Sharmila Politics : కాంగ్రెస్‌లో విలీనం తర్వాత షర్మిల రాజకీయం ఏపీలోనే - ఫైనల్‌గా నిర్ణయించుకున్నారా?
కాంగ్రెస్‌లో విలీనం తర్వాత షర్మిల ఏపీ రాజకీయాలపైనే దృష్టి పెడతారా ?జాతీయ పార్టీలో చేరి ఒక రాష్ట్రంలోనే రాజకీయం చేస్తామంటే అంగీకరిస్తారా ?అన్ని షరతులు అంగీకరించిన తర్వాతనే విలీన నిర్ణయం !
Sharmila Politics : వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల కాంగ్రెస్ లో తన పార్టీని విలీనం చేయడానికి నిర్ణయించుకున్నారు. జాతీయ పార్టీలో విలీనం చేసిన తర్వాత ప్రాంతీయ ప రాజకీయాల్లో ఉంటానని అనడం సాధ్యం కాదు. పార్టీ అప్పచెప్పిన పని చేయాల్సిందే. ఇదే విషయాన్ని షర్మిలకు కాంగ్రెస్ హైకమాండ్ తేల్చి చెప్పినట్లుగా తెలుస్తోంది. తెలంగాణ అనేది షర్మిల హోంగ్రౌండ్ కానే కాదని అక్కడ ఏ విధంగా చూసినా పొలిటికల్ ప్లస్ పాయింట్లు ఉండే అవకాశం లేదని హైకమాండ్ అన్ని మార్గాల ద్వారా షర్మిలకు స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో ఇంత కాలం డైలమాలో ఉన్న ఆమె.. చివరికి ఎక్కడైనా రాజకీయ భవిష్యత్ వెదుక్కోవాలని నిర్ణయించుకున్న తర్వాత అక్కడా ఇక్కడా అనే అభ్యంతరాలు ఎందుకని.. దైర్యంగా ముందుకే వెళ్లాలని నిర్ణయించుకున్నట్లుగా చెబుతున్నారు.
తెలంగాణలో షర్మిల పోటీ లేనట్లేనా ?
అయితే పాలేరు లేకపోతే సికింద్రాబాద్‌లో షర్మిల పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే తాజా సమాచారం ప్రకారం తాజాగా వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసినా పోటీ చేయడం కష్టమేనన్న అభిప్రాయం వినిపిస్తోంది. తన పార్టీని విలీనం చేసినందుకు ఆమెకు రాజ్యసభ సీట్ ఆఫర్ చేసినట్లు సమాచారం. ఐతే.. పార్టీ విలీనం తర్వాత షర్మిల ఏపీలో కాంగ్రెస్ బాధ్యతలు తీసుకోవాలని హస్తం హైకమాండ్ కండీషన్ పెట్టినట్లు చెబుతున్నారు. షర్మిల పార్టీకి తెలంగాణలో ఇంకా క్షేత్ర స్థాయిలో బలం లేదు. మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసినా కనీస మైలేజీ రాలేదు. చివరికి పాలేరులోనూ ఆమెకు కనీస ఆదరణ దక్కలేదు.
ఏపీ రాజకీయాల్లో అయితే కీలక పాత్ర పోషించే అవకాశం
ఆమె పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తే మాత్రం ఆ ప్రభావం ఏపీ రాజకీయాల్లో ఉంటుందని భావిస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ నుంచే సీఎం అయ్యారు. కానీ ఆయన ఓటు బ్యాంకును ఇటు ఏపీలో కానీ.. అటు తెలంగాణలో కానీ కాంగ్రెస్ పార్టీ వినియోగించుకోలేక పోయింది. రాజన్న తమ వాడు అని చెప్పుకోలేకపోయింది. ఆయన కొడుకు జగన్ పార్టీ పెట్టడంతో ఏపీలో కాంగ్రెస్ సీనియర్ లీడర్స్ అందరూ జగన్ వైపు చూడగా.. తెలంగాణలోని కాంగ్రెస్ నాయకులు అటు రాజశేఖర్‌రెడ్డిని తమ వాడు అని వాడుకోలేక నాయకత్వ లేమితో ఇబ్బందిపడ్డారు. రాజన్న బిడ్డగా షర్మిలకు పార్టీ బాధ్యతలు అప్పగిస్తే.. పోయిన ఓటు బ్యాంకును తిరిగి సంపాదించుకోవచ్చని హస్తం అధిష్టానం ఆలోచిస్తోంది. మరోవైపు జగన్‌పై పోరాటానికి షర్మిలనే అస్త్రంగా వాడుకోవాలని డిసైడైంది.
షర్మిల అన్నింటికి సిద్ధపడితే ఏపీ రాజకీయాల్లో కీలక మార్పులు
కాంగ్రెస్ లో చేరి అన్నను సైతం డీ కొట్టాలని నిర్ణయించుకుంటే ఏపీ రాజకీయాల్లో కీలక మార్పులు వస్తాయి. ఇప్పటివరకూ విజయమ్మ మద్దతు కూడా షర్మిలకే ఉండడం ఆమెకు కలిసొచ్చిన అంశమనే చెప్పాలి. కానీ తన బిడ్డలు చెరో రాష్ట్రంలో రాజకీయాలు చేస్తారని అంటున్నారు. ఒకరిపై ఒకరు పోటీ పడితే ఎవరికి మద్దతిస్తారో స్పష్టత లేదు. ఏపీలో కూడా విజయమ్మ కాంగ్రెస్ కే మద్దతు పలికితే జగన్ మోహన్ రెడ్డికి ఓ రకంగా షాకే. కానీ ఇటీవల సీఎం జగన్ .. విజయమ్మను మళ్లీ వైఎస్ఆర్‌సీపీ కార్యకలాపాల్లో పాల్గొనాలని ఆహ్వానిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.