(Source: ECI/ABP News/ABP Majha)
Telangana: పాదయాత్ర వేస్ట్! అమెరికా వెళ్లి బాత్రూంలు కడుక్కో - కేటీఆర్‌పై రఘునందన్ రావు ఘాటు వ్యాఖ్యలు
Raghunandan Rao News | రాజకీయాలు వదిలేస్తే వదిలెయ్, అమెరికా వెళ్లి బాత్రూంలు కడుక్కో ఎవరికి నష్టం లేదని మాజీ మంత్రి కేటీఆర్ పై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు.
BJP leader Raghunandan Rao satires on KTR Padayatra | సంగారెడ్డి: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు ఘాటుగా స్పందిస్తున్నారు. ముందుగా కేంద్ర మంత్రి బండి సంజయ్ అయితే పాదయాత్ర కాదు కేటీఆర్ మోకాళ్లతో యాత్ర చేసినా ప్రజలు నమ్మరని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి కనుక దమ్ముంటే ఆరు గ్యారంటీల అమలుపై మాట్లాడుతూ పాదయాత్ర చేస్తారా అని సవాల్ విసిరారు. మాజీ మంత్రి కేటీఆర్ పై మెదక్ ఎంపీ రఘునందన్ రావు సెటైర్లు వేశారు.
‘కేటీఆర్ రాజకీయాలు వదిలేయాలని ఉందన్నాడు. రాజకీయాలు చేయాలని ఎవరూ అడగలేదు. బంద్ చెయ్యి ఎవరు వద్దు అనలేదు. అలాగే అమెరికా వెళ్లి బాత్రూంలు కడుక్కో. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 ఏళ్లు కేటీఆర్ కు ప్రజలను కలిసే సమయం దొరకలేదు. ఎన్నికల్లో ఓడిన తరువాత మీ నాన్న కేసీఆర్ 10 నెలలుగా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లోనే ఉన్నారు. రాష్ట్రానికి, ప్రజలకు ఏమైనా నష్టం జరిగిందా? అని రఘునందన్ రావు ప్రశ్నించారు.
కేటీఆర్ అమెరికా నుంచి వచ్చింది డబ్బుల కోసం, అధికారం కోసం, ఫామ్ హౌస్ కోసం.. అంతేగానీ ప్రజల కోసం కాదన్నారు. మీకు కాంగ్రెస్ 10 నెలల పాలనే విసుగొస్తే పదేళ్లు రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ఎలా భరించారంటూ సెటైర్లు వేశారు. కేటీఆర్ పాదయాత్ర కాదు కదా, మోకాళ్ల యాత్ర చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. కేటీఆర్ కు తన నాన్న, చెల్లె, బావతో పాటు ఎవరిపై నమ్మకం లేదు. ఫామ్ హౌస్ కేసులో పాలు... నీళ్లు తేలాలంటే సీసీ ఫుటేజ్ బయట పెట్టాలని రఘనందన్ రావు డిమాండ్ చేశారు.
తెలంగాణలో ఆడవాళ్లు తాగుతారని కోరుట్ల ఎమ్మెల్యే అంటున్నాడు.. తెలంగాణలో ఎక్కడైనా ఆడవాళ్లు తాగుతారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ కీలక నేత మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దీపావళికి బాంబులు పేల్చుతామన్న వ్యాఖ్యలపై సైతం సెటైర్లు వేశారు. ఈ దీపావళికి మార్కెట్లలో కొన్న బాంబులు, బజార్లలో మాత్రం పేలాయి కానీ పొంగులేటి చెప్పిన బాంబులు పేలలేదన్నారు.
Also Read: BRS Chief KTR: బీఆర్ఎస్ తదుపరి సుప్రీం కేటీఆరేనా ? మరి హరీశ్ రావు పాత్ర ఏంటి?
రేవంత్, కేటీఆర్ లు కలిసి బహిరంగ సభ పెట్టండి - బండి సంజయ్
‘‘మూసీ పునరుజ్జీవంపైన సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తా అంటున్నాడు. ఇప్పుడేమో కేటీఆర్ కూడా పాదయాత్ర చేస్తాడట. మీ ఇద్దరూ చేయాల్సింది పాదయాత్ర కాదు. మోకాళ్ల యాత్ర.’’ అంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ 2 పార్టీలు ఒక్కటేనని ‘ఇద్దరూ కలిసి అటు నుండి ఒకరు ఇటు నుండి.. ఇంకొకరు పాదయాత్ర చేసుకోండి. ఆ తరువాత బహిరంగ సభ పెట్టి రాహుల్ గాంధీ, కేసీఆర్ లను ముఖ్య అతిథులుగా పిలుచుకోండి.’’అంటూ బండి సంజయ్ ఎద్దేవా చేశారు. మానకొండూరు నియోజకవర్గంలోని ఇల్లంతకుంట, బెజ్జంకి మండలాల్లో బండి సంజయ్ కార్యకర్తలు, స్థానిక బీజేపీలో మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి చేతనైతే.. మూసీపై పాదయాత్ర చేస్తానంటున్న రేవంత్ రెడ్డి 6 గ్యారంటీలపై పాదయాత్ర చేయాలని ఛాలెంజ్ విసిరారు.
6 గ్యారంటీల హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాటిని అమలు చేయకుండా మోసం చేస్తున్న విషయాన్ని కాంగ్రెస్ నేతలు పాదయాత్రలో చెప్పుకోవాలన్నారు. బీఆర్ఎస్ హయాంలో తాను పాదయాత్ర చేస్తే తనపై దాడి చేసింది ఆ పార్టీ గూండాలు కదా? అని బండి సంజయ్ ప్రశ్నించారు. రైతుల సమస్యలపై, నిరుద్యోగుల సమస్యలపై ఏనాడూ స్పందించలే.. ఏ ముఖం పెట్టుకుని పాదయాత్ర చేస్తారు? దేనికోసం చేస్తారని నిలదీశారు. తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షనేతగా ఉన్న కేసీఆర్ తన ఫాంహౌజ్ కే పరిమితమైండు. కుటుంబానికి ఆపదొస్తే తప్ప నోరువిప్పని నేత మనకు అవసరమా అన్నారు.