TDP Manifesto : టీడీపీ మేనిఫెస్టోకు వైఎస్ఆర్‌సీపీనే ఎక్కువ ప్రచారం కల్పిస్తోందా ? అధికార పార్టీ వ్యూహాత్మక తప్పిదం చేస్తోందా ?
టీడీపీ మినీ మేనిఫెస్టోకు వైఎస్ఆర్‌సీపీనే ఎక్కువ ప్రచారం కల్పిస్తోందా ?వైసీపీ నేతల విమర్శలతో హామీలు ప్రజల్లోకి వెళ్తున్నాయా ?సీఎం జగన్ కూడా టీడీపీ మేనిఫెస్టోపై స్పందించడం వ్యూహాత్మక తప్పిదమేనా ?
TDP Manifesto : ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు మరో పది నెలల తర్వాత ఉన్నాయి. కానీ తెలుగుదేశం పార్టీ ఫేజ్ మేనిఫెస్టో అంటూ ఆరు హామీల్ని ప్రకటించింది. ఆ తర్వాత వాటి గురించి ప్రజల్లో విస్తృత చర్చ జరపడానికి కింది స్థాయి యంత్రాంగానికి బాధ్యతలప్పగిచింది. ప్రెస్ మీట్లు...బహిరంగసభల్లో చెప్పుకోవడం వేరు... పార్టీ క్యాడర్ నేరుగా వెళ్లి ప్రజలకు చెప్పడం వేరనే పాయింట్ ను గుర్తించి ఆ దిశగా కార్యాచరణ చేస్తోంది. అయితే అనూహ్యంగా వైఎస్ఆర్‌సీపీ నుంచి ఈ మేనిఫెస్టోపై తీవ్రమైన స్పందన వస్తోంది. దీంతో మరింత ప్రచారం వస్తోంది. ప్రత్యర్థి నేతలు ఎలాగూ పొగడరు కానీ.. వారు ఆ మేనిఫెస్టోపై విమర్శలు చేయడం వల్ల ప్రజల్లోకి వెళ్లిపోతోంది. చివరికి సీఎం జగన్ మోహన్ రెడ్డి కూడా మేనిఫెస్టోను ప్రస్తావించారు. దీంతో వైసీపీనే .. ఎక్కువగా టీడీపీ మేనిఫెస్టోకు ప్రచారం కల్పిస్తోందా అన్న అభిప్రాయానికి ఇతర పార్టీల నేతలు వస్తున్నారు.
ఆకర్షణీయమైన ఆరు హామీలు ఇచ్చిన టీడీపీ !
మహానాడు వేదికగా చంద్రబాబు నాయుడు మిని మ్యానిఫెస్టోని తీసుకుని వచ్చారు. దీనిలో నిరుద్యోగులకు, మహిళలకు, రైతులకు పెద్దపీఠ వేశారు. దీనికి తోడు తెలుగుదేశం పార్టీకి ఆది నుంచి కూడా అండగా ఉన్న బీసీలకు కూడా ఈ మ్యానిఫెస్టోలో స్థానం కల్పించారు. ప్రతి కుటుంబంలో 18 ఏళ్ళు నిండిన ప్రతి ఆడపడుచులకి "స్త్రీనిధి" కింద నెలకు 1500 రూపాయలను నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తామని పేర్కొన్నారు. దీనితో పాటే 'తల్లికి వందనం' పథకం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే వారందరికీ ఒక్కొక్కరికీ ఏడాదికి రూ.15,000లు అందించేలా తెలుగుదేశం హామీ ఇస్తున్నట్లు చంద్రబాబు నాయుడు ప్రకటించారు. "దీపం" పథకం కింద ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇవ్వాలని నిర్ణియించారు. "ఉచిత బస్సు ప్రయాణం" పథకం ద్వారా స్థానిక బస్సుల్లో మహిళలందరికీ టికెట్టులేని ప్రయాణ సౌకర్యం కలిగిస్తుందని హామీ ఇచ్చారు. ఇంటింటికీ మంచి నీరు" పథకం కింద ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్ , అన్నదాత పథకం కింద ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి రైతుకు ఏడాదికి 20 ,000 రూపాయల ఆర్థిక సాయం,నిరుద్యోగ భృతి వంటి హామీలు ఉన్నాయి. అలాగే బీసీల కోసం రక్షణ చట్టం తెచ్చి వారికి అన్ని విధాలా అండగా ఉంటామని చెబుతోంది. ఇలాగే ఇరవై లక్షల ఉద్యోగాలను యువతకు హామీ ఇచ్చింది.
