BRS Leaders For Chandrababu : చంద్రబాబుకు తెలంగాణ బీఆర్ఎస్ నేతల సపోర్ట్ - జగన్ పై విమర్శలు ! రాజకీయం ఉందా ?
తెలంగాణ నేతలు చంద్రబాబు అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నారు. జగన్ తీరుపై మండిపడుతున్నారు.
BRS Leaders For Chandrababu : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై రాజకీయ కక్ష సాధింపులతోనే ఎన్నికలకు ముందు అరెస్ట్ చేశారని తెలుగుదేసం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. అనూహ్యంగా తెలంగాణలో బీఆర్ఎస్ నేతలు కూడా ఇదే వాదిస్తున్నారు. చంద్రబాబుకు మద్దతుగా ఎక్కువ మంది మాట్లాడుతున్నారు. టీడీపీలో ఉండి వచ్చిన వారు తమ వాయిస్‌ను బలంగా వినపిిస్తున్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి వంటి రాజ్యంగబద్ద పదవుల్లో ఉన్న వారు కూడా చంద్రబాబుది అక్రమ అరెస్టు అని నిర్మోహమాటంగా చెబుతున్నారు. చంద్రబాబుకు మద్దతు తెలుపుతున్నారు. జగన్ మోహన్ రెడ్డిపై విమర్శలు చేస్తున్నారు. కానీ అధికారికంగా బీఆర్ఎస్ హైకమాండ్ నుంచి మాత్రం ఈ అరెస్టుపై ఎలాంటి స్పందన లేదు.
చంద్రబాబుకు మద్దతుగా వాయిస్ పెంచుతున్న బీఆర్ఎస్ నేతలు
పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీ స్పీకర్. ఆయన కూడా చంద్రబాబు అరెస్ట్ కక్ష పూరితమని ఆరోపించారు. జగన్ మోహన్ రెడ్డి కక్ష సాధింపు పాలన చేస్తున్నారని విమర్శించారు. స్పీకర్ పోస్టులో ఉన్న వ్యక్తి ఇలాంటి విమర్శలు చేయడం కలకలం రేపింది. పైగా ఆయన భారత రాష్ట్ర సమితి కీలక నేత. అలాగే మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు కూడా జగన్ మోహన్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. ఆయన కూడా బీఆర్ఎస్‌లోనే ఉన్నారు. గత ఎన్నికల్లో చంద్రబాబుతో విబేధించి .. జగన్ మోహన్ రెడ్డికి మద్దతు గా ప్రచారం చేశారు. చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్‌కు చెందిన పలువురు నేతలు చంద్రబాబుకు మద్దతుగా ప్రకటనలు చేస్తున్నారు.
బీఆర్ఎస్ క్యాడర్ ర్యాలీలు
తెలంగాణలో చంద్రబాబుకు మద్దతుగా భారీ నిరసనలు జరుగుతున్నాయి. ఐటీ ఉద్యోగుల ప్రదర్శనలపై పోలీసులుఉక్కుపాదం మోపినప్పటికీ ఇతర చోట్ల జరుగుతున్న నిరసనలకు మాత్రం సహకరిస్తున్నారు. దీనికి కారణం వీటిని బీఆర్ఎస్ నేతలే ఆరెంజ్ చేస్తున్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి స్వయంగా ర్యాలీకి నాయకత్వం వహించారు. సుధీర్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎల్బీనగర్ నుంచి పోటీ చేయనున్నారు. మరో వైపు మల్లారెడ్డి లాంటి వారు కూడా చంద్రబాబుది అక్రమ అరెస్ట్ అని జగన్ రెడ్డి తన గొయ్యి తాను తవ్వుకున్నారని అంటున్నారు. మరో వైపు ఖమ్మం, నిజామాబాద్ , నల్లగొండ, కోదాడ, కొత్తగూడెం, హైదరాబాద్ కాలనీల్లో భారీ ర్యాలీలు జరుగుతున్నాయి. ఇక హైదరాబాద్‌లోని కుషాయిగూడ సహా చాలా కాలనీల్లో ప్రదర్శనలు జరుగుతున్నాయి. అపార్టుమెంట్లు వారీగా మాట్లాడుకుని చంద్రబాబుకు సంఘిభావం చెబుతున్నారు. అత్యధికంగా ఎవరి ప్రమేయం లేకుండానే సంఘిభావం చెబుతున్నారు.
చేయాలని కానీ.. వద్దని కానీ చెప్పని బీఆర్ఎస్ హైకమాండ్
బీఆర్ఎస్ పార్టీ నేతలంతా చంద్రబాబు అరెస్టు అక్రమం అని జగన్ మోహన్ రెడ్డిపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలాంటి ప్రకటనలపై బీఆర్ఎస్ హైకమాండ్ విధానపరంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఎమీ మాట్లాడవద్దని చెబితే మాట్లాడేవారు కాదు. సమర్థించాలని చెబితే.. అదే చేసేవారు. కానీ ఏమీ చెప్పకపోవడంతో.. బీఆర్ఎస్ నేతలు తమ అభిప్రాయాల్ని స్వేచ్చగా వెల్లడిస్తున్నారు. ఇలా చెబుతున్న వారంతా గతంలో టీడీపీలో పని చేసిన వారే. బీఆర్ఎస్ క్యాడర్ గతంలో ఎక్కువగా టీడీపీ కావడంతో… తమ అభిమానాన్ని అలా చాటుకుంటున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. బీఆర్ఎస్ అగ్రనేతలు ఇంత వరకూ స్పందించలేదు కానీ ద్వితీయ శ్రేణి నేతల ర్యాలీలకు అడ్డు చెప్పడం లేదు. అలాంటి చేయవద్దని అనడం లేదు.
టీడీపీ సానుభూతిపరుల ఓట్లు కూడా కారణమేనా ?
చంద్రబాబు అరెస్టును బీఆర్ఎస్ పార్టీతో పాటు ఇతర పార్టీలకు చెందిన వారు కూడా ఖండించారు. బండి సంజయ్, కిషన్ రెడ్డి.. చంద్రబాబును అరెస్ట్ చేసిన తీరు తప్పని స్పష్టం చేశారు. బండి సంజయ్ మరింత ఘాటుగా విమర్శలు గుప్పించారు. అలాగే కాంగ్రెస్ కు చెందిన మధుయాష్కీ, భట్టి విక్రమార్క కూడా ఖండించారు. దీనికి కారణం.. వారు తమ తమ నియోజకవర్గాల్లో ఉన్న టీడీపీ సానభూతిపరుల ఓట్ల కోసమేనన్న వాదన ఉంది. కారణం ఏదైనా.. ఏపీలో ప్రజలు కేసుల భయంతో బయటకు రావడం లేదు.. కానీ తెలంగాణలో ప్రజలు మాత్రం ర్యాలీలు నిర్వహిస్తున్నారు.