Nellore Court Theft Politics : కొలంబియా తర్వాత నెల్లూరులోనే ! కోర్టు చోరీ ఘటనపై రాజకీయ కలకలం
నెల్లూరు కోర్టులో జరిగిన దొంగతనంపై విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. కోర్టులకే రక్షణ లేదని జగన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.
నెల్లూరు కోర్టులో దొంగతనం అంశం ఏపీలో రాజకీయ కలకలం రేపుతోంది. చోరీ అయిన కేసులోని సాక్ష్యాలు కొత్త మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి సంబంధించినవని తెలియడంతో విపక్ష పార్టీల నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. దొంగలు ఎక్కడైనా విలువైన వస్తువులు ఎత్తుకెళ్తారని ప్రత్యేకంగా గుర్తు పెట్టుకుని మరీ సాక్ష్యాలు తీసుకెళ్లడం ఏమిటన్న అనుమానాలు విపక్షాలు వ్యక్తం చేస్తున్నాయి. కాకాణిపై కేసును గతంలోనే వెనక్కితీసుకోవాలని ప్రభుత్వం ప్రయత్నించిందని కానీ సాధ్యం కాలేదని ఇప్పుడు దొంగతనం పేరుతో సాక్ష్యాలను మాయం చేశారని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు.
సీఎం జగన్ కు ధైర్యం ఉంటే రాజధానికి కమ్మరావతి అని పేరు పెట్టాలి : రేణుకా చౌదరి
ఇలాంటి ఘటన జరిగగడం న్యాయవ్యవస్థపై దాడి చేయడమేనని టీడీపీ నేత పయ్యావుల ఆరోపించారు. . ఇంతటి ప్రాధాన్యత ఉన్న ఈ కేసుకు సంబంధించిన పత్రాలు ఎత్తుకెళ్లి, మిగిలినవి కాలువలో పడేయడం వెనుక కచ్చితంగా కుట్ర దాగి ఉందని ఆరోపించారు. ఇలా కోర్టులో దొంగతనం జరగడం దేశంలోనే తొలిసారి అని.. ఇలాంటి వాటిని ఉపేక్షిస్తే నేరస్థులకు శిక్షలు పడడం ఎప్పటికీ జరగదన్నారు. కొలంబియాకు చెందిన మాఫియా డాన్ మాత్రమే ఇప్పటివరకు కోర్టుపై దాడి చేశాడని.. నెల్లూరులో జరిగిన ఘటన దాన్ని మరిపిస్తోందన్నారు. ఈ విషయాన్ని హైకోర్టు సుమోటోగా తీసుకుని విచారణ చేపట్టాలన్నారు.
మళ్లీ జగన్ క్విడ్ ప్రో కో - గేంబ్లింగ్ చేస్తున్నారని ఉండవల్లి ఆరోపణలు !
వైసీపీ నేతలు న్యాయవ్యవస్థతో సైతం ఆడుకుంటున్నారని మండిపడ్డారు. జగన్ పాలనలో కోర్టులకూ రక్షణ లేదని నారా లోకేష్ విమర్శించారు.
.@ysjagan అరాచక పాలనలో న్యాయస్థానాలకు కూడా రక్షణ లేకుండా పోయింది. న్యాయ వ్యవస్థని కించపర్చారు, జడ్జీలను బెదిరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కోర్టులో దొంగతనానికి పాల్పడి ఆధారాలను సైతం కొట్టేస్తున్నారు వైకాపన్లు.(1/4) pic.twitter.com/v1HSHfPmtA
— Lokesh Nara (@naralokesh) April 15, 2022
కోర్టులోనే దొంగతనం జరగడం అంటే పూర్తిగా శాంతిభద్రతలు ఫెయిలయినట్లేనని.. ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. కేసు విచారణలో పోలీసులు ఎలాంటి ముందడుగు వేయలేకపోయారు. కోర్టు ఆవరణలో సీసీటీవీ కెమెరాలు లేకపోవడంతో.. సమీపంలోని ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. కొత్తగా మంత్రి అయిన కాకాణికి సంబంధించిన కేసులో కీలక పత్రాలు కావడంతో చోరీ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.