Undavalli On KCR : రాజకీయాల నుంచి రిటైర్ అయ్యా - కేసీఆర్ దగ్గర పక్కా ప్లాన్ ఉందన్న ఉండవల్లి
భారత రాష్ట్ర సమితి గురించి కేసీఆర్‌తో జరిగిన భేటీలో ఎలాంటి చర్చ జరగలేదని ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రకటించారు. అయితే బీజేపీయేతర పార్టీలను లీడ్ చేయడానికి కేసీఆర్ వద్ద పక్కా ప్రణాళిక ఉందన్నారు.

Undavalli On KCR : భారతీయ రాష్ట్ర సమితి ఏపీ ఇంచార్జ్‌గా వ్యవహరిస్తారని వస్తున్న వార్తలను మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తోసిపుచ్చారు. తాను రాజకీయాల నుంచి రిటైరయ్యానన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ పది రోజుల కిందట తనకు ఫోన్ చేసి కలుద్దామన్నారని.. ఈ మేరకు తాను ఆదివారం ప్రగతి భవన్‌తో ఆయనతో సమావేశమయ్యానన్నారు. తమతో పాటు లంచ్ మీటింగ్‌లో ప్రశాంత్ కిషోర్ కూడా ఉన్నారన్నారు. అయితే చర్చలో ప్రశాంత్ కిషోర్ పాల్గొనలేదని.. కేసీఆర్‌కు క్లారిటీ ఉందన్నారు. కేసీఆర్ తనతో జాతీయ రాజకీయాపై కానీ.. భారత రాష్ట్ర సమితి విషయంపై కానీ చర్చించలేదని స్పష్టం చేశారు.
కేసీఆర్‌కు ఫుల్ క్లారిటీ ఉంది !
బీజేపీ విషయంలో కేసీఆర్ ఆలోచనలు.. తన ఆలోచనలు ఒకటేనని ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు. బీజేపీ వ్యతిరేకులపై దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తోందన్నారు. కేసీఆర్ కు అన్ని విషయాలపై స్పష్టత ఉందని ఆయన కరెక్ట్ లైన్‌లోనే వెళ్తున్నారని స్పష్టం చేశారు. దేశంలో ప్రతిపక్షం ఉండకూడదని బీజేపీ అనుకుంటోందని.. బీజేపీ విధానం వల్ల దేశానికి నష్టమన్నారు.బీజేపీ విధానాలు దేశానికి ప్రమాదకరమని.. బీజేపీకి ప్రత్యామ్నాయం అవసరమన్నారు. కాంగ్రెస్ బలహీనపడినట్లుగా అనిపిస్తోందన్నారు.
ఏపీలో బీజేపీ బలంగా ఉంది.!
.
ఏపీలో బీజేపీకి వ్యతిరేకంగా పోరాడే పార్టీనే లేదని స్పష్టం చేశారు. జగన్, పవన్, చంద్రబాబు కూడా బీజేపీకే మద్దతిస్తారన్నారు. ఏపీలో ఉన్న 25 పార్లమెంట్ సీట్లు బీజేపీవేనన్నారు. ఏ పార్టీ గెలిచినా బీజేపీ ఖాతాలోకే వెళ్లినట్లేనన్నారు. అందుకే దేశంలో ఎక్కడా లేనంత బలంగా ఏపీలో బీజేపీ ఉందని విమర్శనాత్మకంగా వివరించారు. ప్రధానమంత్రి మోదీ ఓ రాజులా పరిపాలిస్తున్నారన్నారు. వైసీపీకి ఉన్న బలంతో ఏపీకి కావాల్సినవి సాధించుకోవచ్చని.. కానీ జగన్ మాత్రం అలాంటి ప్రయత్నం చేయడం లేదన్నారు.
మమతా బెనర్జీ కన్నా కేసీఆర్ మంచి కమ్యూనికేటర్ !
బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని.. మోదీతో సమానంగా ఆయన కమ్యూనికేట్ చేయగలరన్నారు. మోదీకి వ్యతిరేకంగా విపక్షాలను ఏకం చేయగల సామర్థ్యం కేసీఆర్‌కు ఉందని ఉండవల్లి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆయన మంచి కమ్యూనికేటర్ అన్నారు. ఈ విషయంలో మమతా బెనర్జీ కన్నాకేసీఆరే బెటరన్నారు. కేసీఆర్ చెప్పిన విషయాలు విని తాను చాలా ఆశ్చర్యపోయానని ఉండవల్లి తెలిపారు. బీజేపీయేతర పార్టీలన్నింటినీ కేసీఆర్ లీడ్ చేయగలరని ఉండవల్లి స్పష్టం చేశారు. అయితే జాతీయ రాజకీయాల విషయంలో కేసీఆర్ దగ్గర ఉన్న వ్యూహం ఏమిటో తనకు తెలియదన్నారు.
కేసీఆర్ కరెక్ట్ రూట్‌లోనే వెళ్తున్నారు !
కేసీఆర్ దగ్గర మంచి కాన్సెప్ట్ ఉందని.. బీజేపీకి చెక్ పెట్టాలంటే విపక్షాలన్నీ ఏకం కావాలన్నారు. దేశంపై కేసీఆర్‌కు స్పష్టమైన అవగాహన ఉందన్నారు. నెహ్రూకు కేసీఆర్ పెద్ద ఫ్యాన్ అన్నారు. మూడు గంటల పాటు జరిగిన చర్చలో కేసీఆర్ చెప్పిన విషయాలు విని తాను ఆశ్చర్యపోయానన్నారు . పది రోజుల్లో మరోసారి కలుద్దామని చెప్పారని.. ఎప్పుడు పిలిచినా వస్తానని తాను హామీ ఇచ్చినట్లుగా ఉండవల్లి తెలిపారు. కేసీఆర్‌కు తనకన్నా ఎక్కువ తెలుసన్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

