Kakani Anil Meets jagan : విభేదాలు లేవన్న కాకాణి, అనిల్ - కలిసి పని చేసుకోవాలని చెప్పిన జగన్ !
నెల్లూరులో పార్టీ నాయకుల మధ్య ఏర్పడిన వివాదాలను సీఎం జగన్ పరిష్కరించే ప్రయత్నం చేశారు. మంత్రి కాకాణి, మాజీ మంత్రి అనిల్‌లకు విభేదాలు వీడి కలిసి పని చేసుకోవాలని సూచించారు.
నెల్లూరు నేతలకు సీఎం జగన్ హెచ్చరికలు జారీ చేశారు. సమన్వయంతో పని చేసుకోవాలని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి అనిల్‌లకు చెప్పినట్లుగా తెలుస్తోంది. ఎమ్మెల్యే ఆనంతో కలిసి కాకాణి చేసిన వ్యాఖ్యలపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. ఈ వ్యాఖ్యలపై కాకాణి గోవర్ధన్ రెడ్డి జగన్‌కు వివరణ ఇచ్చారు. మొదట ఇద్దరితో విడివిడిగా మాట్లాడిన సీఎం.. తర్వాత ఇద్దరినీ కలిపి కూర్చోబెట్టి మాట్లాడారు. కలిసి పని చేసుకోవాలని.. వివాదాల జోలికి వెళ్లవద్దని సీరియస్‌గా చెప్పినట్లుగా తెలుస్తోంది.
గతంలో ఎలా పనిచేశారో... అలాగే ఇప్పుడు పనిచేసుకోమని సీఎం చెప్పారని కాకాణి గోవర్ధన్ రెడ్డి మీడియాకు తెలిపారు. అనిల్‌కుమార్‌తో ఎలాంటి విభేదాలు లేవని, తాను జిల్లాకు మంత్రి, అనిల్ కుమార్ మాజీ మంత్రి అని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే సభ పెట్టుకుంటే తప్పేంటి? అని ప్రశ్నించారు. పోటాపోటీ సభలు అనేది అవాస్తవమన్నారు. తమ ఇద్దరి మధ్య ఏదో ఉందని అనుకోవద్దన్నారు. నిప్పు లేకుండానే పొగ వస్తుందని చెప్పారు. అనిల్ కుమార్, తాను వెళ్లి కలవడం వెనుక ప్రత్యేక ఉద్దేశాలేమీ లేవని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని గెలిపించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. తమ మధ్య గొడవలు సృష్టించేందుకు కొందరి ప్రయత్నం చేస్తున్నారని కాకాణి గోవర్దన్ విమర్శించారు. అనిల్ కుమార్ పార్టీ మనిషి అని ఏదైనా పార్టీ కోసమే చేస్తారన్నారు.
మాజీ మంత్రి అనిల్ కుమార్ కూడా సీఎం జగన్‌తో సమావేశమయ్యారు. ఆయనను కూడా పోటీ సభ నిర్వహించడం కాకానికి వ్యతిరేకంగా ప్రకటనలు చేయడంపై సీఎం జగన్ ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. జగన్‌తో సమావేశం తర్వాత మీడియాతో అనిల్ కుమార్ మాట్లాడారు. రీజినల్ కో ఆర్డినేటర్ గా నియమించినందు కు సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలిపానన్నారు. మంత్రి కాకాని తో ఎలాంటి విభేదాలు లేవని.. తామందరం జగన్ వర్గమని స్పష్టం చేశారు. కాకాణితో వ్యక్తిగత విభేదాలు కూడా లేవన్నారు. ఫ్లెక్సీలపై ఎలాంటి రచ్చ లేదు...తాను మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఫ్లెక్సీ లు తీసేశానని అనిల్ కుమార్ గుర్తు చేసుకున్నారు. నియోజకవర్గంలో ఎక్కడా కూడా ఫ్లెక్సీ లు ఉండకూడదని గతంలో నే ఒక పాలసీ పెట్టామమన్నారు. మాకు ఒక పార్టీ లైన్ ఉందన్నారు. ఆనం వ్యాఖ్యలు ఆయన విజ్ఞత కి వదిలేస్తున్నాని.. తాను జగన్ సైనికుణ్ణని.. తన రక్తం మొత్తం జగన్ కోసమే ధారబోస్తానన్నారు.
జగన్ హితబోధతో అయినా పార్టీ నేతలు విభేదాలు వీడితే చాలని కాకాణి, అనిల్ కుమార్ వర్గీయులు కోరుకుంటున్నారు.