరికిన వారికే ఆ విగ్రహం చెందడం ధర్మం అని భావించి, రామేశ్వరం రాజు ఆ విగ్రహాన్ని కేరళ పురం రాజుకే ఇస్తూ, మరొక మరకత(పచ్చల) గణపతిని కూడా బహూకరించాడు. కేరళపురం రాజుగారు ఆ రెండు విగ్రహాలనూ తన రాజ్యం తీసుకుని వచ్చి ప్రతిష్ఠించాడు. అయితే తురుష్కుల దండయాత్రలో ఆ మరకత గణపతిని ఎత్తుకెళ్లిపోయారు. స్వామివారి ప్రతిష్టాపన కూడా ఆగమ శాస్త్రానుసారం జరగలేదు. ఒక రాతిపీఠంపై అతి సాధారణంగా ఈ వినాయక విగ్రహాన్ని పెట్టేశారు. అయినప్పటికీ ఇంత ప్రఖ్యాతి చెందిందంటే అందుకు కారణం స్వామివారి మహిమే అంటారు. భక్తులు కొబ్బరికాయ కానీ, బియ్యపు మూట కానీ ముడుపుగా చెల్లిస్తే వారి కోరిక తప్పకుండా నెరవేరుతుందని భక్తుల విశ్వాసం.
నిజానికిది శివాలయం. ఈ ఆలయ ప్రాకార ప్రాంగణంలో ముందు శివాలయం ఉంది. ఆ తర్వాతే ఈ ఆలయం నిర్మించారు. అందుకే ఈ ఆలయాన్ని శ్రీ మహాదేవర్ అతిశయ వినాయగర్ ఆలయం అని అంటారు. అప్పట్లో ఈ ఆలయం మీద వైష్ణవుల ఆధిపత్యం ఎక్కువగా ఉండడం వల్ల ఎన్నోసార్లు పునర్మించారు. కేరళ ప్రభుత్వం ఆధిపత్యం కూడా ఎక్కువగా ఉండేదట. ఆ తర్వాత రాష్ట్రాలు విడిపోయినప్పుడు తమిళనాడు పరిధిలోకి రావడంతో రంగులుమారే లంబోదర ఆలయం అభివృద్ధి చెందిందని చెబుతారు.