T Congress Plans : కర్ణాటక స్ట్రాటజీనే తెలంగాణలో - సునీల్ కనుగోలు మ్యాజిక్ రిపీట్ అవుతుందా ?
కర్ణాటక వ్యూహాలనే తెలంగాణలో అమలు చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. రెండో సారి వర్కవుట్ అవుతుందా ?
T Congress Plans : ఓ సినిమా హిట్ అయిందని అదే ఫార్మలాతో సినిమాలు తీయడం సహజమే. అయితే ఆ ఫార్ములాలో వైవిధ్యం లేకపోతే మొదటికే మోసం వస్తుంది. సినిమా ఫ్లాప్ అవుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ..కర్ణాటకలో ఉపయోగించిన ఫార్ములానే తెలంగాణలో ఉపయోగిస్తోంది. కర్ణాటక తరహాలోనే తెర ముందు చేయాల్సినవి చేస్తూనే తెర వెనుక ప్రయత్నాలు కూడా జోరుగా నిర్వహించేస్తున్నారు.
కనుగోలు వ్యూహాల అమలు ప్రారంభించిన రేవంత్ రెడ్డి
అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో దక్షిణాదిన తెలంగాణ ) ఉంది. కర్ణాటక గెలుపు తెలంగాణలోనూ కొనసాగుతుందని పార్టీ నేతలు ధీమాగా చెబుతున్నారు. పార్టీ హైకమాండ్ ఇప్పటికే పార్టీ నేతలకు ఎప్పటికప్పుడు దిశా నిర్దేశం చేస్తోంది. వ్యూహాలు సిద్దం చేస్తోంది. తెలంగాణలో ఎప్పుడు అవసరమైనా వచ్చేందుకు సిద్దమని రాహుల్ .. ప్రియాంకహామీ ఇచ్చారు. పార్టీ ఇంఛార్జ్ థాక్రే చేరికల వ్యవహారాన్ని స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.ఈ సమయంలో కర్ణాటకలో సక్సెస్ అయిన ఫార్ములానే తెలంగాణలో అమలు చేయాలని డిసైడ్ అయ్యారు. సునీల్ కనుగోలు టీం ఇప్పటికే గ్రౌండ్ వర్క్ పూర్తి చేసి ఫీడ్ బ్యాక్ ఇచ్చింది.
పార్టీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వేటే !
తాజా చేరికలతో బలం పెంచుకున్నట్లుగా కనిపిస్తోంది. అధికారంలోకి వచ్చాక అమలు చేసే హామీలను రాహుల్, ప్రియాంక తో ప్రకటించేలా చేయాలని పార్టీ నేతలు నిర్ణయించారు. తాజాగా ఖమ్మం సభలో ప్రకటించిన చేయూత వంటి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని డిసైడ్ అయ్యారు. పటిష్టమైన క్యాంపెయిన్ చేపట్టాలి. ప్రియాంక గాంధీ, సోనియా గాంధీలు వీలైనంత ఎక్కువగా తెలంగాణ సభలకు హాజరవ్వాలి. లో నాయకులు తాత్కాలికంగానైనా విభేదాలు పక్కనపెట్టి ఒక్కటవ్వాలి. తెలంగాణ కాంగ్రెస్ నేతల మధ్య ఐక్యత లేదని నాయకత్వం గుర్తించింది. మొదలు వారి మధ్య విభేదాలు పక్కనపెట్టి ఏకం కావాలి. కలిసుంటేనే గెలవగలం, లేదంటే పరాజయం తప్పదని డిల్లీ సమావేశంలోనే రాహల్ తేల్చి చెప్పారు. పార్టీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వేటేస్తామని హెచ్చరికలు పంపారు.
గ్యారంటీ హామీలతో హైప్ తెచ్చుకుంటున్న కాంగ్రెస్
కర్టాటక తరహాలోనే తెలంగాణలోనూ ముఖ్యమంత్రి అవినీతి పైన ప్రతీ స్థాయిలోనూ ప్రచారం చేసేలా కార్యచరణ సిద్దం చేయాలని నిర్ణయించారు. పార్టీ వింగ్‌లనూ సన్నద్ధం చేయడం మరో ముఖ్యమైన పాయింట్. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, మహిళా విభాగాలను క్రియాశీలం చేసి ఆయా వర్గాలకు చేరువ కావాలనేది మరో నిర్ణయం . కుల సంఘాలు, కమ్యూనిటీ నెట్‌వర్క్‌లకు చేరువ కావాలని ఖర్గే నిర్దేశించారు. కాంగ్రెస్‌కు బలమైన ఓటు బ్యాంకుగా ఉండిన ముస్లిం, క్రిస్టియన్‌లను మళ్లీ వెనక్కి తెచ్చుకోవడంపై దృష్టి పెట్టాలని నిర్ణయించారు. కాంగ్రెస్ వ్యవస్థాగతంగా సుస్థిరం చేసేలా నేతలు కార్యకర్తలతో మమేకం కావాలి. పార్టీ అన్ని విభాగాలను క్రియాశీలం చేయడంతో పాటుగా శక్తివంతంగా ఎలక్షనీరింగ్ చేపట్టడం పైన శిక్షణ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.. ఆకర్షణీయ ఎన్నికల హామీలతో ప్రజలకు గ్యారంటీ కార్డ్ ప్రకటించాలని దీని పైన కసరత్తు చేయాలని పార్టీ నిర్ణయించింది.