BC Reservation Bills: బీసీ రిజర్వేషన్ బిల్లులకు తెలంగాణ శాసనమండలి ఆమోదం, అనంతరం నిరవధిక వాయిదా
Municipal and panchayat amendment act bills | బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించే పురపాలక, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లుకు తెలంగాణ శాసనమండలి ఆమోదం తెలిపింది.

Telangana Assembly sessions | హైదరాబాద్: తెలంగాణ శాసనసభలో ఆదివారం నాడు బీసీ రిజర్వేషన్ బిల్లులు ఆమోదం పొందగా.. శాసనమండలిలో సోమవారం ఉదయం బిల్లుపై చర్చ జరిగింది. ఓవైపు శాసనమండలిలో బీసీ రిజర్వేషన్ బిల్లులపై చర్చ జరుగుతుంటే, బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసును దర్యాప్తు చేయాలని సీబీఐకి అప్పగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. సభలో తీవ్ర ఉద్రిక్తతల మధ్యే పురపాలక, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లులతో పాటు పలు బిల్లులకు శాసనమండలి ఆమోదం తెలిపింది. అనంతరం చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలంగాణ శాసనమండలిని నిరవధికంగా వాయిదా వేశారు.
బీఆర్ఎస్ నినాదాలతో మండలిలో గందరగోళం..
బీఆర్ఎస్ సభ్యులు కాపీలు చించివేసి పోడియం వైపు విసిరడంతో సభలో గందరగోళం నెలకొంది. అధికార, విపక్షాల మధ్య వాడివేడిగా చర్చ జరగింది. తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం కేసును సీబీఐ దర్యాప్తునకు ఇవ్వడాన్ని బీఆర్ఎస్ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. గందరగోళ పరిస్థితుల మధ్యే తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ మున్సిపల్, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లులకు ఆమోదం తెలిపారు. పురపాలక, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లులు చట్టంగా మారితే మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు అవకాశం ఉంటుంది.
మండలి చైర్మన్ పోడియాన్ని ముట్టడించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జై తెలంగాణ నినాదాలతో సభను హోరెత్తించారు. కాళేశ్వరం నివేదిక పేజీలను చించి చైర్మన్ పోడియం వైపు విసిరి నిరసన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీకి సీబీఐ వద్దు, రేవంత్‌కు సీబీఐ ముద్దు అని నినదించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే.. రైతులకు సాగునీరు అందించినందుకు సీబీఐ కేసులా అని ప్రశ్నించారు. బడేభాయ్.. చోటేభాయ్ ఏక్ హై, కాళేశ్వరం రిపోర్ట్ ఫేక్ హై అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు నినాదాలు చేశారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ధర్నా
శాసనమండలి నిరవధిక వాయిదా పడిన తరువాత బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలు గన్‌పార్క్ వద్ద నిరసన చేపట్టారు. రాష్ట్రానికి మేలు చేసే కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ దర్యాప్తు వద్దని నల్లకండువాలతో నిరసన తెలిపారు. రైతులు మేలు చేసే లక్ష్యంతో కట్టిన ప్రాజెక్టుపై దుష్ప్రచారం చేయడం తగదని, వెంటనే సీబీఐ దర్యాప్తు నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.





















