Harish Rao: 'ఆకులు రాలే కాలం, కొత్త చిగురు మళ్లీ పార్టీలోకి వస్తుంది' - పార్టీ మారుతున్న నేతలపై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు
Telangana News: ప్రస్తుతం ఆకులు రాలే కాలమని.. త్వరలోనే కొత్త చిగురు బీఆర్ఎస్ లోకి వస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. కష్టకాలంలో పార్టీ మారుతున్న నేతలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Harish Rao Sensational Comments: కొంత మంది రాజకీయ అవకాశవాదులు, పవర్ బ్రోకర్లు పార్టీని వీడి పోతున్నారని మాజీ మంత్రి, సిద్ధిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు (Harish Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం దుబ్బాక నియోజకవర్గంలో నిర్వహించిన మెదక్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఇలాంటి పరిస్థితి ఏమీ బీఆర్ఎస్ కు కొత్తేమీ కాదని.. తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టినప్పుడు పట్టుమని 10 మంది కూడా పార్టీలో లేరని.. అయినా కేసీఆర్ మొక్కవోని ధైర్యంతో ప్రత్యేక రాష్ట్రం తెచ్చి చూపించారని ప్రశంసించారు. ఆనాడు ఉద్యమ సమయంలో కేసీఆర్ పక్కన ఉన్న నాయకులను కాంగ్రెస్ వాళ్లు ఇలాగే కొన్నారని మండిపడ్డారు. హస్తం పార్టీ నాయకులను కొనవచ్చని.. కానీ ఉద్యమకారులు, కార్యకర్తలను కొనలేరని అన్నారు. 'పార్టీలోకి మధ్యలో వచ్చిన వారు మధ్యలోనే వెళ్లిపోతున్నారు. అలా వెళ్లిన వారిని రేపటి రోజున కాళ్లు మొక్కినా తిరిగి పార్టీలోకి చేర్చుకోకూడదని నిర్ణయించాం. కష్టకాలంలో పార్టీకి ద్రోహం చేస్తే కన్నతల్లికి ద్రోహం చేసినట్లే. ఇది ఆకులు రాలే కాలం. కొత్త చిగురు మళ్లీ పార్టీలోకి వస్తుంది.' అని హరీష్ రావు వ్యాఖ్యానించారు.
'ఉద్యమకారుల అడ్డా..'
గులాబీ జెండాకు తొలి నుంచి అడ్డా దుబ్బాక గడ్డ.. ఉద్యమకారుల అడ్డాగా నిలిచిందని హరీష్ రావు అన్నారు. 'తొలి నుంచి బీఆర్ఎస్‌ను ఆదరిస్తున్న దుబ్బాక ప్రజలు, కార్యకర్తలకు కృతజ్ఞతలు. దుబ్బాకకు సాగునీరు, తాగునీరు తెచ్చింది బీఆర్ఎస్. కాంగ్రెస్, బీజేపీ చేసిందేమీ లేదు. కాంగ్రెస్ అబద్ధాలను, మోసాలనే ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి. 6 గ్యారంటీలను అమలు చేయలేని కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ హయాంలో ఏదో జరిగిందని అబద్ధాలు ప్రచారం చేస్తోంది. హామీలు అమలు చేసే వరకూ కాంగ్రెస్ పార్టీకి చుక్కలు చూపిస్తాం. కాంగ్రెస్ మెడలు వంచి హామీలను అమలు చేయిస్తాం. సీఎం రేవంత్ ఇంకా ప్రతిపక్ష నాయకుడిలానే మాట్లాడుతున్నారు. మావవబాంబులా కాదు, మానవీయంగా ప్రవర్తించు రేవంత్ రెడ్డి!. వంద రోజుల పాలన చూసి ఓటేయమని రేవంత్ అడుగుతున్నారు. మరి ఎన్నికల హామీలను అమలు చేశారా? రూ.4 వేల పింఛన్, రైతుబంధు, వడ్లకు బోనస్ వచ్చిందా?. గడువులు దాటిపోయినా హామీలు ఏవీ అమలు కాలేదు. అందుకే ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు చురక పెట్టాలి.' అని ప్రజలకు పిలుపునిచ్చారు.
దుబ్బాక ఉప ఎన్నికల్లో బూటకపు హామీలిచ్చి గెలిచిన రఘునందన్ రావు కూడా మళ్లీ మోసం చేయడానికి వస్తున్నారని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగ భృతి, రెండు ఎడ్లు, నాగలి ఏవేవో ఇస్తామని మాట తప్పారని మండిపడ్డారు. విద్యావంతుడైన, కలెక్టర్‌గా పని చేసిన బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే ఢిల్లీలో మన గళం బలంగా వినిపిస్తారని.. కేంద్రం నుంచి నిధులు తెప్పిస్తారని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయానికి అంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీకి అండగా నిలబడ్డ నాయకులు, కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుంటామని హరీష్ స్పష్టం చేశారు.