Raghurama : పరిటాల రవి తరహాలో హత్యకు కుట్ర - సైబరాబాద్ సీపీ సహకరిస్తున్నారని రఘురామ సంచలన ఆరోపణలు !
తన హత్యకు కుట్ర చేస్తున్నారని ఎంపీ రఘురామకృష్ణరాజు ఆరోపించారు. ఈ కుట్రలో సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర భాగమయ్యారని ఆయన చెబుతున్నారు.
Raghurama : సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్రపై ఎంపీ రఘురామకృష్ణరాజు సంచలన ఆరోపణలు చేశారు. ఆయన ఏపీ ప్రభుత్వం కోసం పని చేస్తున్నారని ఆధారాలతో సహా సీఎం కేసీఆర్‌కు లేఖ రాస్తున్నట్లుగా ప్రకటించారు. రఘురామకృష్ణరాజు నివాసం ఉండే గచ్చిబౌలి ప్రాంతం సైబరాకిందకే వస్తుంది. తన కదలికలను ఆయన తెలుసుకోవడంతో పాటు ఏపీ ఇంటలిజెన్స్ పోలీసులకు సహకారం అందిస్తున్నారని తన హత్యకు కుట్ర పన్నేవారికి సాయం చేస్తున్నారని రఘురామ ఆరోపిస్తున్నారు. పరిటాల రవీంద్రను చంపింది పోలీసులేనని.. మొద్దు శీనుకు తుపాకీ పట్టుకోవడం కూడా రాదని స్పష్టం చేశారు. తనపై కూడా అలాంటి కుట్రే చేశారన్నారు. అందుకే తన ఇంటిపై నిఘా పెట్టారని.. బయట పడే సరికి కట్టు కథలు అల్లుతున్నారని విమర్శించారు.
తనపై కుట్రకు స్టీఫెన్ జగన్ సర్కార్ కోసం పని చేస్తున్నారని రఘురామ ఆరోపణ
సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రపై కేసు పెడుతున్నానని రఘురామ ప్రకటించారు. ఆయనపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఫిబ్రవరిలో తనను అరెస్ట్ చేసిన కుట్రలో స్టీఫెన్ రవీంద్ర హస్తం ఉందని రఘురామ ఆరోపిస్తున్నారు. నర్సాపురం ఎక్స్ ప్రెస్‌లో తాను తన నియోజకవర్గానికి వస్తున్న సమయంలో ట్రైన్ బోగీని తగలబెట్టాలని జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేశారని రఘురామ ఆరోపించారు. అదే బోగిలో వస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని దిగిపొమ్మని జగనే చెప్పారని రఘురామ వివరించారు.
జగన్ పట్టించుకోవడంలేదనే విజయసాయి తనపై రెచ్చిపోతున్నారన్న రఘురామ
తనపై విజయసాయిరెడ్డి చేస్తున్న విమర్శలపైనా స్పందించారు. తాను మద్యం తాగుతానని.. వైఎస్ రాజశేఖర్ రెడ్డితో కలిసి చాలా సార్లు తాగానన్నారు. తాను వైఎస్ లాగే రెండు పెగ్గులే తాగుతానన్నారు. అయితే ఏంటని ప్రశ్నించారు. తానేంటో అందరికీ తెలుసని.. జగనన్నకు ప్రజలందరూ కలిసి పెట్టిన పేరు జలగనన్న అని రఘురామ తెలిపారు. చంపేసి..పక్క వాళ్పై తోసేది మీరేనని.. కోడికత్తి డ్రామాలు ఆడింది ఎవరని రఘురామ ప్రశ్నించారు. విజయసాయిరెడ్డిని కనీసం ప్రధానమంత్రి హెలికాఫ్టర్ వద్దకూ కూడా తీసుకెళ్లలేదని...ఆ కడుపు మంటను తనపై తీర్చుకుంటున్నారని రఘురామ విమర్శించారు.
గిరిజన మహిళను రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టినా ఒక్కరూ మాట్లాడటం లేదు !
జగన్ , భారతిరెడ్డిని బ్లాక్ మెయిల్ చేసి విజయసాయిరెడ్డి పార్టీలో ప్రాధాన్యం దక్కించుకున్నారని రఘురామ చెప్పారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకల్లో ఒక్కరు కూడా గిరిజన రాష్ట్రపతి అభ్యర్థి గురించి ప్రస్తావించలేదన్నారు. ఇన్నేళ్ల తర్వాత భారత్‌కు గిరిజన రాష్ట్రపతి వస్తున్నారని ఈ పాయింట్‌ను ఎవరూ ప్రస్తావించలేదన్నారు. ఆమె గురించి మాట్లాడాలని ఒక్కరికీ అనిపించలేదన్నారు. ప్రధాని నిర్ణయాన్ని అందరూ అభినందించాల్సి ఉందన్నారు.