jaggareddy : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను - జగ్గారెడ్డి అస్త్ర సన్యాసం !
వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రకటించారు. కార్యకర్తకు టిక్కెట్ ఇప్పించి గెలిపిస్తానని అంటున్నారు.
jaggareddy : వివాదాలతో ఎప్పుడూ వార్తల్లో ఉండే సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కొంత కాలంగా సైలెంట్‌గా ఉన్నారు. ఇప్పుడు మళ్లీ హఠాత్తుగా కీలకమైన ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని ప్రకటించారు. తన స్థానంలో ఓ సామాన్య కార్యకర్తలకు చాన్సిస్తానని ప్రకటించారు. కార్యకర్తలు అంగీకరించకపోతే.. తన భార్య నిర్మలను పోటీకి పెడతాను కానీ తాను మాత్రం బరిలో ుండే ప్రశ్నే లేదని చెబుతున్నారు. మరి రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటారా అంటే అదేమీ లేదని.. మళ్లీ 2028 ఎన్నికల్లో తానే పోటీ చేస్తానని జగ్గారెడ్డి చెబుతున్నారు. ఈ ఒక్క సారికి మాత్రమే ఎన్నికలకు దూరంగా ఉండాలని అనుకుటున్నారు. దానికి కారణం ఏమిటో మాత్రం ఆయన అనుచరుల్లో కూడా క్లారిటీ లేకుండా పోయింది.
సంగారెడ్డి కాంగ్రెస్‌కు తిరుగులేని నేతగా ఉన్న జగ్గారెడ్డి
సంగారెడ్డి నుంచి మొదటి సారి టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన తర్వాత కాంగ్రెస్ తరపున ఎన్నికయ్యారు. సంగారెడ్డి ప్రజల్లో కలివిడిగా ఉండే నేతగా పేరుంది. అయితే ఆయన వివాదాస్పద వ్యవహారశైలి కారణంగా రాజకీయంగా విమర్శలు ఎదుర్కొంటూ ఉంటారు. కాంగ్రెస్ పార్టీలో ఇటీవలి కాలంలో రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా గొంతెత్తారు. చాలా సార్లు ఆయన టీఆర్ఎస్ లో చేరబోతున్నారన్న ప్రచారం జరిగింది. కానీ అలాంటిదేమీ లేదని.. తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని చెబుతూ వస్తున్నారు. పలుమార్లు తీవ్రమైన విమర్శలు చేసి.. హైకమాండ్ ఆగ్రహానికి గురయ్యారు. చివరికి పార్టీ పరంగా సైలెంట్‌గా ఉంటానని.. కేవలం నియోజకవరగానికే పరిమితమవుతానని ప్రకటించి.. సైలెంట్ అయ్యారు.
తన భార్యను పోటీ చేయించాలనే ఆలోచనతోనే ఈ ప్రకటన?
ఇప్పుడు హఠాత్తుగా సంగారెడ్డి నుంచి తాను పోటీ చేయడం లేదని ప్రకటించడంతో కాంగ్రెస్ వర్గాల్లోనూ జగ్గారెడ్డి వ్యవహారంపై చర్చ జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ అంశంపై పార్టీ హైకమాండ్ సర్వేలు నిర్వహిస్తోంది. సర్వేల్లో మంచి ఫలితాలు వచ్చిన వారికే టిక్కెట్ అని చెబుతున్నారు. ఈ క్రమంలో సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మార్చాలనుకుంటుందనే సమాచారం వచ్చి ఉంటుందని అందుకే ఇలాంటి ప్రకటన చేశారన్న అభిప్రాయం వినిపిస్తోంది. అయితే సంగారెడ్డిలో జగ్గారెడ్డి లాంటి నేత లేడని.. ఆయనకు పోటీగా.. నియోజకవర్గ స్థాయి నేత లేరని అంటున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీలో పలువురు బలమైన అభ్యర్థులు ఇతర నియోజకవర్గాల్లో పోటీ కోసం చూస్తున్నారు. వారిలో ఎవరైనా పోటీకి సిద్ధమయ్యే చాన్స్ ఉంది.
వరుస వివాదాలతో కొంత కాలంగా సైలెంట్‌గా ఉన్న జగ్గారెడ్డి
అయితే జగ్గారెడ్డి ఎన్నికల్లో పోటీ చేయను అనే ప్రకటన రాజకీయం మాత్రమేనని... ఆయన అనుచరులు కూడా అనుకుంటున్నారు. పార్టీ హైకమాండ్ మరో ఆలోచన లేకుండా తననే పోటీ చేయమని అడిగేలా చేయడమే ఈ వ్యూహమని అంటున్నారు. ఇటీవల జగ్గారెడ్డి కుటుంబ సభ్యులు కూడా రాజకీయాల్లో చురుకుగా తిరుగుతున్నారు. ఆయన భార్య నిర్మలా.. పలు కార్యక్రమాలకు హాజరవుతున్నారు. ఇప్పుడు ఆమెను ఎమ్మెల్యే చేయాలని జగ్గారెడ్డి అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. జగ్గారెడ్డి ప్రకటనపై కాంగ్రెస్ హైకమాండ్ ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.