KTR: కాంగ్రెస్ గ్యారెంటీలపై ఖర్గే వ్యాఖ్యలు - కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
Telangana News: రాష్ట్ర బడ్జెట్‌ను మించి గ్యారెంటీలు ఇస్తే దివాళా తీసే స్థితి వస్తుందన్న ఖర్గే వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు. 6 గ్యారెంటీలతో వల వేసినప్పుడు తెలంగాణ బడ్జెట్ తెలియదా.? అని ప్రశ్నించారు.
KTR Reacts On AICC President Kharge Comments: బడ్జెట్ ఆధారంగా హామీలు ప్రకటించాలని.. లేదంటే రాష్ట్రం దివాళా తీసే పరిస్థితికి చేరుతుందన్న కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) స్పందించారు. తెలంగాణ ప్రజలను నయవంచన చేసినందుకు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కర్ణాటకలో 5 గ్యారెంటీలు ప్రకటించినప్పుడు మీకు ఆ రాష్ట్ర బడ్జెట్ గుర్తుకు రాలేదా.? అని ఖర్గేను ప్రశ్నించారు. బడ్జెట్ చూసుకోకుండా హామీలిస్తే రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం తప్పదని ఇప్పుడు మీకు బోధపడిందా.? అని నిలదీశారు. 'గాలిమాటల గ్యారంటీలిస్తే మొదటికే మోసం వస్తుందని ఇప్పుడు మీకు అర్థమైందా.?. 6 గ్యారెంటీలతో వల వేసినప్పుడు తెలంగాణ బడ్జెట్ గురించి మీకు తెలియదా.?. తెలంగాణలో కాంగ్రెస్ ఈ తప్పు చేస్తున్నప్పుడు ఈ విషయాలు మీకు ఎందుకు గుర్తు రాలేదు.?' అని ప్రశ్నలు సంధించారు.
గౌరనీయులైన ఖర్గే గారు..
— KTR (@KTRBRS) November 1, 2024
గాలిమాటల గ్యారెంటీలిస్తే..
మొదటికే మోసం వస్తుందని ఇప్పుడు అర్థమైందా..?
కర్ణాటకలో ఐదు గ్యారంటీలు ప్రకటించినప్పుడు ఆ రాష్ట్ర బడ్జెట్ గుర్తు రాలేదా?
బడ్జెట్ చూసుకోకుండా హామీలిస్తే..
రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం తప్పదని ఇప్పుడు బోధపడిందా..?
ఆరు గ్యారంటీలతో… https://t.co/XcHhFGnDkN
గ్యారెంటీల గారడీతో..
తెలంగాణలో కేవలం అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ ఆడిన గ్యారెంటీల గారడీతో రాష్ట్రం ఏడాదిలోనే ఆగమైందని కేటీఆర్ మండిపడ్డారు. పదేళ్ల పాటు ప్రగతి పథంలో పరుగులు పెట్టిన తెలంగాణను అడ్డగోలు హామీలతో ఆగం చేశారని అంగీకరించాలని అన్నారు. అనాలోచితంగా కాంగ్రెస్ ఇచ్చే గ్యారంటీలతో భవిష్యత్ తరాలకు కూడా నష్టం జరుగుతుందని ఇప్పటికైనా గుర్తించినందుకు సంతోషమని పేర్కొన్నారు. కాంగ్రెస్ గ్యారెంటీలను నమ్మిన పాపానికి ఏడాదిగా తెలంగాణకు జరిగిన నష్టం పూడ్చలేనిదని అన్నారు. గ్యారెంటీల పేరిట కాంగ్రెస్ చేసిన మోసం క్షమించలేనిదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా, త్వరలో జరగబోయే మహారాష్ట్ర ఎన్నికల్లో 5, 6, 7, 10 ఇలా ఏ ఒక్క హామీలను ప్రకటించడం లేదని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే అన్నారు. 'బడ్జెట్ ఆధారంగా హామీలు ప్రకటించాలి. లేదంటే రాష్ట్రం దివాళా తీసే పరిస్థితికి చేరుతుంది. ప్రణాళికా రహిత విధానం ఆర్థిక ఇబ్బందులకు దారి తీస్తుంది. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే.. భవిష్యత్ తరాలపై ప్రతికూల ప్రభావం పడుతుంది.' అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలకు స్పందిస్తూ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు.