Kaleshwaram Why CBI: కాళేశ్వరం ఆయుధం బీజేపీకిచ్చిన రేవంత్ - పక్కా వ్యూహమా? స్ట్రాటజిక్ మిస్టేకా ?
Kaleshwaram CBI investigation: కాళేశ్వరంలో జరిగిన అవకతవకల విషయంలో సీబీఐ దర్యాప్తు చేయించాలని రేవంత్ అసెంబ్లీలో నిర్ణయించారు. దీనికి కారణం ఏమిటన్నది రాజకీయవర్గాలకు అంతు చిక్కడం లేదు.

Why CBI investigation Kaleshwaram : రాజకీయాల్లో వ్యూహాత్మక నిర్ణయాలే కీలకం. రాజకీయ ప్రత్యర్థుల్ని కట్టడి చేసేందుకు చేతికి వచ్చే ఆయుధాలను ఎవరూ పక్క పార్టీలకు ఇవ్వరు. అందుకే చాలా కేసుల్లో దమ్ముంటే విచారణ సీబీఐకి ఇవ్వాలన్న డిమాండ్లు వినిపిస్తూ ఉంటాయి. ఎందుకు ఆ కేసులను సీబీఐ తీసుకుని కోల్డ్ స్టోరేజీలో పడేయడానికా అన్న కౌంటర్లు వస్తూంటాయి. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటి వరకూ ఇదే రాజకీయం జరిగింది. అలాంటి రాజకీయం ప్రారంభం కాక ముందే కాళేశ్వరంపై విచారణను సీబీఐకి అప్పగిస్తూ సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా అసెంబ్లీలోనే నిర్ణయం తీసుకున్నారు.
కాళేశ్వరం ను సీబీఐ టేకప్ చేస్తే బీఆర్ఎస్ బీజేపీ గుప్పిట్లోనే !
సీబీఐ సహా కేంద్ర దర్యాప్తు సంస్థలు బీజేపీ గుప్పిట్లో ఉన్నాయని.. వారు ఏం చెబితే ఆ దర్యాప్తు అవి చేస్తాయనేది కాంగ్రెస్ పార్టీ విధానం. రాహుల్ సహా ఎంతో మంది అలాంటి విమర్శలు చేశారు. అయితే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి అత్యంత తీవ్ర కేసుగా పరిగణిస్తున్న కాళేశ్వరంను సీబీఐకి అప్పగిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేశారు. కాళేశ్వరంలో తీవ్రమైన అవినీతి ఉందని లక్ష కోట్ల స్కాం అని చెబుతున్న కాంగ్రెస్ ఇందులో కీలకమైన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది. కానీ అ అవకాశాన్ని వదులుకుంది. బీజేపీ గుప్పిట్లో పెట్టేందుకు సిద్ధమయింది.
బీఆర్ఎస్ ను బీజేపీకి ఎరగా వేసే ప్లానా ?
రేవంత్ రెడ్డి రాజకీయాలను ఎవరూ తక్కువ అంచనా వేయలేరు. తెలంగాణలో ముఖాముఖి పోటీ ఉంటేనే కాంగ్రెస్ కు మేలు అని ఆయన భావిస్తున్నారు. అందుకే బీఆర్ఎస్ పార్టీని బీజేపీకి ఎరగా వేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నరాు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టులో నేరుగా కేసీఆరే తప్పు చేశారని వచ్చింది. ఇప్పుడు సీబీఐ విచారణ చేస్తే మొదటగా కేసీఆరే ఇబ్బంది పడతారు. తమ చేతికి మట్టి అంటకుండా రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని బీజేపీకి ఎరగా వేశారన్న అభిప్రాయాన్ని కొంత మంది వ్యక్తం చేస్తున్నారు.
ఒక్క నిర్ణయానికి రెండు ప్రయోజనాలు !?
రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం రెండు రకాలుగా ప్రయోజనాలు కల్పించనుంది. కేసీఆర్ ను జైలుకు పంపాలన్నది ఆయన పొలిటికల్ టార్గెట్లలో ఒకటి. కానీ ఆయన నేరుగా చర్యలు తీసుకోలేరు. ఏ కేసులో అరెస్టు చేసిన అది రాజకీయ కక్ష సాధింపుగా ప్రజల్లోకి వెళ్తుంది. అది బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ కు ప్లస్ అవుతుంది. కాంగ్రెస్ పార్టీకి మైనస్ అవుతుంది.అదే బీజేపీకి చాయిస్ ఇవ్వడం వల్ల .. చర్యలు తీసుకుంటే తనత టార్గెట్ ీచ్ అయినట్లుగా అవుతుంది. ఒక వేళ బీజేపీ ఎలాంటి చర్యలు తీసుకోకపోతే.. అది కూడా రేవంత్ రెడ్డికి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది. ఆ రెండు పార్టీలు కుమ్మక్కయ్యాయని..తాము సీబీఐకి ఇచ్చినా పట్టించుకోవడం లేదని.. ఆరోపించవచ్చు. అప్పుడు ఆ రెండు పార్టీలని ఒకే గాటన కట్టి.. తమ రాజకీయ ప్రయోజలను కాపాడుకోవచ్చు.
రేవంత్ రెడ్డి బహుముఖ వ్యూహంతోనే ఈ విషయాన్ని సీబీఐకి సిఫారసు చేశారని అర్థమవుతుంది. సీబీఐ విచారణ ప్రారంభమైన తర్వాతే చాలా అంశాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.





















