Vijayawada News: వైసీపీ వైపు జలీల్ ఖాన్ చూపు- దిద్దుబాటు చర్యల్లో టీడీపీ
Vijayawada News: విజయవాడ టీడీపీలో మరో అలజడి రేగింది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం టికెట్ ఆశిస్తున్న జలీల్‌ఖాన్ పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్టు స్పష్టమైంది.
Vijayawada News: విజయవాడ టీడీపీకి మరో షాక్ తగిలేలా కనిపిస్తోంది. ఆ పార్టీ సీనియర్ లీడర్ జలీల్‌ఖాన్ పార్టీ వీడేందుకు సిద్ధమైనట్టు సమాచారం. ఈ మేరకు వైసీపీ లీడర్లతో కూడా ఆయన చర్చలు జరిపిన ఫొటోలు బయటకు వచ్చాయి. టీడీపీ ఫ్లెక్సీలను జలీల్‌ఖాన్ తొలగించడం చర్చనీయాంశమైంది. విజయవాడ పశ్చిమ టికెట్ ఆశిస్తున్న జలీల్‌ఖాన్ వైసీపీ లీడర్లతో చర్చలు జరిపారు. రాత్రి ఆయన ఇంటికి వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డి వెళ్లి మాట్లాడారు. అనంతరం జలీల్‌ఖాన్ టీడీపీ బ్యానర్లు తొలగించారు.
విషయం తెలుసుకున్న టీడీపీ అప్రమత్తమమైంది. దిద్దుబాటు చర్యలలో భాగంగా కేశినేని చిన్నిని రంగంలోకి దించింది టిడిపి అధిష్ఠానం. ఇందులో భాగంగా రాత్రి 10 గంటలకు జలీల్ ఖాన్ నివాసంలో జలీల్ ఖాన్‌తో భేటీ అయ్యారు. కేశినేని చిన్నితోపాటు ముస్లిం నేతలు కూడా జలీల్ ఖాన్ నివాసానికి చేరుకొని చర్చలు జరిపారు. ప్రస్తుతానికి వీళ్ల మంత్రాంగం ఫలించింది. తాత్కాలికంగా శాంతించిన జలీల్‌ఖాన్ రెండు రోజుల్లో చంద్రబాబు, లోకేష్‌ను కలవడానికి ఓకే చెప్పారు.
పొత్తుల్లో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ టికెట్‌ను జనసేనాకు ఇస్తారని ఎప్పటి నుంచో ఊహాగానాలు నడుస్తున్నాయి. దీంతో తనకు టికెట్ రాదని తేల్చుకున్న జలీల్‌ఖాన్ పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. దీన్ని గ్రహించిన వైసీపీ ఆయన్ని పార్టీలోకి ఆహ్వానించింది. దీనికి విరుగుడుగా టీడీపీ కౌంటర్ చర్చలు జరిపింది.
ఇప్పటికి శాంతించిన జలీల్‌ఖాన్ చంద్రబాబు లోకేష్‌తో సమావేశమైన తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఆసక్తి మొదలైంది. జలీల్‌ఖాన్ మొదట కాంగ్రెస్‌లో ఉండే వారు. జగన్ పార్టీ పెట్టిన తర్వాత వైసీపీలోకి వెళ్లారు. 2014 ఎన్నికల తర్వాత పార్టీ మారారు. అధికారంలో ఉన్న టీడీపీలోకి వచ్చారు. 2019 ఎన్నికల్లో జలీల్‌ఖాన్ కుమార్తె పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇప్పుడు మరోసారి టికెట్ కోసం ట్రై చేస్తున్నారు. అయితే పొత్తుల్లో భాగంగా ఈ టికెట్ జనసేనకు ఇస్తారని ప్రచారం ఉంది.