KCR Delhi Politics : వచ్చే వారం ఢిల్లీలో కేసీఆర్ జాతీయ రాజకీయాలు - కీలక భేటీలు ఉండే చాన్స్ !
తెలంగాణ సీఎం కేసీఆర్ వచ్చే వారం ఢిల్లీలో పర్యటించనున్నారు. కేసీఆర్ లేదా నితీష్ కుమార్‌ను రాష్ట్రపతి అభ్యర్థిగా విపక్షాలు ఖరారు చేస్తాయన్న ప్రచారం కారణంగా ఈ పర్యటన ఆసక్తికరంగా మారింది.
తెలంగాణ సీఎం కేసీఆర్ ( KCR ) ఢిల్లీ రాజకీయాలపై ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. ఎలాంటి బహిరంగసభలో మాట్లాడినా ఆయన ఎక్కువగా దేశం గురించి మాట్లాడుతున్నారు. దేశాన్ని బాగు చేయాల్సిన అవసరం ఉందంటున్నారు. బుధవారం మల్లన్నసాగర్ ( Mallanna Sagar ) ప్రారంభోత్సవ కార్యక్రమంలోనూ కేసీఆర్ దేశం గురించే ఎక్కువగా ఆవేదన చెందారు. చివరి రక్తపు బొట్టు వరకూ దేశం దేశాన్ని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తానన్నారు. ఇప్పటి వరకూ పలు రాష్ట్రాలను సందర్శించి బీజేపీ ( BJP ) వ్యతిరేక పక్షాలను కలిసిన కేసీఆర్ ఇప్పుడు ఢిల్లీలో కొద్ది రోజుల పాటు ఉండి ప్రాంతీయ పార్టీలను ఏక తాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నించాలని నిర్ణయించారు.
వచ్చే వారం కొద్ది రోజుల పాటు ఢిల్లీలోనే ఉండాలని కేసీఆర్ ( KCR To Delhi ) నిర్ణయించారు. తేదీ ఖరారు చేయకపోయినా ఇతర పరిస్థితులను బేరీజు వేసుకుని బుధవారం తర్వాత ఎప్పుడైనా ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉందని టీఆర్ఎస్ ( TRS ) వర్గాలు చెబుతున్నాయి. జాతీయ రాజకీయాల విషయంలో పలుమార్లు ఢిల్లీలో మేధావులతో సమావేశం అవుతానని.. రిటైర్ అయిన సివిల్ సర్వీస్ అధికారులతో మేధోమథనం జరుపుతానని ప్రకటించారు. వీటన్నింటినీ తన ఢిల్లీ పర్యటనలో పూర్తి చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఢిల్లీలో బీజేపీ వ్యతిరేక పార్టీలతోనూ సమావేశం అయ్యే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీతో ( Congress ) సన్నిహితంగా ఉంటున్న పార్టీలతోనే సమావేశం అవుతున్నారని.. బీజేపీ మిత్రపక్షాలతో కలవడం లేదని వస్తున్న విమర్శలకూ చెక్ పెట్టే అవకాశం ఉంది. బీజేపీ మిత్రపక్షంగా బీహార్ ప్రభుత్వాన్ని నడుపుతున్న జేడీయూ నేత నితీష్ కుమార్‌తోనూ కేసీఆర్ సమావేశమయ్యే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. అలాగే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌నూ కలిసే అవకాశం ఉంది. ఇతర ప్రాంతీయ పార్టీల నేతలు అందుబాటులో ఉంటే వారితోనూ సమావేశమై ఆలోచనలు పంచుకునే అవకాశం ఉంది.
మరో వైపు కేసీఆర్ లేదా నితీష్ కుమార్‌లలో ఒకరిని రాష్ట్రపతి అభ్యర్థిగా ( President Candidate ) ప్రాంతీయ పార్టీలు నిలబెడతాయని కాంగ్రెస్ పార్టీ మద్దతిస్తుందని రెండు రోజుల నుంచి విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. నిప్పు లేనిదే పొగ రాదు కాబట్టి ఈ అంశంపై ఏదైనా అంతర్గతంగా పరిణామాలు జరుగుతూ ఉంటే కేసీఆర్ ఢిల్లీ టూర్‌ను అత్యంత కీలకంగా చెప్పుకోవచ్చు. మొత్తంగా కేసీఆర్ జాతీయ రాజకీయాలు వచ్చే వారం ఢిల్లీ కేంద్రంగా జరగనున్నాయి.