Andhra Pradesh సీఎం జగన్ ఆదేశాల మేరకే ఆ పని చేస్తున్నా- ఎంపీ విజయసాయిరెడ్డి
Andhra News in Telugu: ఈనెల 10వతేదీన బాపట్ల జిల్లా మేదరమెట్లలో వైసీపీ సిద్ధం సభ జరగాల్సి ఉంది. ఆ సభలో సీఎం జగన్ వైసీపీ మేనిఫెస్టో విడుదల చేస్తారని ప్రకటించారు విజయసాయిరెడ్డి.
Vijayasai Reddy Nellore News: 2022లో రెండోసారి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు విజయసాయిరెడ్డి. ఆయన పదవీకాలం 2028 వరకు ఉంది. అయినా కూడా ఈసారి నెల్లూరు నుంచి లోక్ సభకు ఆయన పోటీ చేయబోతున్నారు. వైసీపీ తరపున నెల్లూరు అభ్యర్థి (YSRCP Nellore Candidate)గా బరిలో నిలిచారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం, నెల్లూరునుంచి పోటీ చేయడం అంతా జగన్ (AP CM YS Jagan) ఆదేశాలేనని చెబుతున్నారు విజయసాయిరెడ్డి. జగన్ ఆదేశం మేరకే తాను నెల్లూరు వచ్చానన్నారు.
ప్రత్యక్ష రాజకీయాల్లోకి విజయసాయిరెడ్డి
వైసీపీలో కీలక నేతగా ఎదిగినా కూడా విజయసాయిరెడ్డి ఎప్పుడూ ప్రత్యక్ష రాజకీయాల జోలికి వెళ్లలేదు. ఆ మాటకొస్తే ఆయన సొంత జిల్లా నెల్లూరులో కూడా పెద్దగా రాజకీయం చేయలేదు. రాష్ట్ర రాజకీయాలకే పరిమితం అయ్యారు, రాజ్యసభ సభ్యుడిగా ఢిల్లీలోనే వ్యవహారాలు చక్కబెట్టేవారు. సడన్ గా ఆయన మళ్లీ రాష్ట్ర రాజకీయాల్లో బిజీ కావాల్సిన సందర్భం వచ్చింది. అందులోనూ నెల్లూరులో పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయన నెల్లూరు ఎంపీగా పోటీ చేయబోతున్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీ తరపున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తుండటంతో అందరి దృష్టీ నెల్లూరుపైనే ఉంది.
ఇద్దరు రాజ్యసభ సభ్యులు అనుకోని పరిస్థితుల్లో రెండు పార్టీల తరపున లోక్ సభ అభ్యర్థులుగా బరిలో నిలుస్తున్నారు. ఇద్దరూ ఖర్చుకు వెనకాడేవారు కాదు. ఒకరికి టీడీపీ అండ ఉంటే, ఇంకొకరికి వైసీపీ బలం ఉంది. విజయసాయిరెడ్డి రానంత వరకు నెల్లూరులో వేమిరెడ్డి విజియం ఖాయమనుకుంటున్న సందర్భం. అయితే విజయసాయిరెడ్డిని వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడంతో పోరు రసవత్తరంగా సాగే అవకాశముందని తేలిపోయింది. జగన్ అప్పగించిన ఈ బాధ్యతను విజయసాయి ఏమేరకు సమర్థంగా నిర్వహించగలరు అనేది ఇప్పుడు తేలిపోతుంది.
నెల్లూరులో తన కార్యాలయం ప్రారంభం సందర్భంగా రాష్ట్ర రాజకీయాలపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు విజయసాయిరెడ్డి. నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇప్పటికే వైసీపీ అభ్యర్థులను ఖరారు చేసినట్టు చెప్పారు విజయసాయిరెడ్డి. తాను పుట్టి పెరిగిన గడ్డపై పోటీ చేయడం సంతోషంగా ఉందని అంటున్న ఆయన నెల్లూరు ఎంపీగా గెలిచి ఇక్కడి ప్రజలకు సేవ చేస్తానని పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా మీద తనకు పూర్తి అవగాహన ఉందని విజయసాయిరెడ్డి చెప్పారు. రాజ్యసభ సభ్యుడిగా ఉంటూ జిల్లాను అభివృద్ధి చేశానని, ఇప్పుడు లోక్ సభ సభ్యుడిగా తన బాధ్యత నెరవేరుస్తానని స్పష్టం చేశారు విజయసాయిరెడ్డి.
మేనిఫెస్టోపై కీలక వ్యాఖ్యలు..
ఈనెల 10వతేదీన బాపట్ల జిల్లా మేదరమెట్లలో వైసీపీ సిద్ధం సభ జరగాల్సి ఉంది. ఆ సభలో సీఎం జగన్ వైసీపీ మేనిఫెస్టో విడుదల చేస్తారని ప్రకటించారు విజయసాయిరెడ్డి. ఈ మేనిఫెస్టో ప్రకటన తర్వాత సార్వత్రిక ఎన్నికల సమరశంఖం పూరిస్తామంటున్నారాయన. ఇక ప్రశాంత్ కిషోర్ ఇటీవల చేసిన వ్యాఖ్యల్ని కూడా విజయసాయి ఖండించారు. ఆయన వ్యాఖ్యల వెనక దురుద్దేశం ఉందన్నారు. ఏపీని ఎవరు అభివృద్ధి చేశారో ప్రజలకు తెలుసంటున్నారు విజయసాయిరెడ్డి. మరోసారి సీఎం జగన్ కు ప్రజలు పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లాలో పార్టీ పటిష్టంగా ఉందని, వీపీఆర్ పార్టీ మారినా ఆయనతో తనకు స్నేహం అలాగే ఉందని చెప్పారు విజయసాయిరెడ్డి.