(Source: ECI/ABP News/ABP Majha)
Pawan Babu Meet : పవన్‌కల్యాణ్‌తో చంద్రబాబు భేటీ - ఏపీ రాజకీయాల్లో కీలక మార్పు !
విజయవాడలో పవన్ కల్యాణ్‌తో చంద్రబాబు. సమావేశం అయ్యారు. ఈ మీటింగ్ ఏపీ రాజకీయాల్లో కీలక మార్పులకు కారణం కాబోతోంది.
Pawan Babu Meet : ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రం మారబోతోందని పవన్ కల్యాణ్ ప్రకటించిన కొద్ది సేపటికే అన్నంత పని చేశారు. ఏపీ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేశారు. నోవాటెల్ హోటల్లో పవన్ కల్యాణ్, చంద్రబాబు సమావేశం అయ్యారు. పార్టీ ఆఫీసులో కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన తర్వాత పవన్ కల్యాణ్.. నోవాటెల్ హోటల్‌కు వచ్చారు. విశాఖ ఘటనల అంశంపై సంఘిభావం తెలిపేందుకు చంద్రబాబు హోటల్‌కు వచ్చారు. వారిద్దరి మధ్య సమావేశం జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ వ్యవహరిస్తున్న తీరుపై వీరిద్దరి మధ్య చర్చ జరిగింది. అంతర్గతంగా ఏం చర్చలు జరిగాయో కానీ.. పవన్ చెప్పినట్లుగా రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేశారు.
వైసీపీ ముక్త ఏపీ కోసం పవన్ ప్రచారం
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్‌సీపీ మళ్లీ గెలవడకూడదని..వైసీపీ విముక్త ఏపీ కావాలని పవన్ కల్యాణ్ కొద్ది రోజులుగా ప్రచారం చేస్తున్నారు. ఇందు కోసం తాను ఓట్లు చీలకుండా చూస్తానని ప్రకటిస్తూ వస్తున్నారు. ఓ సందర్భంగా వైఎస్ఆర్‌సీపీని ఓడించడానికి బీజేపీని రూట్ మ్యాప్ అడిగానని చెప్పారు. అయితే ఉదయం మీడియాతో మాట్లాడిన సమయంలో బీజేపీ ఎలాంటి రూట్ మ్యాప్ ఇవ్వలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. బీజేపీతో పొత్తులో ఉన్నాం కానీ బలంగా కలిసి వెళ్లలేకపోయామన్నారు. ప్రభుత్వంపై పోరాడలేకపోయామన్నారు. మోదీ అంటే గౌరవం ఉంది కానీ బానిసత్వం మాత్రం లేదన్నారు. ఇలా బీజేపీ పై పరోక్షంగా అసంతృప్తి వ్యక్తం చేయడం .. కాసేపటికే.. నోవాటెల్ హోటల్లో పవన్ తో చంద్రబాబు భేటీ కావడంతో రాజకీయంగా ఊహాగానాలు రావడానికి కారణం అవుతోంది.
వైఎస్ఆర్‌సీపీ వేధింపులపై కలసి పోరాడే అవకాశం
అయితే ప్రస్తుతం పవన్ , చంద్రబాబు మధ్య భేటీ రాజకీయ పొత్తుల గురించి కాదని.. జనసేన, టీడీపీ వర్గాలు చెబుతున్నారు. విశాఖలో పవన్ కల్యాణ్‌ను అడ్డుకున్న తీరు.. ప్రజాస్వామ్య పోరాటాల విషయంలో ఏపీ ప్రభుత్వ నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా పోరాటం చేయడంపై వారు మాట్లాడుకున్నారని అంటున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ ఆఫీసుపై వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు దాడి చేసినప్పుడు పవన్ కల్యాణ్ ఖండించారు. అలాగే పలువురు టీడీపీ నేతలపై దాడి చేసినప్పుడు ఖండించారు. అందుకే చంద్రబాబు పవన్ కల్యాణ్‌కు సంఘిభావం తెలిపేందుకు ప్రత్యేకంగా సమావేశమయ్యారని చెబుతున్నారు .
ఏపీ రాజకీయాల్లో కీలక మార్పు
అయితే జనసేన, టీడీపీ మధ్య సత్సంబంధాలకు ఈ సమావేశం మంచి మార్గం అవుతుందని రెండు పార్టీల నేతలు అంటున్నారు. సమావేశంలో నాదెండ్ల మనోహర్, నాగేంద్ర బాబు కూడా పాల్గొన్నారు. వైఎస్ఆర్‌సీపీ దాష్టీకాలను ఎదుర్కోవాలంటే కలసి పోరాడాల్సిందేనన్న అభిప్రాయానికి అందరూ వచ్చినట్లుగా తెలుస్తోంది. చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ ఉంటుందని చివరి క్షణం వరకూ ఎవరికీ తెలియదు. చంద్రబాబు నోవాటెల్ హోటల్‌కు వచ్చిన తర్వాతనే అందరికీ తెలిసింది. దీంతో వైఎస్ఆర్‌సీపీ వర్గాలు కూడా ఉలిక్కిపడ్డాయి. వెంటనే పవన్ కల్యాణ్‌పై వరుసగా విమర్శలు చేస్తూ ప్రెస్ మీట్లు ఏర్పాటు చేశారు. దమ్ముంటే ఒంటరిగా పోటీ చేయాలని సవాళ్లు చేశారు.