Telangana Independence : తెలంగాణలో మరోసారి స్వాతంత్ర్య వేడకులు - ఎందుకంటే ?
తెలంగాణలో మరోసారి స్వాతంత్య్ర వేడుకలు జరిగే అవకాశం ఉంది. కేసీఆర్ త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు. ఎందుకంటే ?
Telangana Independence : దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణలో పదిహేను రోజుల పాటు నిర్వహించారు. ప్రతీ ఇంటిపైనా జాతీయ జెండా ఎగురవేశారు. సంబరాలు ముగిసిన తర్వాత అంతే జాగ్రత్తగా తీసి దాచి పెట్టారు. అయితే తెలంగాణ సర్కార్ ఇప్పుడు మరో వినూత్నమైన ఆలోచన చేస్తోంది. తెలంగాణకు ప్రత్యేకంగా స్వాతంత్ర్య వేడుకలు నిర్వహించాలనుకుంటోంది. దీనికి కారణం తెలంగాణకు ఉన్న చారిత్రక నేపధ్యమే. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు తెలంగాణ నిజాం సంస్థానంలోనే ఉండేది. తర్వాత సైనిక చర్య జరిపి భారత్‌లో విలీనం చేశారు. భారత్‌లో కలిసి 75 ఏండ్లు అవుతున్న సందర్భంగా వజ్రోత్సవంలాంటి ఉత్సవం ఒకటి నిర్వహిస్తే బాగుంటుందని తెలంగాణ సర్కార్ భావిస్తోంది.
దేశంలో హైదరాబాద్ స్టేట్ విలీనానికి సెప్టెంబరు 17తో 75 ఏళ్లు !
సెప్టెంబరు 17తో తెలంగాణ అంతర్భాగంగా ఉన్న హైదరాబాద్ స్టేట్ భారత్‌లో కలిసి 74 ఏండ్లు పూర్తి చేసుకుంటుంంది. స్వాతంత్య్ర వజ్రోత్సవాలకు కొనసాగింపుగా, తెలంగాణ ప్రాంతం భారత్‌లో కలిసిన సందర్భానికి కూడా ఘనంగా వేడుకలు నిర్వహించాలనే ప్రతిపాదన ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఒకప్పటి హైదరాబాద్ స్టేట్‌లో కొన్ని ప్రాంతాలు కర్ణాటక, మహారాష్ట్రల్లో కలిశాయి. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు సమయంలో అవి ఆయా రాష్ట్రాల్లో చేరారు. అయితే ప్రత్యేక రాష్ట్రంగా ఉన్న భాగం తెలంగాణనే ... అందువల్ల సుపంపన్న భారతంలో మనం కలిసి 75 ఏండ్లు అవుతున్న సందర్భంగా వజ్రోత్సవంలాంటి ఉత్సవం ఒకటి నిర్వహిస్తే బాగుంటుందని ముఖ్యమంత్రి పలు వర్గాల నుంచి సూచనలు వచ్చినట్లుగా టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
1947లో దేశానికి స్వాతంత్ర్యం 1948లో హైదరాబాద్ స్టేట్ విలీనం
75 ఏండ్ల క్రితం 1947లో భారతదేశం బ్రిటిష్ పాలన నుంచి విముక్తమై స్వపరిపాలనకు, ప్రజాస్వామ్య పాలనకు నాంది పలికింది. ఈ పరిణామ ప్రభావం దేశమంతా పాకింది. దేశంలోని 500కు పైగా సంస్థానాలు తమ పూర్వ వ్యవస్థల నుంచి బయట పడ్డాయి. ఇదే క్రమంలో 1948 సెప్టెంబరు 17న, తెలంగాణ ప్రాంతం కూడా రాజరికం నుంచి ప్రజాస్వామ్య పాలనలోకి మారింది. అంతదాక ఒక సంస్థాన రాజ్యంగా ఉన్న హైదరాబాద్ సువిశాల భారత దేశ ప్రజాస్వామ్యంలో భాగమైంది. యావత్ తెలంగాణ ప్రజలు భారతీయులై 75 ఏండ్లు అయిన సువర్ణ ఘట్టం ఇది. . ఇదొక చారిత్రక పరిణామం. చెరిగిపోని సందర్భమని వేడుకలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
తెలంగాణ చరిత్రను భావి తరాలకు తెలియచెప్పాలంటున్న మేధావులు !
తెలంగాణ ప్రాంతానికి ఎటువంటి సుదీర్ఘ చరిత్ర ఉన్నదో, తెలంగాణ పోరాట స్ఫూర్తి ఎంతటిదో మన పిల్లలకు చూపించడానికి, భారతదేశంలో కలిసి 75 ఏండ్లు అయిన సందర్భం అత్యుత్తమమైనదని మేదావులు అంటున్నారు. ఉజ్వల పోరాటంతో విశాల దేశంగా ఆవిర్భవించిన ప్రజాస్వామ్య భారత్‌లో, తెలంగాణ అంతర్భాగం కావడం అపూర్వ ఘట్టమని సీఎం భావిస్తున్నారు. జాతి, కుల, మతాలకతీతంగా అనేకమంది చేసిన పోరాటాల ఫలితంగానే తెలంగాణ ప్రాంతం భారతదేశంలో కలిసిందని, అదే భావనను భావి తరాలకు కూడా పంచాల్సిన అవసరం ఉన్నదని ప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణ వజ్రోత్సవాలుగా నిర్వహించాలా, మరొక రకంగానా అన్నదానిపై త్వరలోనే కేసీఆర్ నిర్ణయం తీసుకోనున్నారు.
విలీనమా.. విమోచనమా.. అన్నదానిపై ఇప్పటికే వివాదం
నిజానికి హైదరాబాద్ స్టేట్ భారత్‌లో విలీనం అయిన సందర్భాన్ని అధికారికంగా నిర్వహించాలనే వాదన చాలా కాలం నుంచి ఉద్యమ సమయంలో కేసీఆర్ ఈ అంశాన్ని హైలెట్ చేసేవారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన స్పందించలేదు. కానీ బీజేపీ మాత్రం విమర్శలు చేస్తూ ఉంటుంది. నిజానికి హైదరాబాద్ స్టేట్ విలీనం అయిందా.. నిజాం నుంచి విముక్తి కల్పించారా అ్నదానిపై ఇప్పటికీ చర్చలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు కేసీఆర్ వినూత్నంగా తెలంగాణ వజ్రోత్సవాలుగా నిర్వహిస్తే మాత్రం మరో వివాదం ప్రారంభమయ్యే అవకాశం ఉంది.