AP Early Polls : ఏపీలో మోదీ ముందస్తు ఎన్నికలు కోరుకుంటున్నారా ? ఈసీ హడావుడి దేనికి సంకేతం?
ఏపీలో తెలంగాణతో పాటే అసెంబ్లీ ఎన్నికలు జరగాలని మోదీ కోరుకుంటున్నారా ?ముందుగానే రిటర్నింగ్ అధికారుల నియామకం దేనికి సంకేతం ?జగన్‌పై మోదీ ఒత్తిడి నిజమేనా ?
AP Early Polls : ఏపీలో మోదీ ముందస్తు కోరుకుంటున్నారా...? రిటర్నింగ్ అధాకారుల నియామకం అందుకేనా..? ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణతో పాటే ఎన్నికలకు వెళ్లమని జగన్ కు సూచించారా..? ఏపీలో ముందుగానే ఎలక్షన్ వస్తుందా.. ? ఇప్పుడిదే హాట్ టాపిక్
ఆరు నెలల ముందుగానే ఆర్వోలను నియమిచిన ఈసీ
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌కు ఇంకా ఎనిమిది నెలల సమయం ఉంది. కానీ ఏపీలోని అన్ని నియోజకవర్గాలకు ఎలక్టోరల్ రిటర్నింగ్ అధికారులను నియమిస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చేసింది. నవంబర్ -డిసెంబర్ లో ఎన్నికలు జరగాల్సిన తెలంగాణలోనే వారం రోజుల క్రితం రిటర్నింగ్ అధికారులను నియమించారు. కానీ ఎప్పుడో మార్చి, ఏప్రిల్‌లో జరిగే ఎన్నికలకు అప్పుడే ఆర్వోలను ఎందుకు నియమించారనేది చాలా మందికి వస్తున్న సందేహం . ఇది ఏపీలోని ముందస్తు ఎన్నికలకు సూచిక అని కొందరు.. అలాంటిదేం లేదని ఇవన్నీ విధుల్లో భాగమేనని కొందరు చెప్పుకుంటున్నారు. ముందస్తు నిజమైనా కాకపోయినా ఎన్నికల కమిషన్ నిర్ణయం అన్నది రాజకీయ అలజడినైతే సృష్టించింది.
ముందస్తు కోరుకుంటోంది మోదీనా..?
రాష్ట్రంలో గడువు కన్నా ముందు ఎన్నికలు రావాలంటే అది ముఖ్యమంత్రి నిర్ణయం మీదనే ఆధారపడి ఉంటుంది. తెలంగాణతో సహా ఐదు రాష్ట్రాల ఎన్నికలతో పోటీ పడాలంటే ముఖ్యమంత్రి జగన్ ముందు అసెంబ్లీని రద్దు చేయాలి. ముందుస్తుకు కావాలని వెళ్లాలి. కానీ ఇక్కడ కోరుకుంటోంది.. ముఖ్యమంత్రి కాదు.. ప్రధాన మంత్రి. అవును పీఎం నరేంద్రమోదీనే జగన్మోహనరెడ్డి ని ముందుగానే ఎన్నికలకు వెళ్లమని సలహా ఇచ్చారంట..! జూలై 6న ముఖ్యమంత్రి జగన్‌మహన రెడ్డి ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షాలతో సమావేశం అయ్యారు. ఇద్దరూ కూడా ముఖ్యమంత్రిని ముందస్తుకు వెళ్లమని చెప్పారని రాజకీయవర్గాల్లో విస్తృత ప్రచారం జరుగుతోంది.
ముందే ఎందుకు..?
ప్రధాని జగన్‌మోహనరెడ్డిని ముందస్తుకు వెళ్లమనడానికి కారణాలు కళ్లముందే కనిపిస్తున్నాయి.
• 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయం పాలయింది. కేవలం ఒక్క సీట్‌లోనే గెలిచింది. కానీ ఆ తర్వాత కొన్ని నెలలకే జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు స్థానాలు గెలుచుకోవడమేకాదు. 30 అసెంబ్లీ సీట్ల పరిధిలో ఆధిక్యత సాధించింది.
• పార్లమెంట్ ఎన్నికలు నేషనల్ అజెండాతోనే జరగాలని బీజేపీ అనుకుంటోంది. అందువల్లే 2018లో కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా.. 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ సత్తా చాటింది.
• 2024 ఎన్నికల్లో వీలైనంతగా రాష్ట్రాల ఎలక్షన్ లేకుండా చూసుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. తద్వారా అమకు గెలుపు అవకాశాలు ఉంటాయని భావిస్తోంది.
• వైసీపీ ముందస్తుకు వెళితే బీజేపీకి ఇంకోలాభం కూడా ఉంది. పార్లమెంట్ ఎన్నికల వరకూ వైసీపీతో పొత్తు పెట్టుకుంటే కొన్ని సీట్లను సాధించొచ్చు. వైసీపీ సాయంతో సొంతంగా కొన్ని సీట్లు గెలుచుకోవాలని ఆ పార్టీ అనుకుంటోంది.