వైసీపీ నేతల తీవ్ర విమర్శలతో మేనిఫెస్టోకు మరింతగా ప్రచారం !
భవిష్యత్‌కు గ్యారంటీ పేరుతో టీడీపీ ప్రకటించిన ఆరు హామీల గురించి వైసీపీ నేతలు తీవ్రంగా విమర్శిస్తూ ప్రెస్ మీట్లు పెడుతున్నారు. టీడీపీ మేనిఫెస్టో ఇదీ.. అని చెప్పి వీటిని చేయేలేరనో.. లేకపోతే ఇప్పటికే అమలు చేస్తున్నామనో చెబుతున్నారు. ఓ వైపు నేతలు.. మరో వైపు వైసీపీ సోషల్ మీడియా టీడీపీ మేనిఫెస్టో పై వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు. వారు చేసేది నెగెటివ్ ప్రచారమే కావొచ్చు కానీ.. టీడీపీ హామీలు మాత్రం ప్రజల్లోకి వెళ్తున్నాయి. ఎవరు చెప్పేవి నమ్ముతారన్నది ప్రజల చాయిస్. నెగెటివ్ గానో పాజిటివ్ గానో.. టీడీపీ మేనిఫెస్టో మాత్రం. ప్రజల్లోకి వెళ్లిపోతోంది. ఏ రాజకీయ పార్టీ అయినా కోరుకునేది ఇదే. హామీలు జనంలోకి విస్తృతంగా వెళ్లిపోతే.. చాలని అనుకుంటారు. ఆ పనిని వైసీపీ కూడా చేస్తూండటంతో టీడీపీ నేతలు ఆశ్చర్యపోతున్నారు. టీడీపీ నేతలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. వైసీపీ నేతలు విమర్శిస్తున్నారని కాకుండా..ఇన్ని హామీలు ఎలా అమలు చేస్తారని.. సామాన్యులకు వచ్చే సందేహాలను తీర్చడానికి ప్రయత్నిస్తున్నారు. సంపద పెంచుతామని అంటున్నారు. చంద్రబాబు టైంలో సంపద ఎలా పెరిగింతో విశ్లేషిస్తూ గణాంకాలు డాక్యుమెంట్లు పెడుతున్నారు.
సీఎం జగన్ విమర్శలతో మరోసారి హాట్ టాపిక్ !
టీడీపీ మేనిఫెస్టో బిసిబిళ్లబాత్ అని.. పులిహోర అని జగన్ విమర్శించారు. కర్ణాటక కాంగ్రెస్ , బీజేపీ ఇచ్చిన హామీలని కలిపేసి మేనిఫెస్టో తయారు చేశారని ఆరోపించారు. కాపీ పేస్ట్ అని.. మండిపడ్డారు. అయితే హామీలు కాపీ పేస్టో లేకపోతే.. మరొకటో అన్నది ప్రజలకు అవసరం ఉండదు. ఆ హామీలు అమలు చేస్తే తమకేంటి లాభం అనే చూసుకుంటారు. అధికారంలోకి వచ్చే పార్టీ అమలు చేస్తుందా లేదా అన్నది చూసుకుంటారు. ఇక్కడే వైసీపీ వ్యూహాత్మక తప్పిదానికి పాల్పడుతోందని.. విమర్శించాలన్న కారణంగా హామీల్ని హైలెట్ చేస్తన్నారని అంటున్నారు. నిజానికి కర్ణాటాక కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మూడు సిలిండర్లు, మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం వంటి హామీలు ఓట్ల వర్షం కురిపించాయి. అవే చంద్రబాబు ప్రకటించారు. కాపీ అయినా కాకపోయినా ఆ ప్రయోజనాలు తమకు వస్తాయని ప్రజలు అనుకుంటే.. టీడీపీకి కూడా ఓట్ల పంట పండుతుంది. ఇదే లాజిక్ ను వైసీపీ నేతలు మర్చిపోతున్నారంటున్నారు.