KCR Governer : గవర్నర్ ప్రసంగం లేకుండానే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ! కేసీఆర్ నిర్ణయం వివాదాస్పదమవుతుందా ?
గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. ఇది రాజకీయ వివాదం అయ్యే సూచనలు ఉన్నాయి.
![KCR Governer : గవర్నర్ ప్రసంగం లేకుండానే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ! కేసీఆర్ నిర్ణయం వివాదాస్పదమవుతుందా ? KCR decided to hold budget meetings without the governor speech KCR Governer : గవర్నర్ ప్రసంగం లేకుండానే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ! కేసీఆర్ నిర్ణయం వివాదాస్పదమవుతుందా ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/28/f03a419f16041f53f5c833251a10ad73_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ ( Telangana Aseembly ) సమావేశాల్లో ఈ సారి గవర్నర్ ప్రసంగం ఉండటం లేదు. గవర్నర్ ప్రసంగం లేకుండానే సమావేశాలను నిర్వహించాలని సీఎం కేసీఆర్ ( CM KCR ) నిర్ణయించారు. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేశారు. సాధారణంగా బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే సమయంలో గవర్నర్ ( Governer ) ప్రసంగించడం సంప్రదాయంగా వస్తోంది. రాజ్యాంగపరంగా ఖచ్చితంగా గవర్నర్ ప్రసంగం ఉండాలన్న రూల్ లేదు కానీ అలా ఓ కంపల్సరీ సంప్రదాయంగా వస్తోంది. గవర్నర్‌తో ఎన్ని వివాదాలున్నా ప్రభుత్వాలు గవర్నర్ ప్రసంగాన్ని కొనసాగిస్తాయి. ఎందుకంటే గవర్నర్ సొంతప్రసంగం చదవరు. కేబినెట్ ఆమోదించిన ప్రసంగపాఠాన్నే చదువుతారు. అయినప్పటికీ ఈ సారి గవర్నర్ ప్రసంగానికి కేసీఆర్ విముఖతగా ఉన్నట్లుగా తెలుస్తోంది.
మార్చి ఏడో దేదీ నుండి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఆరో తేదీన మంత్రివర్గ ( Cabinet Meeting ) సమావేశం జరిపి బడ్జెట్‌కు ఆమోదం తెలుపనున్నారు. ఏడో తేదీనే అసెంబ్లీలో బడ్దెట్ ప్రవేశ పెట్టనున్నారు. సాధారణంగా తొలి రోజు గవర్నర్ ప్రసంగం ఉంటుంది. కానీ ఈ సారి గవర్నర్ ప్రసంగాన్ని వద్దనుకున్న కేసీఆర్ మొదటి రోజే ఆర్థిక మంత్రి హరీష్ రావు ( Harish Rao ) చేత బడ్జెట్ ప్రవేశ పెట్టాలని నిర్ణయించారు. కేంద్రంతో ఢీ అంటే ఢీ అంటున్న కేసీఆర్ గవర్నర్‌ను ఇటీవలి కాలంలో లెక్క చేయడం లేదు. గవర్నర్ వ్యవస్థ ఉనికిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రిపబ్లిక్ డే వేడుకల్లోనూ కేసీఆర్ పాల్గొనలేదు. మేడారం పర్యటనకు గవర్నర్‌కు హెలికాప్టర్ ఇవ్వకపోవడమే కాదు కనీసం ప్రోటోకాల్ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు అసెంబ్లీలో గవర్నర్ స్పీచ్‌నే స్కిప్ చేస్తున్నారు.
గవర్నర్‌తో తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవలి కాలం వరకూ సఖ్యతగానే ఉండేవారు. గవర్నర్ కూడా ప్రభుత్వానికి ( TS Governament ) వ్యతిరేకంగా ఎక్కడా పెద్దగా వ్యాఖ్యలు చేయలేదు. అయితే రాజ్ భవన్ ముందు ఫిర్యాదుల బాక్స్ పెట్టడం వంటి కారణాలు, కేంద్రంతో ఢి అంటే ఢీ అన్నట్లుగా పోరాడాలని డిసైడ్ చేసుకోవడంతో ఆయన గవర్నర్‌తో దూరం పాటిస్తున్నట్లుగా భావిస్తున్నారు. అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేంద్రానికి నివేదికలు పంపుతున్నారన్న అనుమానాలు కూడా కేసీఆర్‌కు ఉన్నాయని అందుకే.. గవర్నర్ విషయంలో కటువుగా వ్యవహరిస్తున్నారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకపోతే బీజేపీ విమర్శలు చేసే అవకాశం ఉంది. అయితే ఇది అసాధారణం.. రాజ్యాంగ వ్యతిరేకం ఏమీ కాదని టీఆర్ఎస్ వర్గాలు వాదించే అవకాశాలు ఉన్నాయి. గతంలో గవర్నర్ ప్రసంగం లేకుండానే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించిన సందర్భాలు ఉన్నాయి. అలాగే అసెంబ్లీని ( TS Assembly ) ప్రోరోగ్ చేయకుండా ఇప్పుడు నిర్వహిస్తూ ఉంటే అసలు గవర్నర్ ప్రసంగం అక్కర్లేదని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. కారణం ఏదైనా కానీ గవర్నర్ ప్రసంగం లేకుండా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభించాలని నిర్ణయం తీసుకోవడం రాజకీయ వివాదానికి కారణమయ్యే అవకాశం ఉంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)