YSRCP PK Team : "ఐ ప్యాక్" ఓకే అంటేనే వైఎస్ఆర్‌సీపీ టిక్కెట్ - క్యాడర్ వద్దన్నా చాన్స్ ! జగన్ నమ్మకమేంటి ?
వైఎస్ఆర్‌సీపీలో ఐ ప్యాక్ హవా నడుస్తోంది. ఆ సంస్థ ఇచ్చే నివేదికలు బాగుంటే క్యాడర్ ఓకే చెప్పకపోయినా జగన్ టిక్కెట్ ఖరారు చేస్తున్నారు.
YSRCP PK Team : వైఎస్ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు రోజుల కింద టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో 71 మంది టెక్కలి నేతలు పాల్గొన్నారు. వారిలో 40 మంది వచ్చే ఎన్నికల్లో టెక్కలి అభ్యర్థిగా దువ్వాడ శ్రీనివాస్ వద్దని నేరుగా సీఎం జగన్‌కు చెప్పారు. కానీ ఆయన మాత్రం వారి అభ్యంతరాలను పట్టించుకోలేదు. అభ్యర్థిగా దువ్వాడను ఖరారు చేశారు. అందరూ కలిసి గెలిపించుకుని రావాల్సిందేనని ఆదేశించారు. దీంతో టెక్కలి క్యాడర్ ఆశ్చర్యపోయింది. దీనికి కారణం.. అక్కడ క్యాడర్ అభిప్రాయాలు ఎలా ఉన్నా.. అభ్యర్థిగా దువ్వాడ శ్రీనివాస్ ఉండాల్సిందేనని ఐ ప్యాక్ టీం నివేదిక ఇవ్వడమే కారణం. ఒక్క టెక్కలి విషయంలోనే కాదు.. నియోజకవర్గాల్లో పార్టీ నేతల అసంతృప్తి ఉందని భావిస్తున్న ఇతర నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులను జగన్ ఇలా ఖరారు చేయడానికి పీకే టీం నివేదికల్నే ప్రామాణికంగా తీసుకుంటున్నారు.
ప్రశాంత్ కిషోర్ టీంపై ఎక్కువ నమ్మకం పెట్టుకుంటున్న జగన్
2019 ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయం వెనుక ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు ఉన్నాయి. ఆయన జగన్మోహన్ రెడ్డి కోసం ప్రత్యేకంగా పని చేశారు. సోషల్ మీడియా స్ట్రాటజీలు ఉపయోగించారు. సామాజిక సమీకరణాలు చూశారు. ఇలా అన్నీ పకడ్బందీగా ఉండటం.. వారు చేసిన సర్వేలన్నీ పక్కాగా ఉండటంతో జగన్ నమ్మకాన్ని పొందారు. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ సొంత రాజకీయం చేసుకుంటూ బీహార్‌లో పాదయాత్ర చేస్తున్నారు కానీ.. ఏపీలో ఐ ప్యాక్ టీం మాత్రం పని చేస్తోంది. పీకేకు సన్నిహితుడైన రిషి రాజ్ నేతృత్వంలో ఏపీలో పీకే టీం పని చేస్తోంది. ఇటీవల తెలంగాణలో పీకే టీం పని ఆపేసింది. ఆ సిబ్బంది అంతా ఏపీకి వచ్చారు. దీంతో నియోజకవర్గాల్లో పరిస్థితులను వారు ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ జగన్‌కు నివేదికలు ఇస్తున్నారు.
అభ్యర్థుల ఎంపికపై పీకే టీం రిపోర్టే ఫైనల్
గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం కూడా పూర్తిగా ఐ ప్యాక్ టీం ఆలోచన. ఆ టీం కనుసన్నల్లోనే ఆర్గనైజ్ చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు.. ఇంచార్జులు ఎలా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారనేది ప్రతీ రోజూ నివేదికలు పంపుతున్నారు. ప్రతీ నెలా సమీక్ష పెట్టి జగన్ ఎమ్మెల్యేలకు హెచ్చరికలు జారీ చేసేది ఈ ఐ ప్యాక్ టీం ఇచ్చే నివేదికలను బట్టే. అవన్నీ ఖచ్చితంగా ఉంటున్నాయి. ఎమ్మెల్యేలు ఎవరెవరు గడప గడపకూ వెళ్లడంతో లేదో.. తెలిసిపోతోంది. ఈ కార్యక్రమంపై ప్రజల్లో వ్యతిరేక ప్రచారం జరుగుతోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. కానీ జగన్ మాత్రం ఎట్టి పరిస్థఇతుల్లోనూ చేయాలని ఆదేశిస్తున్నారు. దీనికి కారణం ....ఇలా ప్రతీ ఇంటికి వెళ్లి ప్రభుత్వం చేసిన మేలు చెప్పడం ద్వారా.. ప్రభుత్వమే మన దగ్గరకు వచ్చిందని ప్రజలు భావిస్తారని పీకే టీం ఎక్స్ ప్లెయిన్ చేయడమేనని అంటున్నారు.
ఎక్కువగా ఆధారపడుతున్నారని పార్టీ నేతల్లో అసంతృప్తి
నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక పూర్తిగా పీకే టీం నివేదికలపై ఆధారపడి ఉంటుందని జగన్ పదే పదే చెబుతున్నారు. పనితీరు మెరుగుపర్చుకోవాలని సూచిస్తున్నారు. ఈ ప్రకారం ఎమ్మెల్యేలు కూడా ... ఆ దిశగా ప్రయత్నిస్తున్నారు. అయితే పలువురిలో మాత్రం తమ కంటే ప్రశాంత్ కిశోర్ బృందాన్నే జగన్ ఎక్కువగా నమ్ముతున్నారన్న అసంతృప్తికి గురవుతున్నారు. అయితే ఈ విషయంలో జగన్ ఏ మాత్రం మొహమాటానికి పోవడం లేదని.. సర్వేల విషయంలో పీకే టీం ఇచ్చేవాటికే కాకుండా మరో రెండు స్వతంత్ర సంస్థలతోనూ సర్వేలు చేయిస్తున్నారని చెబుతున్నారు.
వైఎస్ఆర్‌సీపీలో పీకే ప్రభావం ఎక్కువగా ఉందని 2019 ఎన్నికల ముందూ ప్రచారం జరిగింది. ఇప్పుడూ అలాంటి పరిస్థితే వైఎస్ఆర్‌సీపీలో ఉంది. కానీ ఏదైనా విజయం కోసమేనని.. ఐ ప్యాక్ పనితీరుపై జగన్ సంతృప్తిగా ఉన్నారని అంటున్నారు.