ఎన్నికలు లేవంటున్న రాష్ట్ర ప్రభుత్వం
సీఎం జగన్ ముందస్తుకు వెళ్లే ఆలోచన లేదని చాలా కాలంగా చెబుతూ వస్తున్నా.. మిగిలిన రాజకీయ పార్టీలు మాత్రం నమ్మడం లేదు. సీఎం ఆంతరంగికుడు.. వైసీపీ ముఖ్యనేత సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్‌మీట్ పెట్టి మరీ.. తమకు ముందస్తు మీద ఆసక్తి లేదని చెప్పారు. కానీ అకస్మాత్తుగా ఏపీలో రిటర్నింగ్ అధికారుల నియమకం జరిగింది. దీంతో ఒక్కసారిగా ఎన్నికలు వాతావరణం వచ్చేసింది.
తెలంగాణలో డిసెంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్‌లో జరగాల్సి ఉంది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల కోసం ఈసీ సన్నాహాలు ప్రారంభించింది. నియోజకవర్గాలకు వారం కిందట రిటర్నింగ్ ఆఫీసర్లును నియమించింది. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల సన్నాహాలు అసెంబ్లీ ఎన్నికల తర్వాత చేస్తారు. కానీ ఏపీలో మాత్రం.. అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్నారు. ఏకంగా రిటర్నింగ్ ఆఫీసర్లను నియమించేశారు.
ముందస్తుకు జగన్ నో !
కిందటి సారి ప్రధానిని కలిసినప్పుడు... ఏపీలో ముందస్తుకు వెళ్లమని సూచించారు. కానీ దీనిని జగన్ సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. వీలైనన్నీ ఎక్కువ సీట్లు సాధిస్తే కేంద్రంపై ఒత్తిడి తీసుకురావచ్చన్నిది ఆయన ఉద్దేశ్యం. అందుకే జగన్ మోహనరెడ్డి ఒక్క ఓటును, సీటును కూడా వదులుకునేందుకు సిద్ధంగా లేరు.
జగన్ ను NDA లో చేరమని బీజేపీ ఎప్పటి నుంచో ఒత్తిడి తెస్తోంది. కానీ ఆయన నాలుగేళ్లుగా తిరస్కరిస్తూనే ఉన్నారు. జగన్ మోహనరెడ్డి ఓటు బ్యాంక్ అంతా ముస్లిం, మైనారిటీలు, దళితుల్లోనే ఉంది. బీజేపీతో కలిస్తే.. ఆయన ఓటు బ్యాంకుకు ఇబ్బంది రావొచ్చు. అందుకే జగన్ ఇన్నాళ్లుగా బయటే ఉన్నారు.
కేంద్రం సూచనలతోనే ఆర్వోల నియామకం..?
ఆంధ్రప్రదశ్‌లో ఎన్నికలకు ఇంకా చాలా గడువు ఉన్నా కూడా రిటర్నింగ్ ఆఫీసర్లను నియమించారంటే.. కేంద్రం నుంచి ఏమైనా సంకేతాలు ఉన్నాయా అన్న అనుమానాలు ఉన్నాయి. ప్రభుత్వ వర్గాలు అయితే ఈ విషయాన్ని ఖండించడం లేదు. అలాగని ఎన్నికలు ఉంటాయనీ చెప్పడం లేదు. ఒకరిద్దరు అధికారులు మాత్రం ఎన్నికలు ముందుగా జరగడానికే ఎక్కువ అవకాశం ఉందని చెబుతున్నారు.కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో జగన్‌కు నచ్చచెప్పగలం అనే ఉద్దేశ్యంతోనే ఎన్నికల సన్నాహకాలు ఇప్పటి నుంచే మొదలు పెట్టినట్లుగా ప్రచారం జరుగుతోంది.
ముందస్తు ఎన్నికలకు వెళ్లడం లేదని వైసీపీ పదే పదే చెబుతున్నా.. ప్రతిపక్షాలు మాత్రం ఆ మాటలను విశ్వసించడం లేదు. ఎన్నికలు వీలైనంత త్వరగా జరిగేందుకు, జగన్ ముందస్తు ఎన్నికల కోసం ఎన్నికల కమిషన్ తో సంప్రదించారని.. పవన్ కల్యాణ్ ఇంతకు మందు ఆరోపించారు. అందులో భాగంగానే అసెంబ్లీని రద్దు చేయకుండానే ఎన్నికల ప్రక్రియ ప్రారంభించేశారన్న అనుమానాలు మొదలయ్యాయి. చంద్రబాబు కూడా ఎన్నికలు ముందుగా వచ్చే అవకాశం ఉందని, సిద్ధంగా ఉండాలని పలు సందర్భాల్లో చెప్పారు.
ఏం జరగబోతోంది..?
అసెంబ్లీని సీఎం జగన్ రద్దు చేస్తేనే అధికారికంగా ఎన్నికల ప్రక్రియను ఈసీ ప్రారంభిస్తుంది. కానీ ఓటర్ల జాబితాపై అనుమానాలు.. ఫిర్యాదులు వెల్లువెత్తున్న సమయంలో నెల రోజుల్లో ఓటర్ల జాబితాను తప్పుల్లేకుండా మార్చేందుకు ప్రత్యేక సవరణ కార్యక్రమం చేపట్టారు. అంటే ఓటర్ల జాబితా కూడా రెడీ అయినట్లే. రిటర్నింగ్ ఆఫీసర్లను కూడా నియమించారు. అంటే.. ఐదు రాష్ట్రాల ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించేలోపు సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎప్పుడు అసెంబ్లీని రద్దు చేసినా.. ఎన్నికలు నిర్వహించాడనికి ఈసీ రెడీగా ఉందన్నమాటే. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఆ దిశగానే ఉన్నాయన్నది ఎక్కువ మంది అభిప్రాయం.