Mohammad Azharuddin As Minister: తెలంగాణ కేబినెట్‌లోకి మహ్మద్ అజారుద్దీన్ ? MLC అయితే మంత్రి పదవికి లైన్ క్లియర్
Telangana Politics: మాజీ క్రికెటర్, కాంగ్రెస్ నేత మహ్మద్ అజారుద్దీన్ త్వరలో తెలంగాణ మంత్రివర్గంలో చేరే అవకాశం ఉంది. MLC గా నామినేట్ కావడంతో ఆయనకు లైన్ క్లియర్ అయిందని రిపోర్టులు వస్తున్నాయి.

Mohammad Azharuddin As Mininister In Telangana | హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్, కాంగ్రెస్ నేత మహ్మద్ అజారుద్దీన్ తెలంగాణలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అవుతున్నారు. తెలంగాణ కేబినెట్ ప్రొఫెసర్ కోదండరాం, అజారుద్దీన్ పేర్లను గవర్నర్‌కు సిఫారసు చేసింది. గవర్నర్ కోటా కింద అజారుద్దీన్ ను శాసనమండలి (MLC)కి నామినేట్ చేయాలని నిర్ణయించడంతో మంత్రి పదవి ఖాయమని చర్చ ఊపందుకుంది. కొన్ని వారాల కిందట తాను జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తానని అజారుద్దీన్ ప్రకటించడంతో పార్టీ నేతలు సైతం ఆశ్చర్యపోయారు. ఆయనకు అవకాశం ఇవ్వాలని ఎమ్మెల్సీ చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం.
ఎమ్మెల్సీ పదవికి నామినేడ్ చేయడంపై హర్షం
2023 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓడిపోయిన తర్వాత ఆయన మరోసారి బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు. వాస్తవానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఈ సీటు ఖాళీ అయింది. దాంతో తాను మళ్లీ పోటీ చేస్తానని, అధిష్టానం తనకే సీటు ఇస్తుందని అజారుద్దీన్ పేర్కొన్నారు. ఢిల్లీకి వెళ్లి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను సైతం అజారుద్దీన్ కలిసి చర్చించడం కలిసొచ్చింది. ఎమ్మెల్సీ పదవికి నామినేట్ కావడంపై తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహ్మద్ అజారుద్దీన్ హర్షం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పెద్దలకు ధన్యవాదాలు తెలిపిన అజారుద్దీన్
అజారుద్దీన్ సోషల్ మీడియా ఎక్స్ లో ఇలా రాసుకొచ్చారు. "తెలంగాణలో గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీ పదవికి నామినేట్ చేయాలన్న కేబినెట్ నిర్ణయాన్ని నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. తనపై నమ్మకం ఉంచిన కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కె.సి. వేణుగోపాల్ లకు హృదయపూర్వక ధన్యవాదాలు" తెలిపారు. అదే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలకు కూడా ధన్యవాదాలు తెలిపారు. "నేను పార్టీకి నిజాయితీగా, అంకితభావంతో ప్రజలకు సేవ చేయడానికి కట్టుబడి ఉన్నాను" అని అజారుద్దీన్ రాసుకొచ్చారు.
Deeply honored and humbled by the Cabinet’s decision to nominate me for the MLC post under the Governor’s quota in Telangana.
— Mohammed Azharuddin (@azharflicks) August 31, 2025
My heartfelt thanks to Congress President Shri @kharge ji, Smt. Sonia Gandhi madam, Shri @RahulGandhi ji, Smt. @priyankagandhi ji, and Shri…
ఐఏఎన్ఎ స్ఓ నివేదికలో అజారుద్దీన్ ఎమ్మెల్సీగా నామినేట్ అవ్వడం ద్వారా రాష్ట్ర మంత్రివర్గంలో చేరేందుకు ఆయనకు మార్గం సుగమం అవుతుందని పేర్కొంది.
తెలంగాణలో ఎంతమంది మంత్రులు ఉన్నారు
ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి సహా 14 మంది మంత్రులు తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నారు. ఇంకా ముగ్గురికి మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంది. తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యే ముందు మహ్మద్ అజారుద్దీన్ ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ నుంచి ఎంపీగా (2009-2014) చేశారు. 2019లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ 27వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. కాగా, 62 ఏళ్ల మహ్మద్ అజారుద్దీన్ భారత్ తరఫున 99 టెస్టులు, 334 వన్డే మ్యాచ్‌లలో ప్రాతినిథ్యం వహించారు. ఆయన టెస్టుల్లో 6215 పరుగులు, వన్డేల్లో 9378 పరుగులు చేశారు.





















